విశాఖ మెడికల్: కేజీహెచ్ రూపురేఖలు త్వరలో మారనున్నాయి. కొత్త భవనాలు రానున్నాయి. నిధులున్నా ఏడాదిన్నరగా నిర్మాణ అనుమతులు రాక ఎదురుచూస్తున్న ఆసుపత్రిలోని ప్రతిష్టాత్మక సీఎస్‌ఆర్ (సామాజిక భాధ్యతానిధులు) ప్రాజెక్టు కింద వీటిని నిర్మించనున్నారు. రూ.70 కోట్ల వ్యయంతో ఆసుపత్రి ఆవరణలో పాత ఈఎన్‌టీ బ్లాకు స్థానే ఎకరా స్థలంలో పది అంతస్తుల సర్జికల్ ఆంకాలజీ సూపర్ స్పెషాలిటీ భవన సముదాయ నిర్మాణానికి ఏడాదిన్నర క్రితం శంకుస్థాపన చేసినా, ఇంతవరకు అనుమతులురాలేదు. దీంతో ఈప్రాజెక్టు చతికిలపడింది.
ఈమేరకు ఆసుపత్రి వర్గాలు అనుమతులు కోసం పదేపదే ప్రతిపాదనలు పంపుతున్నా ప్రభుత్వం స్పందించలేదు. వైద్య ఆరోగ్యశాఖామంత్రి కామినేని,ఆశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యంలు తాజాగా ఈప్రాజెక్టు ప్రతిపాదనలు పంపాలంటూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో ఈప్రాజెక్టు నిర్మాణంపై ఆసుపత్రి వర్గాల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇందుకోసం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదనబాబు ఆసుపత్రి సర్వీసులు మౌలిక వసతుల సంస్థ డీఈ ప్రభాకర్ లు రెండురోజులు క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సీఎస్‌ఆర్ ప్రాజెక్టు నిర్మాణానికి స్టీల్‌ప్లాంట్, పోర్టుట్రస్టు,ఓఎన్‌జీసీ,గెయిల్,ఎన్టీపీసీలు నిధులు సమకూర్చేందుకు కేజీహెచ్‌తో ఎంఓయూలను కుదుర్చుకున్నాయి.
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ కూడా ఐదుకోట్లు ఇవ్వడానికి ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్రప్రభుత్వ సంస్థలు 65 కోట్ల రూపాయలను రానున్న నాలుగు ఐదు ఏళ్లలో దశల వారీగా ఇవ్వడానికి అంగీకారం తెలిపాయి. ఇందులో భాగంగా రూ.5 కోట్లు చెక్కును తొలివిడతగా ఓఎన్‌జీసీ ఇప్పటికే అందచేసింది.
టీఎస్సార్ చొరవ: ఈప్రాజెక్టు నిర్మాణ నిధులను సేకరించడంలో రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యాలతో చర్చించి నిధులు వచ్చేలా చొరవ చూపారు. వాస్తవానికి ఈప్రాజెక్టు నిర్మాణ అనుమతులు కోసం ప్రభుత్వానికి ఆర్నెళ్ల క్రితమే ప్రతిపాదనలు పంపగా అప్పట్లోనే అనుమతులు వస్తాయని ఆసుపత్రి వర్గాలు భావించాయి. ఈలోగా ప్రభుత్వం కేజీహెచ్ సమగ్ర అభివృద్ధికి రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌పైకి తమ దృష్టిని మరల్చడంతో ఈప్రాజెక్టు నిర్మాణ అనుమతులకు బ్రేక్ పడింది. మాస్టర్ ప్లానులో భాగంగా సీఎస్‌ఆర్ నిధులతో పాటు మరికొంత సొమ్మును జతచేసి వందకోట్లుతో మాస్టర్‌ప్లానును రూపొందించాలని ప్రభుత్వ పెద్దలు భావించారు.
ఇందుకోసం సీఎస్‌ఆర్ భవన సముదాయానికి ముందు వరుసలో మరో పది అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మించి వార్డులు, ఐసీయూలు అన్నింటినీ అందులోకి తరలించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రస్తుతం అదే స్ధలంలో ఉన్న ఎముకలు,ప్రసూతి వార్డులను తొలగించాలని ఆలోచిస్తున్నట్టు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బహుల అంతస్తుల భవన నిర్మాణం కూడా సాకారమైతే కేజీహెచ్ మొత్తం సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌తో సహా 20అంతస్తులు భవన సముదాయాల కల నెరవేరనుంది.
ఇవీ ప్రతిపాదనలు
ఈప్రాజెక్టు కింద రానున్న పది అంతస్తుల సీఎస్‌ఆర్‌ర్ భవన సముదాయంలో ఐదు వందల పడకలు ఏర్పాటు కానున్నాయి. తొలిఅంతస్తులో క్యాన్సర్‌కు సంబంధించిన వైద్యసదుపాయాలు ఉంటాయి.
తరువాతఅంతస్తులలో ఆపరేషన్ ధియేటర్ల కాంప్లెక్సు, సెమినార్ హాళ్లు, లెర్చర్‌హాళ్లు,రోగుల ప్రత్యేక గదులు, ఆరోగ్యశ్రీవార్డులుతోపాటు పలు రకాల వసతి సదుపాయాలు వచ్చే విధంగా ప్రణాళాకలను రూపొందించారు.
దిగువ అంతస్తులో వాహనాల పార్కింగ్‌కు సదుపాయాన్ని కూడా కల్పించాలని నిర్ణయించారు.