
ఆకాశమే హద్దుగా చెలరేగిన హిట్‌మ్యాన్, సూర్యకుమార్
177 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించిన ముంబై
చెన్నైపై 9 వికెట్లతో జయభేరి
పంజాబ్‌పై 7 వికెట్లతో ఆర్‌సీబీ గెలుపు
కట్టడి చేసిన కృనాల్, సుయశ్
రాణించిన విరాట్, పడిక్కల్
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ విజృంభించారు. భారీ షాట్లతో అలరిస్తూ ఆదివారం అభిమానులకు డబుల్ ధమాకా అందించారు. పంజాబ్ కింగ్స్‌తో పోరులో కోహ్లి క్లాసిక్ ఇన్నింగ్స్‌తో కదంతొక్కగా... చెన్నైతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఊర మాస్ షాట్లతో చెలరేగిపోయాడు. ఫలితంగా పంజాబ్‌పై బెంగళూరు బదులు తీర్చుకోగా... చెన్నైపై ముంబై ఇండియన్స్ భారీ విజయం నమోదు చేసుకుంది.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఓ మాదిరి ప్రదర్శనతో సరిపెట్టుకున్న రోహిత్... తనను ‘హిట్‌మ్యాన్’ ఎందుకు అంటారో వాంఖడేలో నిరూపించాడు. విరాట్ దూకుడుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లగా... రోహిత్ మెరుపులతో ముంబై నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లుగా తొలి ఓవర్‌లోనే క్రీజులో అడుగుపెట్టిన ఈ ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచి తమ జట్లను గెలిపించడం కొసమెరుపు.
ముంబై: సిక్స్... ఫోర్... ముంబై ఇన్నింగ్స్ మొత్తం ఇదే తీరు! బంతి పడటమే ఆలస్యం బౌండరీ వెళ్లెందుకు ఓసారి, సిక్స్ అయ్యేందుకు మరోసారి బంతి అదేపనిగా ముచ్చట పడిందనిపించింది. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ, టి20 స్పెషలిస్ట్ సూర్యకుమార్‌ల ఆట మ్యాచ్‌లో హైలైట్స్‌ను చూపించలేదు. హైలైట్సే మ్యాచ్‌గా మార్చేసింది. దీంతో ముంబై 177 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. చెన్నైపై 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
ముందుగా చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), సూర్య (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) హోరెత్తించారు.
దంచేసిన జడేజా, దూబే
ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ (20 బంతుల్లో 19; 1 ఫోర్)కు ఓపెనింగ్‌లో అవకాశమిస్తున్న ధోనిని నిరుత్సాహపరిచాడు. పవర్‌ప్లేలో 20 బంతులాడి కూడా ఒకే ఒక్క బౌండరీ బాదాడు. రచిన్ రవీంద్ర (5) విఫలమవగా, 17 ఏళ్ల ‘లోకల్ బాయ్’ ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉన్నది కాసేపే అయినా ఫోర్లు, సిక్స్‌లతో అలరించాడు.
తర్వాత వచ్చిన జడేజా, దూబే భారీషాట్లు బాదడంతో చెన్నై పుంజుకుంది. ఇద్దరు నాలుగో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. సిక్స్‌లు బాదిన దూబే 30 బంతుల్లో, జడేజా 34 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ధోని (4)ని బుమ్రా ఎంతో సేపు నిలువనీయలేదు.
బాదుడే... బాదుడు
రోహిత్ శర్మకు జతగా ఓపెనింగ్ చేసిన రికెల్టన్ తొలి ఓవర్లోనే బౌండరీలతో తమ ఉద్దేశం చాటగా, రెండో ఓవర్ నుంచి రోహిత్ విరుచుకుపడటంతో చెన్నై బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. జేమీ ఓవర్టన్ ఓవర్‌న్నర (9 బంతులు) వేసిన ఐదో ఓవర్లో రికెల్టన్, రోహిత్ చెరో సిక్స్ కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో 62 పరుగులు చేసిన ముంబై తర్వాతి ఓవర్లోనే రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్‌ను కోల్పోయింది.
సూర్యకుమార్ రావడం... రోహిత్‌తో కలిసి ధనాధన్ షోను డబుల్ చేసింది. ఇద్దరు బౌండరీలు, సిక్సర్లు కొట్టేందుకు పోటీపడటంతో స్టేడియం హోరెత్తింది. ముందుగా ‘హిట్‌మ్యాన్’ 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... సూర్య 26 బంతుల్లో అర్ధసెంచరీ అధిగమించాడు. ఇద్దరు బంతిని అదేపనిగా బౌండరీలైన్‌ను దాటిస్తూనే ఉండటంతో లక్ష్యం ముంబై వైపు నడిచివచ్చింది.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: షేక్ రషీద్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 19; రచిన్ (సి) రికెల్టన్ (బి) అశ్వని 5; ఆయుశ్ (సి) సాంట్నర్ (బి) దీపక్ చహర్ 32; జడేజా (నాటౌట్) 53; దూబే (సి) జాక్స్ (బి) బుమ్రా 50; ధోని (సి) తిలక్ (బి) బుమ్రా 4; జేమీ ఓవర్టన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–16, 2–57, 3–63, 4–142, 5–156. బౌలింగ్: చహర్ 4–0–32–1, బౌల్ట్ 4–0–43–0, అశ్వని 2–0–42 –1, సాంట్నర్ 3–0–14–1, బుమ్రా 4–0–25–2, విల్ జాక్స్ 1–0–4–0, హార్దిక్ 2–0–13–0.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) ఆయుశ్ (బి) జడేజా 24; రోహిత్ (నాటౌట్) 76; సూర్యకుమార్ (నాటౌట్) 68; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (15.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 177. వికెట్ల పతనం: 1–63. బౌలింగ్: ఖలీల్ 2–0–24–0, ఓవర్టన్ 2–0– 29–0, అశ్విన్ 4–0–25–0, జడేజా 3–0–28–1, నూర్ 3–0–36–0, పతిరణ 1.4–0–34–0.
ముల్లాన్‌పూర్: ముందు బౌలర్లు, తర్వాత బ్యాటర్లు రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు తమ సొంతగడ్డపై పొగొట్టుకున్న ఫలితాన్ని పంజాబ్‌కు వెళ్లి రాబట్టుకుంది. ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
జోష్ ఇన్‌గ్లిస్ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), శశాంక్ సింగ్ (33 బంతుల్లో 31; 1 ఫోర్) మెరుగ్గా ఆడారు. కృనాల్, సుయశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించాడు.
కోహ్లి ఆఖరిదాకా...
పెద్ద లక్ష్యం కాకపోయినా... బెంగళూరు జట్టు తమ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (1) వికెట్‌ను తొలి ఓవర్లోనే కోల్పోయింది. పంజాబ్‌కు దక్కింది ఈ ఆరంభ సంబరమే! అటు తర్వాత కథంతా కింగ్ కోహ్లి, పడిక్కల్ నడిపించారు. వన్‌డౌన్ బ్యాటర్ పడిక్కల్ భారీ సిక్సర్లతో విరుచుకుపడగా... కోహ్లి క్లాసిక్స్ షాట్‌లతో ముల్లాన్‌పూర్ ప్రేక్షకుల్ని గెలిచాడు. ఇద్దరు రెండో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. పడిక్కల్ అవుటైనా... ఆఖరిదాకా క్రీజులో నిలబడిన కోహ్లి జట్టును గెలిపించాడు.
స్కోరు వివరాలు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 22; ప్రభ్‌సిమ్రాన్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 33; అయ్యర్ (సి) కృనాల్ (బి) షెఫర్డ్ 6; ఇన్‌గ్లిస్ (బి) సుయశ్ 29; నేహల్ (రనౌట్) 5; శశాంక్ (నాటౌట్) 31; స్టొయినిస్ (బి) సుయశ్ 1; యాన్సెన్ (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–42, 2–62, 3–68, 4–76, 5–112, 6–114. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–26–0, యశ్ దయాళ్ 2–0–22–0, హాజల్‌వుడ్ 4–0–39–0, కృనాల్ పాండ్యా 4–0–25–2, షెఫర్డ్ 2–0–18–1, సుయశ్ 4–0–26–2.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఇన్‌గ్లిస్ (బి) అర్ష్ దీప్ 1; కోహ్లి (నాటౌట్) 73; పడిక్కల్ (సి) నేహల్ (బి) హర్‌ప్రీత్ 61; పాటీదార్ (సి) యాన్సెన్ (బి) చహల్ 12; జితేశ్ శర్మ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–6, 2–109, 3–143. బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–26–1, జేవియర్ 3–0–28–1, హర్‌ప్రీత్ బ్రార్ 4–0–27–1, యాన్సెన్ 3–0–20–0, చహల్ 4–0–36–1, స్టొయినిస్ 1–0–13–0, నేహల్ 0.5–0–9–0.
ఐపీఎల్‌లో నేడు
కోల్‌కతా X గుజరాత్
వేదిక: కోల్‌కతా
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం