టీమిండియా జెర్సీలో రుతురాజ్ గైక్వాడ్ (ఫైల్ ఫొటో)
విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ మ్యాచ్‌లో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ భారీ శతకం(Ruturaj Gaikwad Century) బాదాడు. సర్వీసెస్ జట్టు బౌలింగ్‌పై విరుచుకుపడుతూ పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి మహారాష్ట్రను విజయతీరాలకు చేర్చాడు.
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ(Vijay Hazare Trophy 2024-25)లో భాగంగా మహారాష్ట్ర.. సోమవారం సర్వీసెస్‌తో తలపడింది. ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీ బీకేసీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బౌలింగ్ చేసింది.
రాణించిన సర్వీసెస్ కెప్టెన్
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు సర్వీసెస్ 204 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ మోహిత్ అహ్లావత్(61) అర్ధ శతకం బాదగా.. ఓపెనర్ సూరజ్ వశిష్ట్(22), మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పలివాల్(22), అర్జున్ శర్మ(24), పూనం పూనియా(26) ఫర్వాలేదనిపించారు.
మహారాష్ట్ర బౌలర్లలో ప్రదీప్ దాధే, సత్యజీత్ బచ్చవ్ మూడేసి వికెట్లు కూల్చగా.. ముకేశ్ చౌదరి రెండు, అజిమ్ కాజీ, రజ్‌నీశ్ గుర్బానీ ఒక్కో వికెట్ తీశారు. వీరి దెబ్బకు 48 ఓవర్లలోనే సర్వీసెస్ బ్యాటింగ్ కథ ముగిసింది.
57 బంతుల్లోనే రుతు శతకం
ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 20.2 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి పని పూర్తి చేసింది. ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విశ్వరూపం ప్రదర్శించాడు. 57 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న రుతు.. మొత్తంగా 74 బంతుల్లో 16 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 148 పరుగులతో అజేయంగా నిలిచాడు.
మరో ఓపెనర్ ఓం భోస్లే(24) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ సిద్ధేశ్ వీర్ 22 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఇక మహారాష్ట్రను ఒంటి చేత్తో గెలిపించిన రుతురాజ్ గైక్వాడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
మెగా టోర్నీకి రెడీ
ఇక ఈ టోర్నీలో మహారాష్ట్రకు ఇది రెండో విజయం. తమ తొలి మ్యాచ్‌లో మహారాష్ట్ర రాజస్తాన్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు రుతురాజ్ బ్యాట్ ఝులిపించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఫామ్ కొనసాగిస్తే మెగా టోర్నీ ఆడే టీమిండియాలో చోటు దక్కించుకోవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా తన భారీ సెంచరీతో సెలక్టర్లకు గట్టి సందేశం పంపించాడని పేర్కొంటున్నారు.
చదవండి: నేను బతికి ఉన్నానంటే.. అందుకు కారణం అతడే: వినోద్ కాంబ్లీ
Comments
Please login to add a commentAdd a comment