సాక్షి, విశాఖపట్నం: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (సౌత్‌జోన్ టి20)లో హైదరాబాద్ తమ పోరాటాన్ని ఓటమితో ముగించింది. ఇక్కడి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన చివరిదైన ఐదో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ రెండు వికెట్ల తేడాతో గోవా చేతిలో పరాజయం చవిచూసింది.
గోవా టెయిలెండర్లకు అడ్డుకట్ట వేయలేకపోయిన హైదరాబాద్ బౌలర్లు చేతిలోకి వచ్చిన మ్యాచ్‌ను చేజార్చారు. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు చేసింది. తర్వాత గోవా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. హైదరాబాద్ రెండు విజయాలు, మూడు పరాజయాలతో 8 పాయింట్లు సంపాదించి నాలుగో స్థానంలో నిలిచింది.
టాస్ నెగ్గిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ అక్షత్ రెడ్డితో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన రవితేజ (45 బంతుల్లో 48, 7 ఫోర్లు) కుదురుగా ఆడాడు. కానీ అక్షత్ (13) విఫలమవగా... క్రీజ్‌లోకి వచ్చిన విహారి (27 బంతుల్లో 27, 2 ఫోర్లు 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ సింగ్ (5), ఆశిష్ రెడ్డి (6) చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. చివర్లో అమోల్ షిండే (13 బంతుల్లో 28, 1 ఫోర్, 3 సిక్స్‌లు) భారీ సిక్సర్లతో గోవా బౌలర్లపై విరుచుకుపడటంతో జట్టు స్కోరు అమాంతం పెరిగింది. గోవా బౌలర్లలో హర్షద్ గడేకర్, గౌరేశ్ గవాస్, లక్ష్యయ్ గార్గ్ తలా 2 వికెట్లు తీశారు.
అనంతరం 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గోవా జట్టులో సగుణ్ (44 బంతుల్లో 56, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) చక్కని స్ట్రోక్స్‌తో అలరించినప్పటికీ అతనికి సహకారమిచ్చేవారే కరువయ్యారు. స్వప్నిల్ అస్నోడ్కర్ (1), దేశాయ్ (9), రోహిత్ అస్నోడ్కర్ (0), డోంగ్రే (10), కీనన్ వాజ్ (2), మిశా ల్ (2) ఇలా టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వరకు అందరిని తక్కువ స్కోర్లకే ఔట్ చేసిన హైదరాబాద్ బౌలర్లు... గోవా టెయిలెండర్లు గడేకర్ (30), అమిత్ యాదవ్ (15 బంతుల్లో 38 నాటౌట్; 5 సిక్స్‌లు)లపై ప్రభావం చూపలేకపోయారు. షిండే, కనిష్క్, ఆశిష్ రెడ్డిలు తలా 2 వికెట్లు పడగొట్టారు.
గోవా టాప్...
మొత్తం ఐదు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో గోవా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మూడు విజయాలు నమోదు చేసిన కేరళ 12 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈనెల 8 నుంచి 14 వరకు రాజ్‌కోట్, ముంబైలలో జరిగే సూపర్ లీగ్ దశకు సౌత్‌జోన్ నుంచి గోవా, కేరళ అర్హత సాధించాయి.
స్కోరు వివరాలు
హైదరాబాద్ ఇన్నింగ్స్: అక్షత్ (సి) రోహిత్ అస్నోడ్కర్ (బి) గడేకర్ 13; రవితేజ (సి) స్వప్నిల్ (బి) గార్గ్ 48; విహారి (సి) అమిత్ (బి) మిశాల్ 27; రాహుల్ సింగ్ (బి) గార్గ్ 5; ఆశిష్ (సి) గడేకర్ (బి) గవాస్ 6; షిండే (సి) కామత్ (బి) గడేకర్ 28; ఆకాశ్ భండారి (సి) మిశాల్ (బి) గవాస్ 5; సందీప్ నాటౌట్ 6; కనిష్క్ నాయుడు నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 149
వికెట్ల పతనం: 1-21, 2-57, 3-92, 4-99, 5-125, 6-139, 7-144
బౌలింగ్: గడేకర్ 4-0-37-2, గవాస్ 4-0-26-2, గార్గ్ 4-0-24-2, అమిత్ యాదవ్ 3-0-21-0, మిశాల్ 4-0-23-1, దేశాయ్ 1-0-12-0
గోవా ఇన్నింగ్స్: సగుణ్ కామత్ (సి) రాహుల్ (బి) ఆశిష్ 56; స్వప్నిల్ అస్నోడ్కర్ (బి) రవికిరణ్ 1; దేశాయ్ (బి) కనిష్క్ నాయుడు 9; రోహిత్ అస్నోడ్కర్ (సి) రవితేజ (బి) కనిష్క్ 0; సూరజ్ (సి) ఆశిష్ (బి) షిండే 10; వాజ్ (ఎల్బీడబ్ల్యూ-బి) షిండే 2; మిశాల్ (సి) విహారి (బి) ఆశిష్ 2; గడేకర్ (బి) ఓజా 30; అమిత్ యాదవ్ నాటౌట్ 38; గార్గ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 151
వికెట్ల పతనం: 1-16, 2-33, 3-33, 4-46, 5-51, 6-56, 7-100, 8-144
బౌలింగ్: షిండే 4-0-28-2, రవికిరణ్ 4-0-31-1, ఓజా 4-0-39-1, కనిష్క్ నాయుడు 4-0-30-2, ఆశిష్ 4-0-22-2.
ఓటమితో ముగింపు
Published Sun, Apr 6 2014 12:43 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM
Advertisement
Advertisement