ఎగిరిన విమానం.. ఫార్మాకు గాయం | business Revind of 2015 | Sakshi
Sakshi News home page

ఎగిరిన విమానం.. ఫార్మాకు గాయం

Published Thu, Dec 31 2015 12:18 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

ఎగిరిన విమానం.. ఫార్మాకు గాయం - Sakshi

ఎగిరిన విమానం.. ఫార్మాకు గాయం

 ఆస్తులు విక్రయించి గట్టెక్కుతున్న ఇన్‌ఫ్రా కంపెనీలు
 2016లో నష్టాలు మరింత తగ్గి లాభాలు చూసే అవకాశం
 ఐటీలో అత్యున్నత పదవులకు ఎగుస్తున్న తెలుగు తేజాలు
 ఆసుపత్రుల్లో వాటాలకు విదేశీ ఇన్వెస్టర్ల భారీ ఆఫర్లు

 
 ఎగిరే అవకాశాలను అందుకోవటానికి విమానయానంలోకి కొత్త కంపెనీలొచ్చాయి. ఇప్పటికే ఉన్న కంపెనీలు విస్తరణ దిశగా మరింత పెకైగిశాయి. కొన్నేళ్లుగా నష్టాలతో కునారిల్లుతున్న ఇన్‌ఫ్రా రంగం కాస్తంత తేరుకుంది. కంపెనీలు ఆస్తులు విక్రయించి రుణ భారం దించుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు కాస్త సఫలమయ్యాయి.
 
ఐటీలో మనవాళ్లు విజయబావుటాలు ఎగురవెయ్యగా... హెల్త్‌కేర్‌లోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. ఆసుపత్రుల విలువలు అమాంతం ఎగిశాయి. కానీ మన ఫార్మా రంగం మాత్రం బోలెడంత అప్రదిష్ట మూటగట్టుకుంది. వచ్చే ఏడాది ఈ మచ్చను తుడిచేసే ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే... ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమలకు సానుకూలంగా గడవగా... వచ్చే ఏడాది మరిన్ని ఆశలు రేపుతోంది.

 ప్రభుత్వ ప్రోత్సాహకాలకు తోడు, వడ్డీరేట్లు, చమురు, లోహాల ధరలు దిగిరావడంతో ఇన్‌ఫ్రా కంపెనీలు కవరీ బాట పట్టాయి. ఎన్‌సీసీ, గాయత్రీ వంటి కంపెనీలు లాభాల బాట పట్టగా, జీవీకే, జీఎంఆర్, ల్యాంకో సంస్థలు నష్టాలు తగ్గించుకున్నాయి. కేంద్రం ఈ రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్‌కు ప్రోత్సాహకాలు ప్రకటిస్తుండటంతో వచ్చే ఏడాది అన్ని కంపెనీలూ లాభాల్లోకి రావచ్చనేది అంచనా.
 
  అప్పుల ఊబిలో కూరుకున్న జీవీకే, జీఎంఆర్, ల్యాంకో, ఐవీఆర్‌సీఎల్‌లు ఆస్తులను విక్రయించడం ద్వారా అప్పుల భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఐవీఆర్‌సీఎల్‌కు ఈ సంవ త్సరం చేదు అనుభవం మిగిలింది. అప్పుల భారం తప్పటానికి చేసిన యత్నాలు విఫలం కావటంతో కంపెనీపై యాజమాన్య హక్కులను పొందడానికి బ్యాంకులు ఎస్‌డీఆర్ అస్త్రాన్ని ప్రయోగించాయి. అంతేకాకుండా కంపెనీని ఈపీసీ, అసెట్స్‌గా విడదీయాలని నిర్ణయించాయి.
 
 ఫార్మాకి మాయని మచ్చ
 దేశంలో రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీగా ఉన్న డాక్టర్ రెడ్డీస్‌కి చెందిన మూడు తయారీ కేంద్రాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ వార్నింగ్ లేఖలను జారీ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయమయ్యింది. సన్ ఫార్మా, మైలాన్ యూనిట్లకూ ఈ తరహా లేఖలు వచ్చినా ఇంత పెద్ద చర్చ జరగలేదు. కారణం... రెడ్డీస్‌కి చెందిన మూడు యూనిట్లకు ఒకేసారి హెచ్చరిక లేఖలు రావడమే. విజయనగరం ఏపీఐ యూనిట్లో సమస్యలున్న సంగతి తెలుసుకానీ, తెలంగాణలోని మిర్యాలగూడ ఏపీఐ యూనిట్, విశాఖ సమీపంలోని దువ్వాడ వద్ద ఉన్న క్యాన్సర్ యూనిట్లో సమస్యలున్నట్లు ఇప్పటిదాకా వెల్లడి కాకపోవటం సమస్య తీవ్రతను పెంచింది. డాక్టర్ రెడ్డీస్ తర్వాత అంత చర్చజరిగిన అంశం ఏదైనా ఉందంటే అది క్లినికల్ ట్రయల్స్ సంస్థ జీవీకే బయోదే. ఈ సంస్థ జరిపిన క్లినికల్ ట్రయల్స్ నివేదికలు తప్పులతడకలుగా ఉన్నాయంటూ జీవీకే బయో పరీక్షలు నిర్వహించిన 700 జెనరిక్ డ్రగ్స్‌ను యూరోపియన్ యూనియన్ నిషేధించింది. ఇది కంపెనీ పేరు ప్రతిష్టలకు పెద్ద విఘాతం కల్గించింది.
 
  గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దేశీయ ఫార్మా కంపెనీలు కొత్త ఔషధాలకు అనుమతులు బాగానే పొందాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో, నాట్కో, డాక్టర్ రెడ్డీస్, సువెన్‌లైఫ్ వంటి కంపెనీలు అనేక జెనరిక్ ఔషధాలకు అనుమతులు, పేటెంట్లను దక్కించుకున్నాయి. జపాన్, ఆఫ్రికా దేశాల వంటి కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడంతో రానున్న కాలంలో దేశీ ఫార్మా మరింత వేగంగా వృద్ధి చెందుతుందని అంచనా.
 
 విమానయానంలో జెట్ స్పీడ్..
 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది అత్యధిక సానుకూల పరిణామాలు చోటు చేసుకున్న రంగాలేమైనా ఉంటే అవి విమానయాన, తత్సంబంధిత రంగాలే.  విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్‌కోస్టాకు ఈ ఏడాది నేషనల్ కారియర్‌గా ప్రమోషన్ లభించింది. హైదరాబాద్ కేంద్రంగా ట్రూజెట్ పేరుతో మరో ప్రాంతీయ విమాన సర్వీసు సంస్థ ప్రారంభమయింది.
 
  ఈ కంపెనీకి టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ డైరక్టర్‌గా ఉండటమే కాకుండా ట్రూజెట్‌కు బ్రాండ్ అంబాసిడర్ కూడా. కొత్తగా కడప విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. విశాఖ దగ్గర మరో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు వుర్గం సుగమమైంది.. తిరుపతి సమీపంలోని రేణుగుంటలో కొత్త అంతర్జాతీయ  టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్.. బోయింగ్‌తో కలిసి ‘ఏహెచ్ 64’ హెలికాప్టర్లను తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
 
 ఐపీవోల సందడి
 కొనేళ్ల విరామం తర్వాత తెలుగు రాష్ట్ర కంపెనీలు తిరిగి స్టాక్ మార్కెట్లో సందడి చేశాయి. ఇప్పటికే రెండు కంపెనీలు ఐపీవోకి రాగా, మరొక కంపెనీకి అనుమతులు లభించాయి. ఇన్‌ఫ్రా రంగానికి చెందిన పెబ్స్ పెన్నార్, పవర్‌మెక్ కంపెనీలు స్టాక్ మార్కెట్ ద్వారా రూ.330 కోట్లు సమీకరించాయి. ఇందులో పెబ్స్ పెన్నార్ ఇన్వెస్టర్లను నిరాశపర్చగా, పవర్‌మెక్ స్వల్ప లాభాలు అందించింది. ఐపీవోకి రావడానికి అనుమతులు పొందిన విత్తన కంపెనీ నూజివీడు సీడ్స్ సరైన పరిస్థితుల కోసం ఎదురు చూస్తోంది.
 
 ఐటీలో తెలుగు వెలుగులు
 ఈ ఏడాది ఐటీలో తెలుగు తేజాలు మెరిశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కి తెలుగు తేజం సత్య నాదెళ్ల సీఈవోగా నియమితులయ్యారు. అలాగే దేశంలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసుకున్న నాస్కామ్‌కి చైర్మన్‌గా బీ.వి.ఆర్. మోహన్ రెడ్డి నియమితులు కావడం విశేషం. సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ సీఈవోగా విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్ పోటీ పడినా చివర్లో ఆ అవకాశాన్ని కోల్పోయారు.
 
 హాస్పిటల్స్ విలువలు జూమ్
 హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హాస్పిటల్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. కేర్, గ్లోబల్, కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో వాటాలను విదేశీ సంస్థలు అత్యధిక ధరకు కైవసం చేసుకున్నాయి. ఈ మధ్యనే కేర్ హాస్పిటల్స్‌లో 72 శాతం వాటాను అడ్వెంట్ ఇంటర్నేషనల్ నుంచి రూ. 1,800 కోట్లకు సింగపూర్‌కు చెందిన టెమాసెక్ కొనుగోలు చేసింది. ఈ వాటాను 2012లో అడ్వెంట్ రూ. 680 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే గ్లోబల్ హాస్పిటల్స్‌లో 74 శాతం వాటాను మలేషియా కంపెనీ పార్క్‌వే హాస్పిటల్ (ఐహెచ్‌హెచ్ గ్రూపు) రూ. 2,150 కోట్లకు కొన్నది.
 
 గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో 51% వాటాకోసం ఐహెచ్‌హెచ్ గ్రూపు రూ. 300 కోట్లు వెచ్చించింది. చిన్నాచితకా హాస్పిటల్స్ కూడా చేతులు మారాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న నోవా హాస్పిటల్స్‌ను రూ. 140 కోట్లకు అపోలో కొనుగోలు చేసింది. ఇప్పటికే రెయిన్‌బో, కిమ్స్ హాస్పిటల్స్‌లో ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు తమ వాటాలను మరింత పెంచుకునే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే 2016లో హాస్పిటల్స్ విలువ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement