
సెంచరీ మిస్ అయిన తన్మయ్... అయితేనేం భారీ విజయం
Hyderabad Beat Uttarakhand Tanmay And Milind Well Played - సుల్తాన్‌పూర్ (గురుగ్రామ్): సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఉత్తరాఖండ్ జట్టుతో శుక్రవారం జరిగిన ఎలైట్‌గ్రూప్ ‘ఈ’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 61 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (59 బంతుల్లో 97 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచాడు. చివర్లో బుద్ధి రాహుల్ (13 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) కూడా దూకుడుగా ఆడాడు.
ఫలితంగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు స్కోరు చేసింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాఖండ్ జట్టును హైదరాబాద్ జట్టు ఎడంచేతి వాటం పేస్ బౌలర్ సీవీ మిలింద్ (5/16) బెంబేలెత్తించాడు. దాంతో ఉత్తరాఖండ్ జట్టు 18.3 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. హైదరాబాద్ బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్, రక్షణ్, తనయ్ త్యాగరాజన్, హనుమ విహారి, రోహిత్ రాయుడు ఒక్కో వికెట్ తీశారు. సౌరాష్ట్ర జట్టుతో గురువారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ రెండు వికెట్ల తేడాతో గెలిచింది. ప్రస్తుతం హైదరాబాద్ ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
చదవండి: Ravindra Jadeja: ఇంకేం చేస్తాం.. బ్యాగులు సర్దేసి ఇంటికి వెళ్తాం.. ఇచ్చిపడేశావ్ కదా భయ్యా!