సాక్షి, విజయనగరం: వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే (54 బంతుల్లో 129 నాటౌట్; 12 ఫోర్లు, 10 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో... సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో కర్ణాటక మూడో విజయం నమోదు చేసింది. సర్వీసెస్‌తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో కర్ణాటక 80 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత కర్ణాటక 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగులు సాధించింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (43 బంతుల్లో 75; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా వీరవిహారం చేశాడు. మనీశ్ పాండే, దేవదత్ రెండో వికెట్‌కు కేవలం 13.5 ఓవర్లలో ఏకంగా 167 పరుగులు జోడించడం విశేషం. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్వీసెస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి ఓడిపోయింది. కర్ణాటక బౌలర్ శ్రేయస్ గోపాల్ 19 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.
దీపక్ చాహర్, మయాంక్ మిశ్రా ‘హ్యాట్రిక్’...
మంగళవారం ఇతర వేదికల్లో జరిగిన మ్యాచ్‌ల్లో రెండు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీసిన దీపక్ చాహర్... ఈ టోర్నీలో రాజస్తాన్ తరఫున బరిలోకి దిగాడు. తిరువనంతపురంలో విదర్భతో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో దీపక్ చాహర్ (4/18) ఇన్నింగ్స్ చివరి ఓవర్లో దర్శన్, శ్రీకాంత్, అక్షయ్‌లను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించాడు. వర్షంవల్ల ఈ మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించగా... విదర్భ 9 వికెట్లకు 99 పరుగులు చేసింది.
అనంతరం వీజేడీ పద్ధతిలో రాజస్తాన్ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 107 పరుగులుగా నిర్ణయించారు. అయితే రాజస్తాన్ 8 వికెట్లకు 105 పరుగులు చేసి ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. విశాఖపట్నంలో గోవాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మయాంక్ మిశ్రా (4/6) హ్యాట్రిక్ సాధించాడు. మయాంక్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో ఆదిత్య, అమిత్ వర్మ, సుయశ్‌లను అవుట్ చేశాడు. తొలుత గోవా 20 ఓవర్లలో 9 వికెట్లకు 119 పరుగులు సాధించగా... ఉత్తరాఖండ్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment