
Syed Mushtaq Ali Trophy 2023-24: టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ దేశవాళీ టీ20 క్రికెట్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023-24 సీజన్‌కు గానూ తమిళనాడు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇందుకు సంబంధించి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రకటన చేసింది. వాషీకి సాయి సుదర్శన్ డిప్యూటీగా వ్యవహరిస్తాడని పేర్కొంది. ఈ మేరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగమయ్యే 15 మంది ఆటగాళ్ల పేర్లను బుధవారం వెల్లడించింది.
కాగా అక్టోబరు 16 నుంచి ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్ ఆరంభం కానుంది. ఈ పొట్టి ఫార్మాట్‌లో ఈవెంట్ చరిత్రలో తమిళనాడుకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు మూడుసార్లు ట్రోఫీ గెలిచిన ఘనత తమిళనాడు సొంతం.
తాజా సీజన్‌లో వాషింగ్టన్ సుందర్ సారథ్యంలో సాయి సుదర్శన్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ సేన్, నారాయణ్ జగదీశన్, విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్, టి.నటరాజన్ తదితర ఐపీఎల్ స్టార్లు ఆడనున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో సుందర్‌కు స్థానం దక్కలేదన్న విషయం తెలిసిందే.
స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా అతడి స్థానంలో చెన్నై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పోటీ పడ్డ వాషీకి మొండిచేయి ఎదురైంది. అనుభవానికి పెద్దపీట వేసిన బీసీసీఐ సెలక్టర్లు అశూ వైపే మొగ్గుచూపారు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023 తమిళనాడు జట్టు:
వాషింగ్టన్ సుందర్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), నారాయణ్ జగదీశన్, విజయ్ శంకర్, సి హరి నిశాంత్, జి.అజితేష్, బాబా అపరాజిత్, ఆర్. సంజయ్ యాదవ్, ఎం. మహ్మద్, ఆర్.సాయి కిషోర్, వరుణ్ చక్రవర్తి, టి. నటరాజన్, కుల్దీప్ సేన్, సందీప్ వారియర్.