భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మెల్బోర్న్ లో జరుగనున్న నాలుగో టెస్ట్ ఆరంభానికి ముందే వేడిని పుట్టిస్తోంది. సిరీస్ పరంగా చూస్తే, భారత్, ఆస్ట్రేలియా రెండు జట్లు చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచి సమఉజ్జీలుగా ఉన్న సంగతి తెలిసిందే. పెర్త్ లో జరిగిన మొదటి టెస్ట్ లో 295 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించగా, అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా పది వికెట్లతో గెలుపొందింది. దీంతో, సిరీస్ ని 1-1తో సమమైంది.
గబ్బాలో జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసిన నేపథ్యంలో మెల్బోర్న్ లో, అదీ క్రిస్టమస్ పర్వ దినం తర్వాత బాక్సింగ్ డే నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మకమైన ఈ టెస్ట్ లో గెలిచేందుకు రెండు జట్లు పకడ్బందీ వ్యూహాలతో సిద్ధమవుతనడంలో సందేహంలేదు. వాతావరణ శాఖ హెచ్చరిక ఆస్ట్రేలియా వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు ఈ మ్యాచ్ కి ముందే వేడెక్కిస్తున్నాయి.
మెల్‌బోర్న్‌లో ఓవర్ హీట్..
ఈ మ్యాచ్ జరిగే తరుణంలో మెల్బోర్న్ లో అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖంగా ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భద్రతా చర్యలు చేపడుతున్నారు.
ఆటగాళ్లకు అవసరమైతే డ్రింక్స్ విరామాన్ని పెంచాలని నిర్ణయించారు. త్వరలో మెల్బోర్న్ లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అయితే ఉష్ణోగ్రత 38డిగ్రీల సెల్సియస్ దాటితే మ్యాచ్‌లను నిలిపివేస్తారు.
అయితే క్రికెట్ లో ఇలాంటి నిబంధనలు లేవు. గతంలో 2018 లో జరిగిన యాషెస్ టెస్ట్ సిరీస్ సందర్భంగా సిడ్నీ లో జరిగిన టెస్ట్ సమయం లో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ నమోదు అయినప్పటికీ మ్యాచ్ ని కొనసాగించారు.
చెన్నైలో డీన్ జోన్స్ డబుల్, ఆసుపత్రిపాలు ప్రఖ్యాత ఆస్ట్రేలియా బ్యాటర్ డీన్ జోన్స్ 1986 లో చెన్నై లోని చేపక్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా 41 డిగ్రీలసెల్సియస్ ఉష్ణోగ్రతలో ఎనిమిది గంటలపాటు మారథాన్ ఇన్నింగ్స్ ఆడి డబుల్ సెంచరీ సాధించి చివరికి ఆసుపత్రి పాలయ్యాడు.
తన సుదీర్ఘ క్రీడా జీవితంలో 52 టెస్ట్లు, 164 వన్డే మ్యాచ్ లు ఆడి, రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్ గా కూడా ప్రఖ్యాతి వహించిన జోన్స్ 59 ఏళ్ళ ప్రాయంలో ఐపీఎల్ సందర్భంగా ముంబైలోని ఓ హోటల్ లో ఆకస్మిక గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
అదే విధంగా 2017 -18 యాషెస్ సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియాలో ఉష్ణోగ్రత 40డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఇన్నింగ్స్ మధ్యలో రిటైర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిడ్నీ లో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ అనంతరం రూట్ ఆసుపత్రి పాలయ్యాడు, ఆస్ట్రేలియా ఈ సిరీస్ లో 4-౦ తో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment