కేకేఆర్ తరఫున ఆడిన సూయశ్ శర్మ (ఫైల్ ఫొటో)
కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ సుయాశ్ శర్మ.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2023లో ఢిల్లీ తరఫున తన అరంగేట్రం మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. మధ్యప్రదేశ్‌తో ఇవాళ (అక్టోబర్ 17) జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన సుయాశ్.. కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సుయాశ్‌తో పాటు ఇషాంత్ శర్మ (4-0-29-2), హర్షిత్ రాణా (4-0-22-2) కూడా రాణించడంతో ఢిల్లీ టీమ్ మధ్యప్రదేశ్‌ను 115 పరుగులకు (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.
ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ఒక్కరు కూడా పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. సుయాశ్.. మధ్యప్రదేశ్ పతనాన్ని శాసించాడు. గుర్తింపు కలిగిన ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్ (2), రజత్ పాటిదార్ (7) నిరాశపర్చగా.. శుభమ్ శర్మ (10), సాగర్ సోలంకి (13), రాకేశ్ ఠాకూర్ (15), రాహుల్ బాథమ్ (32), అర్షద్ ఖాన్ (12) రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ విజయం దిశగా సాగుతుంది. ఆ జట్టు 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. ప్రియాంశ్ ఆర్య (22), అనూజ్ రావత్ (23), యశ్ ధుల్ (0) ఔట్ కాగా.. అయుశ్ బదోని (20), హిమ్మత్ సింగ్ (9) క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, ఢిల్లీ బౌలర్ సుయాశ్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన సుయాశ్ 8.23 సగటున 10 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment