టీమిండియా (ఫైల్ ఫొటో)
CWC 2023- India 15- Member Squad Analysis: వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి మంగళవారం ప్రకటించిన జట్టుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వన్డేల్లో మెరుగైన రికార్డు లేనప్పటికీ సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
అదే విధంగా 15 మంది సభ్యుల జట్టులో ఆఫ్ స్పిన్నర్‌కు చోటు లేకపోవడం కూడా ఆందోళనగా పరిణమించింది. మరి.. ఐసీసీ ఈవెంట్‌కు బీసీసీఐ ఈ జట్టును ఎంపిక చేయడం వెనుక కారణాలను పరిశీలిస్తే..
అందుకే రాహుల్‌కు స్థానం
టాపార్డర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, అతడి ఓపెనింగ్ జోడి శుబ్‌మన్ గిల్.. రన్‌మెషిన్ విరాట్ కోహ్లిల విషయంలో మరో చర్చకు తావు లేదు. అదే విధంగా.. గాయాలపాలు కాక ముందు 4, 5 స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ల స్థానాలకు ఢోకా లేదు.
టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా పదేపదే ఇదే చెబుతూ వచ్చాడు. అదే నమ్మకంతో కేఎల్ రాహుల్‌కు అవకాశం దక్కింది. మేలో ఐపీఎల్ తర్వాత మైదానంలోకి దిగకపోయినా, ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైనా అతని స్థానానికి ఇబ్బంది లేకుండా పోయింది.
సంజూ కంటే ఇషాన్ మెరుగ్గా
వన్డేల్లో మిడిలార్డర్‌లో మంచి రికార్డు ఉండటం కూడా అందుకు ఒక కారణం. ఫిట్‌గా ఉంటే ప్రధాన వికెట్ కీపర్‌గా రాహుల్‌కే మొదటి అవకాశం దక్కుతుంది. వరుసగా నాలుగు వన్డేల్లో అర్ధసెంచరీలు సాధించి మరో కీపర్‌గా ఇషాన్ కిషన్ తన స్థానం నిలబెట్టుకున్నాడు.
సూర్యను అందుకే సెలక్ట్ చేశారు!
కొద్ది రోజుల వరకు కూడా సంజూ శాంసన్‌తో పోటీ పడినా... రేసులో కేరళ బ్యాటర్ వెనుకబడిపోయాడు. వన్డే ఫామ్ గొప్పగా లేకపోయినా కొన్ని బంతుల వ్యవధిలో ఆట దిశ మార్చగలడంటూ సెలక్టర్లు సూర్యకుమార్‌పై నమ్మకముంచారు.
వాళ్ల గురించి చెప్పేదేముంది?
ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే తరహాలో కీలక సమయాల్లో ఆదుకోగల శార్దుల్ ఠాకూర్‌కూ అవకాశం దక్కింది. ప్రధాన పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు.
ఎవరో ఒక్కరికే చోటు!
ఇక స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ జట్టులో ఉన్నారు. ఒకే తరహాశైలి గల వీరిద్దరికి ఒకేసారి తుది జట్టులో స్థానం సందేహమే. అదే విధంగా.. కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వరల్డ్ కప్ అవకాశం సొంతం చేసుకోగా... లెగ్‌స్పిన్నర్ యజువేంద్ర చహల్ మాత్రం మెగా టోర్నీకి దూరమయ్యాడు.
అదొక్కటే లోటు
అంతా బాగున్నా మొత్తం జట్టులో ఒకే ఒక లోటు రెగ్యులర్ ఆఫ్‌స్పిన్నర్ లేకపోవడమే. భారత పిచ్‌లపై, ప్రత్యర్థి జట్లలో అగ్రశ్రేణి ఎడంచేతి వాటం బ్యాటర్లు ఎక్కువ మంది ఉండగా ఆఫ్‌స్పిన్నర్ బాగా ప్రభావం చూపగలిగేవాడు. సీనియర్ రవిచంద్రన్ అశ్విన్ లేదంటే యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను పరిశీలించినా బాగుండేది.
చదవండి: అందుకే అక్షర్‌ను తీసుకున్నాం.. మేము క్లియర్‌గానే ఉన్నాం!
Comments
Please login to add a commentAdd a comment