లాభాల గాల్లో విమానాలు..! | Indigo and SpiceJet domestic market share goes up | Sakshi
Sakshi News home page

లాభాల గాల్లో విమానాలు..!

Published Fri, Apr 29 2016 12:10 AM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM

లాభాల గాల్లో విమానాలు..!

లాభాల గాల్లో విమానాలు..!

అన్‌సీజన్లోనూ ప్రయాణికుల జోరు..
గత మూడు నెలల్లో 24 శాతం వృద్ధి
బ్రేక్ ఈవెన్ స్థాయిని దాటి నిండుతున్న సీట్లు
డిమాండ్‌కు తగ్గట్టు సర్వీసులు పెంచుకుంటున్న సంస్థలు
వచ్చే నెల్లో మరో చౌక విమాన సంస్థ రంగంలోకి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కింగ్‌ఫిషర్... పారమౌంట్... దమానియా... ఈస్ట్ వెస్ట్... స్పైస్ జెట్... జెట్ ఎయిర్‌వేస్... ఇవన్నీ ఒకప్పుడు నష్టాల్లో మునిగి తేలినవే. కాకపోతే ఆ నష్టాల్ని తట్టుకుని నిలబడగలిగే శక్తి కొన్నిటికి మాత్రమే వచ్చింది. ఆ శక్తి లేకపోవటంతో కింగ్‌ఫిషర్... పారమౌంట్, దమానియా, ఈస్ట్ వెస్ట్ వంటివి మూతపడ్డాయి. ఎయిర్ దక్కన్ వంటివి వేరే సంస్థల ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. స్పైస్‌జెట్ యజమాని మారగా, జెట్ ఎయిర్‌వేస్ ఎతిహాద్ అండతో నిలదొక్కుకుంది.

ఇదంతా ఎందుకంటే... అప్పుడప్పుడే భారతీయులకు విమాన ప్రయాణం అలవాటవుతున్న తరుణంలో వచ్చిన సంస్థలివి. కానీ అవి చేసిన అలవాటు ఇపుడు తారస్థాయికి చేరుకుంది. ఫలితం!! విమానాలు నిండిపోతున్నాయి. విమాన ప్రయాణికుల్లో రికార్డు వృద్ధి నమోదవుతోంది. విమానయాన సంస్థలు లాభాల బాట పడుతున్నాయి. అదీ కథ.

 ఇపుడు విమాన యాన సంస్థలకు అన్‌సీజన్ లేదు. మార్చి, ఏప్రిల్ నెలలు ఇప్పటిదాకా అన్‌సీజనే అయినా... ఈ సారి ఆ నెలల్లో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది. ప్రస్తుతం దేశంలో సర్వీసులందిస్తున్న 11 విమానయాన సంస్థల్లోనూ సీట్లు రికార్డు స్థాయిలో భర్తీ అవుతున్నాయి. మార్చి నెలల్లో అన్ని విమానాల సగటు లోడ్ ఫ్యాక్టర్ (సీట్లు నిండటం) రికార్డు స్థాయిలో 83 శాతానికి చేరుకుంది. అమెరికా తర్వాత విమానాల్లో సీట్లు ఈ స్థాయిలో భర్తీ అవుతున్నది ఇక్కడే కావటం విశేషం. సాధారణంగా 100 సీట్ల సామర్థ్యం ఉన్న విమానాల్లో సీట్లు 75-80 శాతం నిండితే బ్రేక్ ఈవెన్‌కి వచ్చినట్లేనని, ఇప్పుడు చాలా సర్వీసుల్లో అంతకంటే ఎక్కువ శాతం సీట్లు భర్తీ అవుతున్నాయని పరిశ్రమ ప్రతినిధి ఒకరు చెప్పారు. కొన్నాళ్ళు పరిస్థితులిలాగే ఉంటే అన్ని ఎయిర్‌లైన్స్ కూడా లాభాల్లోకి వస్తాయన్నారు.

 స్పైస్ జెట్ టాప్; విస్తారా లాస్ట్
గత నెలలో స్పైస్ జెట్ సగటు లోడ్ ఫ్యాక్టర్ 91 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, 75 శాతంతో విస్తారా చివరి స్థానంలో ఉంది. నిజానికి 75 శాతమంటే అది కూడా బ్రేక్ ఈవెన్ పరిస్థితే. అంటే దాదాపు ఏ విమానయాన సంస్థా నికరకంగా సీట్లకు సంబంధించి నష్టాల్ని మూటగట్టుకోవటం లేదన్న మాట. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎయిర్‌కోస్టా లోడ్ ఫ్యాక్టర్ 82.1 ఉండగా, తరచు కొన్ని విమానాలు రద్దవుతున్నా ట్రూజెట్ కూడా 77.9 శాతం ఎస్‌ఎల్‌ఎఫ్‌ను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమానయాన ప్రయాణీకుల సంఖ్య 10 కోట్లు దాటుతుందని ఎడల్‌వైజ్ సెక్యూరిటీస్ అంచనా వేసింది.

గత ఆర్థిక సంవత్సరంలో 8.5 కోట్ల మంది ప్రయాణించారు. ఇదే సమయంలో విమాన ఇంధన ధరలు కూడా బాగా తగ్గడంతో దాదాపు అన్ని విమానయాన సంస్థలు నిర్వహణ లాభాల్లో నడుస్తున్నాయి. డిమాండ్ ఇదే విధంగా కొనసాగితే ఆర్‌టీసీ బస్సుల్లాగా టాప్ ఎక్కి ప్రయాణించే పరిస్థితి కనపడుతోందని ఒక ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రతినిధి నవ్వుతూ వ్యాఖ్యానించారంటే డిమాండ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రస్తుత సీజన్‌లో ఎయిర్‌లైన్ సంస్థలు ఆఫర్లు ప్రకటించడాన్ని తగ్గించాయి.

 మరో కొత్త ఎయిర్‌లైన్...
పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో చౌక విమానయాన రంగంలోకి కొత్తగా మరో సంస్థ ప్రవేశించబోతోంది. తమిళనాడుకు చెందిన సీఎంసీ విద్యాసంస్థ ‘ఎయిర్ కార్నివాల్’ పేరుతో రంగంలోకి రాబోతోంది.  మే నెల్లో ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. దీంతో దేశీయంగా విమాన సర్వీసులు అందిస్తున్న సంస్థల సంఖ్య 12కి పెరగనుంది. మిగిలిన సంస్థలు కూడా డిమాండ్‌కు తగ్గట్టుగా విమానాల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టిసారించాయి. ఈ ఏడాది కొత్తగా మరో 50 విమానాల సేవలు అందుబాటులోకి రానున్నట్లు అంచనా. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్‌కోస్టా ఈ డిసెంబర్ నాటికి విమానాల సంఖ్యను 4 నుంచి 8కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రూజెట్ కూడా తన విమానాల సంఖ్యను ఈ ఏడాదిలోగా మూడు నుంచి 10కి పెంచుకోవాలనుకుంటోంది.

వృద్ధి నమోదవుతోందిలా...
అన్‌సీజన్‌గా భావించే ఫిబ్రవరిలో ఈ ఏడాది 79 లక్షల మంది ప్రయాణించారు. గతేడాదికన్నా దాదాపు 25% అధికం.
2016 తొలి మూడు నెలల్లో ప్రయాణించిన వారి సంఖ్య 2.3 కోట్లు. గతేడాది ఇదే కాలంలో ప్రయాణించిన 1.85 కోట్ల మందికన్నా దాదాపు 23 శాతం అధికం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement