
సాక్షి, హైదరాబాద్ : భవన నిర్మాణ అనుమతుల ఫీజులు, చార్జీల చెల్లింపులో ప్రభుత్వం రాష్ట్రమంతటికీ వెసులుబాటు కల్పించింది. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఈ ఫీజులను 4 సమ వాయిదాల్లో (6 నెలలకు ఒకటి... మొత్తం రెండేళ్ల వ్యవధి ఇస్తారు) చెల్లించడానికి వీలు కల్పిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. స్థిరాస్తి రం గాన్ని ప్రోత్సహించడానికి బిల్డింగ్ పర్మిట్ ఫీజు, బెటర్‌మెంట్, డెవలప్‌మెంట్, క్యాపిటలైజేషన్ చార్జీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హెచ్‌ఎండీఏల పరిధిలో వాయిదాల్లో చెల్లించడానికి అనుమతిస్తూ ఈ ఏడాది జులై 8న రాష్ట్ర ప్రభుత్వం జీవో 108ను జారీచేసింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని పురపాలికలకు దీన్ని వర్తింపజేస్తూ అరవింద్ కుమార్ ఉత్తర్వులిచ్చారు.
♦ అన్ని రకాల చార్జీలను నాలుగు సమ అర్ధ వార్షిక వాయిదాల్లో చెల్లించవచ్చు.
♦ ఫీజు ఇంటిమేషన్ లేఖ అందిన 30 రోజుల్లోగా తొలి వాయిదా చెల్లించాలి.
♦ ఎవరైనా బిల్డర్, డెవలపర్ బిల్డింగ్/ లే అవుట్ అనుమతుల సమయంలోనే మొత్తం ఫీజులు, చార్జీలు చెల్లించేందుకు ముందుకు వస్తే ఎర్లీబర్డ్ పథకం కింద మొత్తం ఫీజుల్లో 5 శాతం రాయితీ లభిస్తుంది.
♦ పోస్ట్‌డేటెడ్ చెక్కుల్లో పేర్కొన్న తేదీల్లోగా వాయిదాలను చెల్లించడంలో విఫలమైతే జాప్యం జరిగిన కాలానికి 12% వడ్డీతో కలిపి చెల్లించాలి.
♦ 2021 మార్చి 31 లోగా వచ్చే కొత్త దరఖాస్తులతో పాటు అన్ని పెండింగ్ దరఖాస్తులకు ఈ వెసులుబాటు వర్తించనుంది.
Comments
Please login to add a commentAdd a comment