
ముంబై: డోపింగ్ నిషేధం గడువు ముగియడంతో... సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 టోర్నీలో భారత క్రికెటర్, ముంబై ఓపెనర్ పృథ్వీ షా ఘనంగా పునరాగమనం చేశాడు. వాంఖడే మైదానంలో అస్సాంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై 83 పరుగుల తేడాతో గెలిచింది. 20 ఏళ్ల పృథ్వీ షా 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఆదిత్య తారే 48 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 82 పరుగులు సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 13.4 ఓవర్లలో 138 పరుగులు జోడించారు. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 5 వికెట్లకు 206 పరుగులు చేసింది. అనంతరం అస్సాం 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసి ఓడిపోయింది.
అభయ్ నేగి ‘రికార్డు’ అర్ధ సెంచరీ....
మిజోరంతో జరిగిన మరో మ్యాచ్‌లో మేఘాలయ బ్యాట్స్‌మన్ అభయ్ నేగి 14 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి ఈ టోర్నీ చరిత్రలో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. రాబిన్ ఉతప్ప (15 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును అతను తిరగరాశాడు. అభయ్ నేగి (15 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), ద్వారక రవితేజ (31 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయడంతో మేఘాలయ 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు చేసింది. మిజోరం 20 ఓవర్లలో 2 వికెట్లకు 182 పరుగులు సాధించి ఓడిపోయింది. తరువార్ కోహ్లి (59 బంతుల్లో 90; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), పవన్ (46 బంతుల్లో 72; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment