అహ్మదాబాద్: ఆద్యంతం తమ ఆధిపత్యాన్ని చాటుకున్న తమిళనాడు క్రికెట్ జట్టు దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో దినేశ్ కార్తీక్ నాయకత్వంలోని తమిళనాడు ఏడు వికెట్ల తేడాతో బరోడాపై ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీని అజేయంగా ముగించిన తమిళనాడు 14 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ చాంపియన్ అయ్యింది. చివరిసారి తమిళనాడు 2007లో టైటిల్ గెల్చుకుంది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా తమిళనాడు, బరోడా ఫైనల్ చేరగా... తుది పోరులో తమిళనాడుదే పైచేయిగా నిలిచింది.
టాస్ గెలిచి తమిళనాడు ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన బరోడా 20 ఓవర్లలో 9 వికెట్లకు 120 పరుగులు చేసింది. విష్ణు సోలంకి (49; ఫోర్, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తమిళనాడు బౌలర్ మణిమారన్ సిద్ధార్థ్ 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం తమిళనాడు, 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసి విజయం సాధించింది. హరి నిశాంత్ (35; 3 ఫోర్లు, సిక్స్), బాబా అపరాజిత్ (29 నాటౌట్; ఫోర్), దినేశ్ కార్తీక్ (22; 3 ఫోర్లు), షారుఖ్ ఖాన్ (18 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) రాణించారు. బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా విజేత, రన్నరప్ జట్లకు ట్రోఫీలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment