
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత కొన్నాళ్లుగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. అతడు చివరి సారిగా టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా తరపున ఆడాడు. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో అతడిని సెలక్టర్లు గతేడాది ప్రపంచకప్‌కు ఎంపిక చేశారు. అయితే ఈ మెగా ఈవెంట్‌లో వరుణ్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మార్క్యూ ఈవెంట్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం ఒకే ఒక్క వికెట్ సాధించాడు.
టీ20 ప్రపంచకప్‌లో విఫలం కావడంతో అప్పటి నుంచి అతడిని సెలక్టర్లు పక్కనబెట్టారు. ఇక ఇది ఇలా ఉండగా.. భారత జట్టులోకి పునరాగమనం చేసి తన సత్తాను నిరూపించుకోవాలని వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం భావిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడు స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. త్వరలో జరగనున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు ఐపీఎల్-2023లో రాణించి తిరిగి భారత జట్టులోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
స్పోర్ట్స్ కీడాతో మాట్లాడుతూ.. "సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకు చాలా ముఖ్యమైనది. అక్కడ మెరుగైన ప్రదర్శన చేసి తిరిగి భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నాను. అదే విధంగా వచ్చే ఏడాది ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించడానికి ప్రయత్నిస్తాను. ఈ రెండు ఈవెంట్‌లలో నేను బాగా రాణిస్తే.. ఖచ్చితంగా తిరిగి భారత జట్టులోకి చోటు దక్కుతుంది" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: T20 WC 2022: ఎంసీజీ నా హోం గ్రౌండ్.. భారత బ్యాటర్లు నన్ను తట్టుకోలేరు! అవునా?!