సాక్షి, విజయనగరం: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ (సౌత్‌జోన్)లో పటిష్టమైన కర్ణాటకను ఓడించి ఆశలు రేకెత్తించిన హైదరాబాద్ అంతలోనే పేలవంగా మారిపోయింది. గత మ్యాచ్‌లో తమిళనాడు చేతిలో చిత్తయిన జట్టు... తాజాగా ఆంధ్ర ముందు కూడా తలవంచింది.
శుక్రవారం ఇక్కడి పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ సరిగ్గా 20 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ఆంధ్ర 11.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 77 పరుగులు సాధించింది. శివకుమార్ (4/6), సుధాకర్ (3/9) ధాటికి హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు.
వరుస కట్టి పెవిలియన్‌కు...
టాస్ ఓడిన హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ నాలుగో బంతికే రవితేజ (0)ను అవుట్ చేసి సుధాకర్ హైదరాబాద్ పతనానికి శ్రీకారం చుట్టాడు. తర్వాత శివకుమార్ తన తొలి ఓవర్లోనే విహారి (2)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం తన రెండో ఓవర్లో వరుస బంతుల్లో అక్షత్ (9), రాహుల్ (0)లను కూడా అవుట్ చేసిన శివ... తన చివరి ఓవర్లో భండారి (1)ని వెనక్కి పంపాడు. 13 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఈ దశలో సందీప్ రాజన్ (35 బంతుల్లో 21; 3 ఫోర్లు), హబీబ్ (23 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) 27 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. వీరిద్దరిని వరుస ఓవర్లలో స్వరూప్ అవుట్ చేశాడు. ఆఖరి ఓవర్లో సుధాకర్ మరో 2 వికెట్లు తీయడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది.
అలవోకగా...
సునాయాస లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర కూడా నాలుగో బంతికే శ్రీకాంత్ (0) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ ప్రశాంత్ (34 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), సాయికృష్ణ (24 బంతుల్లో 33; 6 ఫోర్లు) కలిసి ఎలాంటి ఇబ్బందీ లేకుండా స్కోరును నడిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 47 బంతుల్లో 56 పరుగులు జోడించి జట్టును విజయానికి చేరువగా తెచ్చారు. ఈ దశలో సాయికృష్ణ అవుటైనా, రికీ భుయ్ (9 నాటౌట్) తో కలిసి ప్రశాంత్ జట్టుకు విజయాన్నందించాడు. ఈ గెలుపుతో ఆంధ్రకు 4 పాయింట్లు దక్కాయి.
స్కోరు వివరాలు
హైదరాబాద్ ఇన్నింగ్స్: అక్షత్ (ఎల్బీ) (బి) శివకుమార్ 9; రవితేజ (సి) సాయికృష్ణ (బి) సుధాకర్ 0; విహారి (బి) శివకుమార్ 2; రాజన్ (ఎల్బీ) (బి) స్వరూప్ 21; రాహుల్ (సి) భరత్ (బి) శివకుమార్ 0; భండారి (సి) సాయికృష్ణ (బి) శివకుమార్ 1; హబీబ్ (సి) శివకుమార్ (బి) స్వరూప్ 18; ఆశిష్ (సి) ప్రశాంత్ (బి) హరీశ్ 0; ఓజా (సి) శ్రీకాంత్ (బి) సుధాకర్ 10; కనిష్క్ (సి) శ్రీకాంత్ (బి) సుధాకర్ 11; రవికిరణ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 76
వికెట్ల పతనం: 1-1; 2-8; 3-11; 4-11; 5-13; 6-40; 7-54; 8-56; 9-75; 10-76.
బౌలింగ్: సుధాకర్ 3-0-9-3; శివకుమార్ 4-3-6-4; ప్రవీణ్ 4-0-10-0; హరీశ్ 4-0-24-1; ప్రశాంత్ 1-0-9-0; స్వరూప్ 4-0-17-2.
ఆంధ్ర ఇన్నింగ్స్: ప్రశాంత్ (నాటౌట్) 33; శ్రీకాంత్ (సి) ఆశిష్ (బి) కనిష్క్ 0; సాయికృష్ణ (సి) రవితేజ (బి) ఆశిష్ 33; రికీ భుయ్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (11.3 ఓవర్లలో 2 వికెట్లకు) 77
వికెట్ల పతనం: 1-1; 2-57
బౌలింగ్: కనిష్క్ 3-0-17-1; రవికిరణ్ 3-0-21-0; ఆశిష్ రెడ్డి 3-0-21-1; ఓజా 2-0-15-0; భండారి 0.3-0-2-0.
ఆంధ్ర చేతిలోనూ చిత్తు
Published Sat, Apr 5 2014 12:07 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement