టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 వేలంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్‌తో సుదీర్ఘ బంధాన్ని తెంచుకునేందుకు హిట్‌మ్యాన్ సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ గనుక వేలంలోకి వస్తే దక్కించుకునేందుకు మూడు ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నట్లు ఐపీఎల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ఫ్రాంఛైజీ క్రికెట్ డెవలప్‌మెంట్ హెడ్ సంజయ్ బంగర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. కాగా ఐపీఎల్‌లో ఓ జట్టును అత్యధికసార్లు చాంపియన్‌గా నిలిపిన మొదటి కెప్టెన్‌గా రోహిత్ శర్మ తన పేరును చరిత్రపుటల్లో లిఖించుకున్నాడు.
ముంబై యాజమాన్యంతో విభేదాలు?
ముంబై జట్టుకు ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ అందించి ఈ ఘనత సాధించాడు. అయితే, గతేడాది ముంబై ఫ్రాంఛైజీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు వేసి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ ధరకు హార్దిక్‌ను ట్రేడ్ చేసుకుని మరీ కెప్టెన్‌గా నియమించింది.
ఈ క్రమంలో ముంబై యాజమాన్యం- రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయనే సంకేతాలు వెలువడ్డాయి. ఇక మైదానంలో రోహిత్ పట్ల హార్దిక్ వ్యవహరించిన తీరు కూడా విమర్శలు తావిచ్చింది. ఈ నేపథ్యంలో ముంబై జట్టును వీడేందుకు రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడని ఐపీఎల్ వర్గాలు లీకులు ఇచ్చాయి. అతడు గనుక వేలంలోకి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ పోటీపడనున్నాయని వెల్లడించాయి.
తగినంత డబ్బు ఉంటే కొనుక్కుంటాం
ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్‌కు చెందిన సంజయ్ బంగర్ ఓ యూట్యూబ్ చానెల్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ రోహిత్ గనుక వేలంలోకి వస్తే మాత్రం.. అతడు భారీ ధరకు అమ్ముడుపోవడం ఖాయం. అయితే, మా పర్సులో ఎంత డబ్బు ఉందనే అంశం మీదే అంతా ఆధారపడి ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. తమ దగ్గర తగినంత డబ్బు ఉంటే రోహిత్ శర్మను కచ్చితంగా సొంతం చేసుకుంటామని చెప్పకనే చెప్పాడు.
సుదీర్ఘ అనుబంధం
కాగా తొలుత దక్కన్ చార్జర్స్ హైదరాబాద్‌కు ఆడిన రోహిత్ శర్మ.. 2011లో ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఆ తర్వాత రెండేళ్లకు రిక్కీ పాంటింగ్ స్థానంలో ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి పదేళ్లపాటు సారథిగా కొనసాగిన రోహిత్ ప్రయాణానికి హార్దిక్ రాకతో ఈ ఏడాది తెరపడింది.
అయితే, ఇదే ఏడాది టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీని రోహిత్ గెలవడం విశేషం. ఈ నేపథ్యంలో ముంబై అతడిని రిటైన్ చేసుకుంటుందా? ఒకవేళ ఆ ఆఫర్ ఇచ్చినా రోహిత్ శర్మ అందుకు సమ్మతిస్తాడా? అన్న సందేహాలకు వేలానికి ముందే సమాధానం దొరకనుంది.
చదవండి: రిటైర్మెంట్ తర్వాత.. అభిమానులకు శుభవార్త చెప్పిన ధావన్
Comments
Please login to add a commentAdd a comment