
సూర్యకుమార్ యాదవ్- రాహుల్ ద్రవిడ్ (PC: BCCI)
ICC ODI WC 2023- Suryakumar Yadav Vs Sanju Samson: వన్డేల్లో వరుసగా విఫలమవుతున్న టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ అండగా నిలిచాడు. వన్డే ప్రపంచకప్-2023 జట్టులో ఈ టీ20 స్టార్ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని స్పష్టం చేశాడు. సూర్యకు మేనేజ్‌మెంట్ మద్దతు కొనసాగుతుందని ఉద్ఘాటించాడు.
ఆడిన ఒక్క మ్యాచ్‌లోనూ..
కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఆరంభం కానున్న ఐసీసీ ఈవెంట్‌కు ఇప్పటికే బీసీసీఐ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ముంబై బ్యాటర్ సూర్యకు చోటు దక్కింది. అయితే, కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను కాదని సూర్యను ఎంపిక చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక ఆసియా వన్డే కప్-2023లో ఆడిన ఒకే ఒక్క మ్యాచ్‌లోనూ సూర్య వైఫల్యం వీటిని బలపరించింది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 28 వరకు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో మిస్టర్ 360 ప్లేయర్‌కు ఉద్వాసన పలికి వేరొకరికి అవకాశమిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సూర్యకు మా పూర్తి మద్దతు ఉంటుందన్న ద్రవిడ్
ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘27 గురించి సూర్య దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మేము వరల్డ్‌కప్ జట్టును ఎంపిక చేసుకున్నాం. ఇందులో సూర్య ఉన్నాడు. మా నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అతడికి పూర్తిగా మద్దతుగా నిలుస్తాం. టీ20 క్రికెట్‌లో అతడి సత్తా ఏమిటో అందరికీ తెలుసు. అతడి నైపుణ్యాలు, సామర్థ్యాలపై మాకు నమ్మకం ఉంది.
వన్డేల్లో ఆరోస్థానంలో సూర్య బ్యాటింగ్ చేయగలడు. ఒంటిచేత్తో మలుపు తిప్పగల సత్తా ఉన్నవాడు. అందుకే అతడికి ఎల్లప్పుడూ మా సహకారం, అండ ఉంటాయి. ఇదే నిజం. సంపూర్ణ మద్దతు అతడికి ఉంటుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో అతడు పుంజుకుంటాడనే అనుకుంటున్నాం.
సంజూ శాంసన్
ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రాణిస్తాడు
కనీసం రెండు మ్యాచ్‌లు అయినా ఆడతాడు కాబట్టి వన్డే క్రికెటర్‌గా తన ప్రయాణం సజావుగా కొనసాగాలని ఆశిస్తున్నాం. ఏదేమైనా వరల్డ్‌కప్ జట్టు విషయంలో అతడి గురించి తుది నిర్ణయం తీసుకున్నాం’’ అని ద్రవిడ్ కుండబద్దలు కొట్టాడు.
సంజూను మర్చిపోవాల్సిందే
దీంతో సంజూ వరల్డ్‌కప్ ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయని, ఈసారికి మర్చిపోవాల్సిందేనని అభిమానులు ఉసూరుమంటున్నారు. కాగా ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో సూర్యకు అవకాశం దక్కింది.
ఇక సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు మొత్తంగా ఆడిన 28 వన్డేల్లో 24.41 సగటుతో 537 పరుగులు చేశాడు. మరోవైపు సంజూ శాంసన్ 13 వన్డేల్లో 55.71 సగటుతో 390 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉన్నాయి.
చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు..