నేను బతికి ఉన్నానంటే.. అందుకు కారణం అతడే: వినోద్‌ కాంబ్లీ | Vinod Kambli Friend Shares Health Update, Makes Big Medical Bills Revelation | Sakshi
Sakshi News home page

నేను బతికి ఉన్నానంటే.. అందుకు కారణం అతడే: వినోద్‌ కాంబ్లీ

Published Tue, Dec 24 2024 11:47 AM | Last Updated on Tue, Dec 24 2024 12:13 PM

Vinod Kambli Friend Shares Health Update, Makes Big Medical Bills Revelation

టీమిండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ ఆరోగ్యం(Vinod Kambli Health Update) నిలకడగా ఉంది. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఈ ముంబైకర్‌.. డిశ్చార్జ్‌ కానున్నాడు. ఈ విషయాన్ని అతడి స్నేహితుడు మార్కస్‌ కౌటో వెల్లడించాడు. కాగా 52 ఏళ్ల కాంబ్లీ ఆరోగ్యం క్షీణించడంతో శనివారమే ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే.

అయితే, ఆ రోజు మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ సమస్యలతో కాంబ్లీని అడ్మిట్‌ చేసినప్పటికీ... తదనంతర వైద్యపరీక్షల్లో మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతున్నట్లు తేలిందని డాక్టర్‌ వివేక్‌ త్రివేది వెల్లడించారు. దీంతో ఇన్సెంటివ్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌(ICU)లో ఉంచి ప్రత్యేక వైద్యబృందం ఎప్పటికప్పుడు అతడి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

మెడికల్‌ బిల్లులు చెల్లించేందుకు
ఇక మంగళవారం కూడా అవసరమైన వైద్యపరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆ వైద్యబృందం పేర్కొంది. ఈ నేపథ్యంలో ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’తో మాట్లాడిన కాంబ్లీ ఫ్రెండ్‌ మార్కస్‌ కౌటో.. ‘‘కాంబ్లీ ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గానే ఉంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తోనే అతడు ఆస్పత్రిలో చేరాడు. అనారోగ్య సమస్యలన్నీ  తీరిపోయే వరకు హాస్పిటల్‌లోనే చికిత్స అందించాలని కోరాను.

కాంబ్లీకి సంబంధించిన మెడికల్‌ బిల్లులు చెల్లించేందుకు కచ్చితంగా ఎవరో ఒకరు సాయం చేస్తారు’’ అని పేర్కొన్నాడు. ఇక కాంబ్లీని చికిత్స అందిస్తున్న వైద్యులు మాట్లాడుతూ.. ‘‘క్రికెటర్‌గా రాణించిన వినోద్‌ సర్‌(Cricketer Vinod Kambli) పట్ల మాకు అభిమానం ఉంది.

అందుకు ఆయన కోలుకునేందుకు అవసరమైన చికిత్స అందిస్తాం. తన కెరీర్‌లోని మధుర జ్ఞాపకాల గురించి ఆయన మాతో పంచుకుంటున్నారు’’ అని తెలిపారు. ఇక వినోద్‌ కాంబ్లీ సైతం ఈ సందర్భంగా వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు. 

డాక్టర్‌ వల్లే నేను బతికి బయటపడ్డాను
‘‘డాక్టర్‌ వల్లే నేను ఈరోజు బతికి బయటపడ్డాను. ఆయన నన్నేం అడిగినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇకపై నలుగురికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాను’’ అని కాంబ్లే పేర్కొన్నాడు.

కాగా ముంబైకి చెందిన ఈ మాజీ క్రికెటర్‌ చాన్నాళ్ల నుంచే అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. ఇటీవల దిగ్గజ కోచ్‌ రమాకాంత్‌ ఆచ్రేకర్‌ స్మారక కార్యక్రమంలో కాంబ్లీ పాల్గొన్నప్పటికీ కుర్చీకే పరిమితమయ్యాడు. తాను ఇప్పటికే మద్యం, పొగతాగడం మానేశానని.. కపిల్‌ దేవ్‌ సారథ్యంలోని 1983 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ జట్టు సాయంతో పునరావాస శిబిరంలో చేరతానని కాంబ్లీ ఇటీవల వెల్లడించాడు.

చదవండి: IND vs AUS 4th Test: వాడిగా 'వేడిగా' సాగనున్న బాక్సింగ్ డే టెస్ట్!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement