నేషనల్ క్యారియర్‌గా ఎయిర్‌కోస్టా!
⇒ సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా సర్వీసులు
⇒ ఈ ఏడాది మరో ఆరు విమానాలు రాక
⇒ ఎయిర్‌కోస్టా చైర్మన్ రమేష్ లింగమనేని
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో తొలి ప్రాంతీయ విమాన సర్వీసులను ప్రారంభించిన ఎయిర్‌కోస్టా త్వరలోనే నేషనల్ క్యారియర్‌గా మారనుంది. జాతీయ స్థాయి విమానయాన సంస్థగా గుర్తింపును కోరుతూ ఒకటి రెండు రోజుల్లో కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేయనున్నట్లు ఎయిర్‌కోస్టా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాలకు విమాన సర్వీసులను అందించే ఉద్దేశంతో రీజనల్ కారియర్ నుంచి నేషనల్ క్యారియర్‌గా మారాలని నిర్ణయించినట్లు ఎయిర్‌కోస్టా చైర్మన్ రమేష్ లింగమనేని తెలిపారు. దీనికి సంబంధించి దరఖాస్తులను ఒకటి రెండు రోజుల్లో సమర్పించనున్నామని, సెప్టెంబర్ నాటికి నేషనల్ క్యారియర్‌గా గుర్తింపు లభిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కొత్తగా మరో ఆరు విమానాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం ఎయిర్‌కోస్టా నాలుగు విమానాలతో తొమ్మిది పట్టణాల నుంచి 34 డైలీ సర్వీసులను అందిస్తోంది. ప్రాంతీయ విమానయాన రంగంలోకి కొత్త కంపెనీలు ప్రవేశిస్తున్న దానిపై స్పందిస్తూ... దేశీయ విమానయాన రంగంలో చాలా అవకాశాలున్నాయని, ఏ కంపెనీ ఎవరికీ పోటీ కాద.న్నారు. ప్రస్తుతం ఎయిర్‌కోస్టా నిర్వహణా లాభాల్లోకి వచ్చినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.