శస్త్రచికిత్స అనంతరం తిరిగి మైదానంలో అడుగు పెట్టిన భారత సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ... దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో పోరుకు సిద్ధమయ్యాడు. రంజీ ట్రోఫీలో రాణించి ఫిట్‌నెస్ చాటుకున్న షమీ... ముస్తాక్ అలీ ట్రోఫీలో అటు బంతితో ఇటు బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడు.
చండీగఢ్‌తో కీలక ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆల్‌రౌండ్ మెరుపులతో షమీ బెంగాల్ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో నేడు నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. బరోడాతో బెంగాల్, మధ్యప్రదేశ్‌తో సౌరాష్ట్ర, ముంబైతో విదర్భ, ఢిల్లీతో ఉత్తరప్రదేశ్ తలపడనున్నాయి.
గాయం నుంచి కోలుకున్న అనంతరం షమీ దేశవాళీల్లో 64 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 16 వికెట్లు పడగొట్టాడు. ఆ్రస్టేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ చివరి రెండు టెస్టుల కోసం షమీ ఆసీస్ వెళ్లనున్నాడనే వార్తల నేపథ్యంలో... అతడికి ముస్తాక్ అలీ టోర్నీ క్వార్టర్ ఫైనల్ మరో అవకాశం ఇస్తోంది.
మరోవైపు ఇటీవల సిక్కింపై 20 ఓవర్లలో 349 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన బరోడా జట్టు... అదే జోష్‌లో సెమీఫైనల్లో అడుగు పెట్టాలని భావిస్తోంది. బరోడా బ్యాటింగ్ సామర్థ్యానికి... బెంగాల్ బౌలింగ్ నైపుణ్యానికి మధ్య తీవ్ర పోటీ ఖాయం.
రింకూ మెరిసేనా?
ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ నుంచి రింకూ సింగ్‌పై అందరి దృష్టి నిలవనుంది. మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్, రజత్ పాటిదార్ కీలకం కానుండగా...విదర్భతో పోరులో ముంబై జట్టు తరఫున శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానే, సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యారు.
చదవండి: సిరాజ్‌ను సీనియర్లే నియంత్రించాలి: ఆసీస్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment