సాక్షి, హైదరాబాద్ : నగరాలు, పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణ అనుమతుల జారీలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను 21 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించింది. అనుమతి పొందిన/క్రమబద్ధీకరణ పొందిన లే అవుట్లలోని ప్లాట్ల విషయంలో తనిఖీలు అవసరం లేకుండానే దరఖాస్తుల పరిశీలన ప్రారంభించాలని సూచించింది. అనుమతుల జారీ/తిరస్కరణపై నిర్ణయాన్ని దరఖాస్తుదారులకు 21 రోజుల్లోగా రాతపూర్వకంగా తెలపని పక్షంలో సంబంధిత భవన నిర్మాణ ప్లాన్‌లతోనే సదరు దరఖాస్తులకు అనుమతి జారీ చేసినట్లు పరిగణిస్తామని స్పష్టం చేసింది.
ఒకవేళ ఈ విధంగా అనుమతులిచ్చినా, నియమ నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు జరపడానికి అనుమతిచ్చినట్లు కాదని పేర్కొంది. 21 రోజుల గడువులోగా దరఖాస్తులకు అనుమతి జారీ/తిరస్కరణలో విఫలమైతే సంబంధిత అధికారులు, సిబ్బందిని బాధ్యులను చేసి జరిగిన జాప్యంలో రోజుకు రూ.1,000 చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దరఖాస్తుల్లో ఏవైనా పత్రాలు, సమాచారం కొరవడితే (షార్ట్‌ఫాల్) దరఖాస్తుదారులకు 10 రోజుల గడువులోగా సమాచారమివ్వాలని, 21 రోజుల గడువులోగా ఈ దరఖాస్తులను పరిష్కరించేందుకు కృషి చేయాలని స్పష్టం చేసింది. శనివారం ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఇతర అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీలు, రాష్ట్రంలోని ఇతర అన్ని మునిసిపాలిటీలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. షార్ట్‌ఫాల్ గడువును అమలు చేయడంలో విఫలమైతే అందుకు కారణమైన అధికారులు, సిబ్బందిని బాధ్యులుగా చేసి జరిగిన జాప్యంలో రోజుకు రూ.1,000 చొప్పున జరిమానా విధిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పైన పైర్కొన్న గడువులను కచ్చితంగా అమలు చేసేందుకు 7 రోజుల్లోగా తనిఖీలు/పరిశీలనలు పూర్తి చేయాలని ఆదేశించారు. హెచ్‌ఎండీఏ/జీహెచ్‌ఎంసీలోని ల్యాండ్ సెక్షన్ కూడా సమాంతరంగా 7 రోజుల గడువులోగా భూ యాజమాన్య హక్కుల పరిశీలన జరిపి అభిప్రాయాన్ని తెలపాలని సూచించారు. దరఖాస్తుదారులను వేధింపులకు గురి చేయకుండా, సమగ్ర రూపంలో భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు దాఖలు అయ్యేలా చేసేందుకు లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సనల్స్‌ను బాధ్యులను చేయాలని పేర్కొన్నారు. అసమగ్రంగా/చెక్ లిస్ట్ పాటించకుండా/తప్పుడు సమాచారంతో దరఖాస్తులు సమర్పిస్తున్న లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సనల్స్ మూడు పర్యాయాలు తప్పులు చేస్తే లైసెన్స్‌లు రద్దు చేసి వారి పేర్లను జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్లలో బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు.
గడువులు ఎందుకంటే..
సరళీకృత వ్యాపార (ఈఓడీబీ) సంస్కరణల్లో భాగంగా ఏడాదిన్నర కింద లే అవుట్లు, భవన నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో అనుమతుల జారీ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సత్వరంగా అనుమతుల జారీ కోసం పలు ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లోపు తనిఖీ నివేదికలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని, అనుమతులు పొందిన/క్రమబద్ధీకరణ పొందిన లే అవుట్లలోని ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతుల విషయంలో రిస్క్ బేస్డ్ క్లాసిఫికేషన్ ప్రక్రియ జరపాల్సిన అవసరం లేదని గతంలోనే తెలిపింది. అన్ని శాఖల అధికారులు ఒకేసారి తనిఖీలు జరపాలని సూచించింది. ఇలా అనుమతుల జారీ ప్రక్రియను ప్రభుత్వం సరళీకరించినా దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన/తనిఖీల విషయంలో ఆలస్యం చేస్తున్నారు.
గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం 30 రోజుల్లో అనుమతులు జారీ చేయాల్సి ఉండగా.. ఆ గడువుకు రెండు మూడు రోజుల ముందు అదనపు సమాచారం, పత్రాలు కావాలని దరఖాస్తుదారులను కోరుతున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల్లోని ల్యాండ్ విభాగం దరఖాస్తుల పరిశీలనకు ఓ నిర్దేశిత సమయం అంటూ పాటించడం లేదు. మరి కొన్ని కేసుల్లో లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సనల్స్ నిబంధనలకు అనుగుణంగా ఇంటి ప్లాన్స్‌ను సమర్పించకపోవడంతో దరఖాస్తులను తిరస్కరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా భవన నిర్మాణాల అనుమతుల జారీలో జాప్యాన్ని నివారించేందుకు గడువులు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment