► నిబంధనలకు అగ్నిమాపక శాఖ తిలోదకాలు
► ముందు జాగ్రత్త చర్యలను నీరుగారుస్తున్న వైనం
► నిబంధనల మేరకు భవనాలున్నా చేయి తడిపితేనే ఎన్‌ఓసీ
► ఆమ్యామ్యాలకే ప్రాధాన్యత
సాక్షి ప్రతినిధి, కడప : అక్రమార్జనకు కాదేదీ అనర్హం అన్నట్లుగా అగ్ని మాపక శాఖ వ్యవహరిస్తోంది. ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు కట్టుదిట్టం చేయాల్సిందిపోయి నిబంధనలను నీరు గారుస్తోంది. నిబంధనల మేరకు భవనాలు నిర్మిస్తే ఒకరేటు, ఇష్టానుసారం కట్టుకుంటే మరో రేటు నిర్ణయించి ఎన్‌ఓసీలు జారీ చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే వేధింపులు సర్వసాధారణమయ్యాయి. పాఠశాలలు, ఆస్పత్రులు, కాంప్లెక్సు, భారీ భవంతుల నిర్మాణంలో మున్సిపల్ ఫ్లాన్ అప్రూవల్ తప్పనిసరి.
దానితోపాటు అగ్నిమాపక శాఖ నో అబ్జక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసీ) ఇవ్వాల్సి ఉంటుంది. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు తప్పించుకోడానికి వీలుగా నిర్మాణాలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఈ శాఖ ఎన్‌ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మామూళ్లు మత్తులో ఈ శాఖ నిబంధనలను గాలికి వదిలేసింది. పెపైచ్చు నిబంధనల మేరకు నిర్మాణాలున్నా మామూళ్లు ఇవ్వందే ఎన్‌ఓసీలు జారీ కావడం లేదు. డబ్బు కోసం వేధిస్తూ కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
అవినీతి ఊబిలో యంత్రాంగం
మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ చెల్లింపులతో సంబంధం లేకుండా ఆరు అంతస్తుల నిర్మాణ భవనాలు చదరపు మీటరుకు రూ.10 చలానా చెల్లించి అగ్నిమాపక శాఖ అనుమతి పొందాల్సి ఉంది. అలాంటి భవనాల్లో ఐదు వేల లీటర్ల కెపాసిటీ కలిగిన ఓవర్ హెడ్ ట్యాంకు, 450 ఎల్పీఎం పంపు, హోస్ పైపు రీల్ ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లో అయితే అటోమేటిక్ స్ప్రింక్లర్లు ఏర్పాటు తప్పనిసరి. 25 వేల లీటర్లు కెపాసిటీ కలిగిన ఫైర్ లెస్ ట్యాంకు, అందులో 900 లీటర్స్ ఫర్ మినిట్ పంపు ఉండాలి.
ఇవన్నీ ఏర్పాటు చేస్తామని అంగీకరిస్తూ ముందుగా ప్రొవిజనల్ ఎన్‌ఓసీ తీసుకోవాలి. సైట్, ఫ్లోర్ వైజ్ ప్లాన్ ఇచ్చిన తర్వాత అన్నీ పరిశీలించి.. అగ్నిమాపక శాఖ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్ ప్రతి సంవత్సరం విధిగా రెన్యువల్ చేయించుకోవాలి. ఇవేమి పట్టించుకునే స్థితిలో అగ్ని మాపక శాఖ లేదు. అన్ని నిబంధనలు పాటించిన వారికి గౌరవంగా సర్టిఫికెట్ మంజూరు చేసిన దాఖలాలు కూడ లేవని తెలుస్తోంది.
నిబంధనల మేరకు నిర్మాణాలున్నా భారీగా సొమ్ము ముట్టజెప్పితే తప్ప ఎన్‌ఓసీ దక్కడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా భవనాలుంటే వారు అడిగినంత సమర్పించుకోక తప్పదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ జారీ చేసిన భవనాలల్లో 70 శాతం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలున్నట్లు తెలుస్తోంది.
నిబంధనల మేరకే అనుమతులు
‘పక్కాగా నిబంధనలున్న భవనాలకు మాత్రమే అనుమతులు ఇస్తున్నాం. నా దృష్టికి వచ్చిన వాటిలో పక్కాగా పరిశీలన చేశాకే సర్టిఫికెట్ ఇస్తున్నాం. ఇప్పటి వరకు ఒక్కటి మాత్రమే నిబంధనల మేరకు నిర్మించలేదని తిరస్కరణకు ప్రతిపాదనలు చేశామ’ని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి విజయ్‌కుమార్ ‘సాక్షి’కి వివరించారు. ప్రక్రియ కొనసాగేందుకు కొద్ది రోజులు పడుతుంది తప్ప ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేయడం లేదని ఆయన తెలిపారు.
ఇచ్చుకుంటే ఓకే..!
Published Wed, May 13 2015 3:09 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement