ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గనుక వేలంలోకి వస్తే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అతడిని కొనుగోలు చేయాలని సూచించాడు. అంతేకాదు.. హిట్‌మ్యాన్‌ను ఆర్సీబీ తమ సారథిగా నియమిస్తే.. ట్రోఫీ గెలవాలన్న చిరకాల కల నెరవేరుతుందన్నాడు.
కాగా 2008లో ఆరంభమైన ఐపీఎల్‌లో రోహిత్ శర్మ తొలుత దక్కన్ చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. రెండో ఎడిషన్‌లో టైటిల్ గెలిచిన చార్జర్స్‌లో అతడు సభ్యుడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ రోహిత్‌ను కొనుగోలు చేసి.. జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో తన కెప్టెన్సీ నైపుణాల్యతో ముంబైని ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు.
తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డు
తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. అయితే, ఈ ఏడాది ముంబై ఇండియన్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మపై వేటు వేసి.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను తమ కెప్టెన్‌గా నియమించుకుంది.
ఈ క్రమంలో అసంతృప్తికి లోనైన రోహిత్ శర్మ జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడని.. ముంబై ఫ్రాంఛైజీతో అతడి బంధం ముగిసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ‘‘రోహిత్ వేలంలోకి వస్తే ఆర్సీబీ.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
టైటిల్ కరువు తీరుతుంది
అంతేకాదు.. రోహిత్‌ను ఒప్పించి తమ కెప్టెన్‌గా నియమించుకోవాలి. బ్యాటర్‌గా రోహిత్ మరీ మునుపటిలా పరుగులు రాబట్టలేకపోవచ్చు. ఫార్టీ, ఫిఫ్టీస్ మాత్రం చేయగలడు. అయితే, కెప్టెన్‌గా తుదిజట్టు కూర్పును మాత్రం చక్కగా సెట్ చేస్తాడు. అతడి వల్ల ఆర్సీబీకి లాభం చేకూరుతుంది.
టైటిల్ కరువు తీరుతుంది. ఏ ఆటగాడి సేవలను ఎప్పుడు ఎలా వాడుకోవాలో రోహిత్‌కు బాగా తెలుసు. కెప్టెన్‌గా తన ప్రణాళికలు, వ్యూహాలు అమోఘం. ఒకవేళ ఆర్సీబీకి గనుక అవకాశం దొరికితే.. రోహిత్ శర్మను కొని, కెప్టెన్ చేసుకుని తీరాల్సిందే’’ అని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. రోహిత్ ఐపీఎల్‌లో కొనసాగితే ఏదైనా ఒక జట్టుకు కెప్టెన్‌గా మాత్రమే ఉండాలని పేర్కొన్నాడు.
మూడుసార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీ
కాగా ఇప్పటి వరకు మూడుసార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీ.. ఆఖరి గండాన్ని మాత్రం దాటలేకపోయింది. 2009లో దక్కన్ చార్జర్స్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి టైటిల్ మిస్ చేసుకుంది. ఇక టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి చాలాకాలం పాటు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
అయితే, ప్రస్తుతం ఆటగాడిగా అతడు బెంగళూరు ఫ్రాంఛైజీతోనే కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విదితమే.
చదవండి: అరంగేట్రం చేసిన నాలుగేళ్లకే పాక్ క్రికెటర్ రిటైర్మెంట్.. కానీ ఓ ట్విస్ట్!
Comments
Please login to add a commentAdd a comment