
నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోరు
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
కోల్‌కతా: ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న గుజరాత్ టైటాన్స్ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో పోరుకు సిద్ధమైంది. కేకేఆర్ జట్టు లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు 259 మ్యాచ్‌లాడగా... అందులో మూడుసార్లు మాత్రమే గుజరాత్ టైటాన్స్‌తో తలపడింది. షెడ్యూల్ కారణంగా ఇరు జట్ల మధ్య తక్కువ మ్యాచ్‌లు జరగగా... సోమవారం పోరులో అటు కేకేఆర్, ఇటు గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్లే ప్రధాన ఆయుధంగా బరిలోకి దిగనున్నాయి.
వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ రూపంలో ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు కోల్‌కతాకు అందుబాటులో ఉండగా... గుజరాత్ తరఫున రషీద్ ఖాన్, సాయికిషోర్ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత సీజన్‌లో శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 2 పరాజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
గతంలో కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహించిన గిల్... తన పాత జట్టుపై విజృంభించాలని చూస్తుంటే... విండీస్ ద్వయం రసెల్, నరైన్ సమష్టిగా కదంతొక్కి జట్టును గెలుపు బాట పట్టించాలని కోల్‌కతా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి తప్పించిన అనంతరం తిరిగి కేకేఆర్ గూటికి చేరిన అభిషేక్ నాయర్ ఈ మ్యాచ్‌లో డగౌట్ నుంచి కోల్‌కతా ప్లేయర్లకు సలహాలు ఇవ్వనున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో విజయంతో గుజరాత్ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుందా... లేక సొంతగడ్డపై కోల్‌కతా విజయ దరహాసం చేస్తుందా చూడాలి!
నిలకడ లేమి సమస్య...
డిఫెండింగ్ చాంపియన్‌గా సీజన్ ఆరంభించిన కోల్‌కతా... స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోతోంది. పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన కేకేఆర్... 95 పరుగులకే కుప్పకూలింది. బ్యాటర్లు ముకుమ్మడిగా విఫలమవడంతో కోల్‌కతా మూల్యం చెల్లించుకుంది. అయితే అభిõÙక్ నాయర్ రాకతో జట్టులో జవసత్వం నిండుతుందని యాజమాన్యం ఆశిస్తోంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇకపై ఆడనున్న అన్నీ మ్యాచ్‌లు కీలకమైన నేపథ్యంలో... ప్లేయర్లంతా సమష్టిగా సత్తా చాటాలని చూస్తున్నారు.
ముఖ్యంగా వేలంలో రూ. 23.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్ అయ్యర్ కనీస ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో వెంకటేశ్ 24.20 సగటుతో 121 పరుగులు చేయగా... రమణ్‌దీప్ కేవలం 29 పరుగులే చేశాడు. హిట్టర్లుగా పేరున్న రసెల్ 5 మ్యాచ్‌ల్లో 34 పరుగులకే పరిమితం కాగా... రింకూ సింగ్ 38.66 సగటుతో 116 పరుగులు చేశాడు.
కెప్టెన్ అజింక్య రహానే 2 అర్ధశతకాల సాయంతో 221 పరుగులు చేయగా... 20 ఏళ్ల రఘువంశీ 170 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్లు సునీల్ నరైన్, డికాక్ కొన్ని మెరుపులు మెరిపిస్తున్నా... నిలకడగా జట్టుకు శుభారంభం అందించలేకపోతున్నారు. ఈ లోపాలన్నీ సరిద్దిద్దుకుంటేనే కేకేఆర్ తిరిగి గెలుపు పట్టాలెక్కనుంది. బౌలింగ్‌లో హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి మంచి ఫామ్‌లో ఉన్నారు.
అన్నీ రంగాల్లో పటిష్టంగా...
అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో గుజరాత్ టైటాన్స్ బలంగా కనిపిస్తోంది. టాప్–3 ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్ చక్కటి ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసి రానుంది. రూథర్‌ఫార్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా రూపంలో మిడిలార్డర్ కూడా పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో శతకానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయిన బట్లర్ ఈ సీజన్‌లో 63.00 సగటుతో 315 పరుగులు చేయగా... సాయి సుదర్శన్ 365 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందు వరుసలో ఉన్నాడు.
బౌలింగ్‌లోనూ గుజరాత్‌కు ఇబ్బందులు లేవు. సీనియర్ పేసర్ ప్రసిధ్ కృష్ణ తాజా సీజన్‌లో 14 వికెట్లు పడగొట్టి దూకుడు మీద ఉండగా... హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ అతడికి చక్కటి సహకారం అందిస్తున్నారు. తమిళనాడు స్పిన్నర్ సాయి కిషోర్ తనకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తుండగా... రషీద్ ఖాన్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు.
తుది జట్లు (అంచనా)
కోల్‌కతా నైట్ రైడర్స్: రహానే (కెప్టెన్), నరైన్, డికాక్, వెంకటేశ్ అయ్యర్, రఘువంశీ, రింకూ సింగ్, రసెల్, రమన్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, నోర్జే, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
గుజరాత్ టైటాన్స్: గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్, రూథర్‌ఫర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.