రఫ్ఫాడించిన రహానే.. విధ్వంసం సృష్టించిన రుతురాజ్‌ | SMAT 2023: Ruturaj Gaikwad And Ajinkya Rahane Star On Opening Day | Sakshi
Sakshi News home page

SMAT 2023: రఫ్ఫాడించిన రహానే.. విధ్వంసం సృష్టించిన రుతురాజ్‌

Published Tue, Oct 17 2023 9:24 AM | Last Updated on Tue, Oct 17 2023 9:49 AM

Ruturaj Gaikwad And Ajinkya Rahane Star On Opening Day Of SMAT 2023 - Sakshi

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2023 తొలి రోజు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్ల హవా కొనసాగింది. హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో అజింక్య రహానే (ముంబై కెప్టెన్‌), బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ (మహారాష్ట్ర) చెలరేగిపోయారు. హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో రహానే 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేయగా.. బెంగాల్‌తో మ్యాచ్‌లో రుతురాజ్‌ 40 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు సీఎస్‌కే బ్యాటర్లు మెరుపు అర్ధశతకాలు సాధించి, తమతమ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషించారు. 

బెంగాల్‌-మహారాష్ట్ర మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగాల్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. రుతురాజ్‌, కేదార్‌ జాదవ్‌ (40 నాటౌట్‌) రాణించడంతో మహారాష్ట్ర 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. 

ముంబై-హర్యానా మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హర్యానా 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. భారత బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ ఈ మ్యాచ్‌లో హర్యానా ఓపెనర్‌గా బరిలోకి దిగి 38 పరుగులు చేశాడు. హర్యానా ఇన్నింగ్స్‌లో అంకిత్‌ (36), నిషాంత్‌ సంధు (30 నాటౌట్‌) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లు తనుశ్‌ కోటియన్‌ (3-0-19-3), మోహిత్‌ అవస్తి (3-0-15-2) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. 

అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రహానే, శివమ్‌ దూబే (26 నాటౌట్‌) రాణించడంతో 15.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (12) మూడు ఫోర్లు బాది ఇన్నింగ్స్‌ను ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ఔటయ్యాడు. హర్యానా బౌలర్లలో యుజ్వేంద్ర చహల్‌, అన్షుల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement