Netizens Demand To Include Rahane In India's T20 Team - Sakshi
Sakshi News home page

వాళ్లంతా వేస్ట్‌, రహానేనే బెస్ట్‌.. టీమిండియాకు ఎంపిక చేయండి..!

Published Mon, Apr 24 2023 10:10 AM | Last Updated on Mon, Apr 24 2023 10:21 AM

Netizens Demand To Include Rahane In India's T20 Team - Sakshi

కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్‌ 23) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్‌ సెంచరీతో విరుచుకుపడిన సీఎస్‌కే వెటరన్‌ ఆజింక్య రహానే (29 బంతుల్లో 71 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్సర్లు)పై ప్రస్తుతం క్రికెట్‌ సర్కిల్స్‌లో జోరుగా చర్చ సాగుతుంది. నిన్నటి బీభత్సకరమైన ఇన్నింగ్స్‌ తర్వాత రహానేపై ఒక్కసారిగా అంచనాలు పెరగడంతో భారత క్రికెట్‌ అభిమానులంతా అతన్ని టీమిండియాకు ఎంపిక చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు.

నిలకడ లేని లోకేశ్‌ రాహుల్‌లు, శ్రేయస్‌ అయ్యర్‌లు, ఇషాన్‌ కిషన్‌లు, సూర్యకుమార్‌ యాదవ్‌ల కంటే రహానే చాలా బెటరని, అతన్ని టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలోనూ ఆడిస్తే సత్ఫలితాలు ఖాయమని భరోసాగా చెబుతున్నారు. ఒకప్పుడు కేవలం టెస్ట్‌లకే పనికొస్తాడని, ఆతర్వాత ఆ ఫార్మాట్‌కు కూడా పనికిరాడని అగౌరవంగా రహానేను సాగనంపిన సెలెక్టర్లు.. ఈ విషయంలో పునరాలోచన చేయాలని,  ప్రస్తుత ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే టీమిండియా మిడిలార్డర్‌లో రహానే కంటే బెటర్‌ ఆప్షన్‌ దొరకదని సూచిస్తున్నారు.

నిన్నటి ఇన్నింగ్స్‌లో రహానే ఎన్నో వైవిధ్యభరితమైన షాట్లు ఆడాడని, ఇది అతనిలోని మార్పును స్పష్టంగా సూచిస్తుందని, టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో రహానేను ఆడించాలంటే ఇంతకంటే ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. టెస్ట్‌ల్లో అతను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇటీవలికాలంలో అతనెంత రాటుదేలాడో చెప్పడానికి కేకేఆర్‌పై ఆడిన సుడిగాలి ఇన్నింగ్సే నిదర్శనమని అంటున్నారు.

ప్రస్తుత ఐపీఎల్‌లో రహానే స్ట్రయిక్‌ రేట్‌ (199.95) అత్యుత్తమమని.. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌పై మినహా అతనాడిన ప్రతి మ్యాచ్‌లో చెలరేగి ఆడాడని ఉదహరిస్తున్నారు. రహానేను త్వరలో ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆడిస్తే, టీమిండియా మూడోసారి వరల్డ్‌కప్‌ సాధించడం తధ్యమని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా రహానే నామస్మరణతో ప్రస్తుతం సోషల్‌మీడియా హోరెత్తిపోతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement