అదే జరిగితే బుమ్రా కెరీర్‌ ముగిసినట్లే: కివీస్‌ మాజీ పేసర్‌ వార్నింగ్‌ | Another Back injury in Same spot could End Bumrah Career: Shane Bond | Sakshi
Sakshi News home page

అదే జరిగితే బుమ్రా కెరీర్‌ ముగిసినట్లే: కివీస్‌ మాజీ పేసర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Published Wed, Mar 12 2025 5:49 PM | Last Updated on Wed, Mar 12 2025 6:12 PM

Another Back injury in Same spot could End Bumrah Career: Shane Bond

న్యూజిలాండ్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షేన్‌ బాండ్‌( Shane Bond) భారత క్రికెట్‌ జట్టు యాజమాన్యానికి కీలక సూచన చేశాడు. టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah)పై పనిభారం తగ్గించాలని సూచించాడు. లేదంటే ప్రపంచకప్‌ నాటికి అతడు అందుబాటులో ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా క్రికెటర్లలో గాయాల బెడద ఎక్కువగా ఉండేది ఫాస్ట్‌బౌలర్లకే.

బుమ్రా కూడా ఇందుకు అతీతం కాదు. గతంలో చాలాసార్లు అతడు వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌-2022 వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు దూరమయ్యాడు. ఏడాది పాటు జట్టు అతడి సేవలను కోల్పోయింది. అనంతరం వన్డే వరల్డ్‌కప్‌-2023 నాటికి తిరిగి జట్టుతో చేరిన బుమ్రా.. టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2024 గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

తాత్కాలిక కెప్టెన్‌గా 
ఆ తర్వాత కూడా జట్టుతో కొనసాగిన ఈ రైటార్మ్‌ పేసర్‌.. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మరోసారి గాయపడ్డాడు. కంగారూ దేశ టూర్‌లో భాగంగా తొలి టెస్టుకు, ఆఖరి టెస్టుకు బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ క్రమంలో చివరిదైన ఐదో టెస్టులో భాగంగా వెన్నునొప్పితో విలవిల్లాడిన బుమ్రా ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్‌ చేయించుకున్నాడు.

ఇక ఈ టూర్‌ ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కూడా బుమ్రా కోలుకోలేదు. ఫిట్‌నెస్‌ సాధించని కారణంగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 మొత్తానికి దూరమయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలో కివీస్‌ మాజీ పేసర్‌  షేన్‌ బాండ్‌ మాట్లాడుతూ... ‘‘అతడొక విలువైన బౌలర్‌. వచ్చే వరల్డ్‌కప్‌లో అతడి పాత్ర కీలకం.

అయితే, త్వరలోనే టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడబోతోంది. నేను గనుక టీమిండియా మేనేజ్‌మెంట్‌ స్థానంలో ఉంటే.. అతడిని వరుసగా రెండు టెస్టుల్లో ఆడించను. ఐపీఎల్‌ తర్వాత వెనువెంటనే వరుస టెస్టులు ఆడించడం పెద్ద రిస్క్‌.

అదే జరిగితే బుమ్రా కెరీర్‌ ముగిసినట్లే
అలా కాకుండా మధ్యలో కాస్త విశ్రాంతినిస్తే అతడు ఫిట్‌గా ఉండేందుకు అవకాశం ఉంది. మిగతా ఫార్మాట్లలోనూ ఆడగలుగుతాడు. జట్టులోని ప్రధాన, అత్యుత్తమ బౌలర్‌ ప్రతిసారి గాయం వల్ల ప్రతిష్టాత్మక ఈవెంట్లకు దూరం కావడం మంచిదికాదు.

ఒకవేళ అతడు మరోసారి ఇదే తరహాలో గాయపడితే మాత్రం.. కెరీర్‌కే ఎండ్‌కార్డ్‌ పడే ప్రమాదం ఉంది. కాబట్టి అతడిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకేచోట పదే పదే గాయమైతే సర్జరీ చేసినా ఉపయోగం ఉండదు’’ అని టీమిండియా యాజమాన్యాన్ని హెచ్చరించాడు. ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో షేన్‌ బాండ్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

కాగా చివరగా ఆసీస్‌తో టెస్టుల్లో టీమిండియా తరఫున బరిలోకి దిగిన బుమ్రా.. ఐదు మ్యాచ్‌లలో కలిపి 32 వికెట్లు తీశాడు. అయితే, ఈ సిరీస్‌లో భారత్‌ 3-1తో కంగారూల చేతిలో ఓడిపోయింది. ఇదిలా ఉంటే.. బుమ్రా లేకుండానే టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచింది. 

దుబాయ్‌లో ఐదుగురు స్పిన్నర్లతో రంగంలోకి దిగి విజేతగా అవతరించింది. ఇక బుమ్రా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియన్స్‌ ఆరంభ మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే ఛాన్స్‌ ఉంది.

చదవండి: IND vs ENG: గంభీర్‌ మాస్టర్‌ ప్లాన్‌.. ఇంత వరకు ఏ కోచ్‌ చేయని విధంగా..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement