టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ టోర్నీలో హార్దిక్ తన అన్న కృనాల్ పాండ్యా సారథ్యంలో బరోడా జట్టుకు ఆడనున్నాడు. తొలుత ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో హార్దిక్ పేరు లేదు. అయితే హార్దిక్ స్వయంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడేందుకు ఆసక్తి కనబర్చాడని తెలుస్తుంది.
జాతీయ జట్టుకు ఆడని సమయంలో దేశవాలీ క్రికెట్‌లో ఆడతానని హార్దిక్ బీసీసీఐకి చెప్పాడట. దీంతో బరోడా క్రికెట్ అసోసియేషన్ హార్దిక్‌ను తమ జట్టులో చేర్చుకుంది. సహజంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి 18 మంది సభ్యుల జట్టును ప్రకటిస్తారు. తాజాగా హార్దిక్ చేరికతో బరోడా టీమ్ సంఖ్య 18కి పెరిగింది.
ముస్తాక్ అలీ టోర్నీలో బరోడా గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో బరోడాతో పాటు తమిళనాడు, గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక, సిక్కిం, త్రిపుర జట్లు ఉన్నాయి. హార్దిక్ త్వరలో ఇండోర్‌లో జరిగే ట్రైనింగ్ క్యాంప్‌లో బరోడా జట్టుతో జాయిన్ అవుతాడు. బరోడా తమ టోర్నీ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ శనివారం (నవంబర్ 23) జరుగుతుంది.
కాగా, హార్దిక్ ఇటీవల దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత టీ20 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో హార్దిక్ 59 పరుగులు చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది.
ముంబై ట్రైనింగ్ క్యాంప్‌లోన కనిపించిన హార్దిక్
హార్దిక్ దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన వెంటనే నవీ ముంబైలోని ఏర్పాటు చేసిన ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ సెషన్స్‌లో కనపడ్డాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి.
బరోడా జట్టుకు బూస్టప్
హార్దిక్ చేరికతో బరోడా జట్టు బలపడింది. ఈ టోర్నీలో ఆ జట్టు విజయావకాశాలు మరింత మెరుగయ్యాయి. హార్దిక్ ఎనిమిదేళ్ల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment