arvind kumar
-
రేపు కేటీఆర్‌కు ఈడీ నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’కార్ల రేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ‘ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)’ను నమోదు చేసిన ఈడీ అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితులకు సమన్లు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఏ–2గా ఉన్న పురపాలకశాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఏ–3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ సోమవారం సమన్లు జారీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఏసీబీ నుంచి ఫార్ములా–ఈ కారు రేసు ఒప్పందాలకు సంబంధించి సేకరించిన పత్రాలు, ఎఫ్ఐఆర్తోపాటు బ్యాంకు లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించారు. హెచ్ఎండీఏ సాధారణ నిధుల నుంచి యూకేకు చెందిన ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ)’కు రూ.45,71,60,625 సొమ్మును విదేశీ కరెన్సీలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బదిలీ చేశారు. దీంతో సదరు బ్యాంకు అధికారుల వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. ఇందుకు సంబంధించి బ్యాంకు అధికారులను సైతం ప్రశ్నించనున్నారు. ఓవైపు ఈ కేసులో ఈడీ అధికారులు వేగం పెంచగా మరోవైపు తెలంగాణ ఏసీబీ సైతం కీలకాంశాలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. కేటీఆర్‌ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయొద్దని.. కానీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు ఆదేశించడంతో ఆధారాల సేకరణపై ఏసీబీ దృష్టి పెట్టింది. తొలుత హెచ్ఎండీఏ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్ వాంగ్మూలం నమోదుతో దర్యాప్తు ప్రక్రియ ప్రారంభించనుంది. ఈడీ, ఏసీబీ దర్యాప్తులో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఏసీబీ సేకరించే పత్రాలు ఈడీకి ఉపయోగపడినట్లే ఈడీ దర్యాప్తులో మనీలాండరింగ్ కోణంలో ఏవైనా ఆధారాలు లభిస్తే ఈ కేసు మరో మలుపు తిరుగుతుందన్న చర్చ నడుస్తోంది. -
‘విద్యుత్’ నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి?
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత, మాజీ అధికారులకు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఆయా అధికారులు, మాజీ అధికారులు పోషించిన పాత్ర ఏమిటనే వివరణ, అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. ఈ ప్లాంట్ల నిర్మాణం, విద్యుత్ కొనుగోలులో భాగస్వాములైన వ్యక్తులు, సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు సోమవారం బహిరంగ ప్రకటన కూడా జారీ చేయనుంది. సంబంధిత వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు రాతపూర్వకంగా అందించడానికి వీలు కల్పించనుంది. అవసరమైతే బహిరంగ విచారణకు రావాలని వారిని పిలిపించే అవకాశమూ ఉంది. ప్రస్తుత, మాజీ అధికారులందరికీ.. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంతో సంబంధమున్న ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ జి.రఘుమారెడ్డి, టీఎస్ఎన్పీడీసీఎల్ మాజీ సీఎండీలు కె.వెంకటనారాయణ, ఎ.గోపాల్‌రావుతోపాటు ఆయా విద్యుత్ సంస్థల మాజీ, ప్రస్తుత డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారులకు కమిషన్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. వీరితోపాటు నామినేషన్లపై యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను దక్కించుకున్న బీహెచ్ఈఎల్ సంస్థ ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులు, ఛత్తీస్‌గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మాజీ, ప్రస్తుత ఉన్నతాధికారులకు సైతం నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి వీరికి నోటీసులు అందనున్నట్టు సమాచారం. త్వరలో ప్రజాప్రతినిధులకు కూడా.. విద్యుత్ ప్లాంట్లు, కొనుగోళ్లపై న్యాయ విచారణలో భాగంగా తొలిదశలో ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసిన కమిషన్.. ఆ నిర్ణయాల్లో తమ పాత్రపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అవసరమైతే కమిషన్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరుకావాలని పిలిచే అవకాశం ఉందని విద్యుత్ వర్గాలు చెప్తున్నాయి. ఈ వివరణల్లో లభించే సమాచారం ఆధారంగా.. తర్వాతి దశలో పలువురు ప్రజాప్రతినిధులకు నేతలకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం గడువు విధించిన నేపథ్యంలో.. కమిషన్ న్యాయ విచారణ ప్రక్రియను వేగిరం చేయాలని నిర్ణయించింది. ఈఆర్సీకి అరవింద్ కుమార్ లేఖనే కీలకం.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని.. ఆ ఒప్పందాన్ని ఆమోదించవద్దని కోరుతూ నాటి రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ 2016 డిసెంబర్లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి లేఖ రాశారు. దీనిపై ఆగ్రహించిన అప్పటి సర్కారు.. ఆయనను మరుసటి రోజే ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా బదిలీ చేసింది. తాజాగా ఆయనకు కూడా విచారణ కమిషన్ నోటీసులు జారీ చేయడంతో.. నాటి లేఖ, ఆయన వివరణ కీలకంకానున్నాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
HMDA శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్.. ఐఏఎస్ అరవింద్..
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈకేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ.. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అంశాన్ని బయటకు తీసింది. దీంతో, విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. వివరాల ప్రకారం.. హెచ్ఎండీఏ అధికారి శివబాలకృష్ణ అవినీతి కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. శివ బాలకృష్ణ కేసులో తాజాగా ఏసీబీ నివేదిక రెడీ చేసింది. ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇక, ఈ కేసులో మరో కొత్త అంశాన్ని బయటకు తీసుకువచ్చింది. ఏసీబీ నివేదికలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వ్యవహారాన్ని ప్రస్తావించింది. బాలకృష్ణ దగ్గర నుంచి అరవింద్ కుమార్ పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్టు నివేదికలో పేర్కొంది. ఇక, ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్‌ను విచారించేందుకు ఏసీబీ.. ప్రభుత్వ అనుమతిని కోరింది. మరోవైపు.. బాలకృష్ణ నుంచి రికవరీ చేసిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, గత పదేళ్ల కాలంలో దాదాపు 15 సెల్‌ఫోన్స్ మార్చినట్టు ఏసీబీ నివేదికలో వెల్లడించారు. ఈ ఫోన్లు, కాంటాక్ట్‌లకు సంబంధించి మరిన్ని కీలక విషయాలను ఏసీబీ వెల్లడించే అవకాశం ఉంది. -
అంతా ఆయన చెబితేనే చేశా..
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి కథ రోజుకో మలుపు తిరుగుతోంది. మరికొన్ని కీలక పాత్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ‘అంతా ఆ అధికారి చెబితేనే చేశాను’అంటూ ఏసీబీ అధికారుల వద్ద శివబాలకృష్ణ చెప్పినట్టు సమాచారం. నాటి పురపాలక, పట్టణాభివృధ్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఈ మొత్తం అవినీతి వ్యవహారం వెనుక కీలక వ్యక్తి అని ఏసీబీకి ఇచ్చి న కన్ఫెషన్ రిపోర్ట్ (వాగ్మూలం)లో శివబాలకృష్ణ పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘నేను ఇంత పెద్ద మొత్తంలో అవినీతి సొమ్ము కూడ బెట్టడంలో పై అధికారి అరవింద్‌కుమార్ పూర్తి సహకారం ఉంది. నా నుంచి ఎన్నో పనులు చేయించుకుని ఆయన కూడా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించారు..’అంటూ ఆరోపణలు చేసినట్టు తెలిసింది. కోర్టుకు సమర్పించిన ఈ కన్ఫెషన్ రిపోర్టులో ఏసీబీ అధికారులు.. అరవింద్‌కుమార్ పాత్రకు సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావించినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు కన్ఫెషన్ రిపోర్టులోని ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. కోటి రూపాయలు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చా ఉదయ ఎస్ఎస్వీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌ను నార్సింగిలోని 12 ఎకరాల స్థలంలో చేపట్టారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణంతో కూడిన ఈ ప్రాజెక్టు చాలా కాలంగా అనేక చట్టపరమైన సమస్యల కారణంగా పెండింగ్‌లో ఉంది. హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ 2023 నవంబర్, డిసెంబర్లలో హెచ్ఎండీఏ సెక్రటరీ చంద్రయ్యతో కలిసి సమస్యను పరిష్కరించారు. వివాదాన్ని క్లియర్ చేసి ప్రణాళికను విడుదల చేశారు. ఇందుకోసం అరవింద్ కుమార్ ఆ సంస్థ యాజమాన్యం నుంచి రూ.10 కోట్ల లంచం డిమాండ్ చేశారు. అందులో భాగంగా 2023 డిసెంబర్లో రూ.1 కోటి నగదు ఉదయ ఎస్ఎస్వీ ప్రాజెక్టు ప్రతినిధి షేక్ సైదా నాకు ఇచ్చారు. మరుసటి రోజు ఉదయం ఆ డబ్బును నేను జూబ్లీహిల్స్ అంబేడ్కర్ వర్సిటీ సమీపంలోని అరవింద్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయనకు అందజేశా. భూమార్పిడి చేసినందుకు రూ.కోటి ఆరు నుంచి ఏడు నెలల క్రితం క్యూ–మార్ట్ రాహుల్ అనే ఒక వ్యక్తి నాకు రెరా కార్యాలయంలో రూ.ఒక కోటి ఇచ్చారు. ఆ డబ్బును అదే రోజు నేను అరవింద్‌కుమార్ నివాసంలో అందజేశా. బాచుపల్లిలోని రెండు ఎకరాలలోపు భూమిని మార్పిడి చేసినందుకు అరవింద్‌కుమార్ రూ.కోటి లంచం డిమాండ్ చేసినట్టుగా ఆ వ్యక్తి నాతో చెప్పాడు. వివిధ పనుల గురించి అరవింద్‌కుమార్ తరఫున నా నుంచి కొందరు వ్యక్తులు డబ్బులు వసూలు చేసేవారు. మైహోం బూజాలో ఉండే రంగా భాయ్, మీనా జ్యూవెలర్స్ ఎండీ , కేశినేని ప్రాజెక్ట్స్ రవి రమేశ్, ఎల్బీనగర్లో ఉండే సుధాకర్ ఇతరులు వీరిలో ఉన్నారు. ఈస్ట్ మారేడ్‌పల్లి, కోకాపేట్ ప్రాజెక్టుల్లో కూడా.. ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు విషయంలో జీహెచ్ఎంసీ నుంచి అనుమతుల విషయంలో మీనాక్షి కంపెనీకి అరవింద్‌కుమార్ చేసిన సాయానికి బదులుగా ఆయన డిమాండ్ చేసిన మేరకు రూ.50 లక్షలు సదరు కంపెనీ లైజనింగ్ అధికారి నాగబాబు మా ఇంటికి వచ్చి ఇచ్చాడు. ఆ సొమ్మును అదే రోజు అరవింద్‌కుమార్ ఇంటికి వెళ్లి ఆయనకు ఇచ్చా. కోకాపేట్ హై రైజ్ బిల్డింగ్ ప్రాజెక్టులో ప్రెస్టీజ్ గ్రూప్‌కు అరవింద్ కుమార్ సహాయం చేశారు. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ జనరల్ మేనేజర్ సురేష్ 2022 చివరిలో అరవింద్ కుమార్ కోసం రూ.40 లక్షల లంచం నాకు ఇచ్చారు. అ డబ్బును కూడా నేను అరవింద్ కుమార్‌కు ఆయన నివాసంలోనే అందజేశా. ఇక కోకాపేట్ మల్టిస్టోర్డ్ హై రైజ్ బిల్డింగ్‌లోని సాలార్ పురియ సత్తవ ప్రాజెక్ట్‌కు సాయం చేసినందుకు అమిత్ సలార్ పురియా డిసెంబర్ 2022లో అరవింద్ కుమార్ కోసం రూ.35 లక్షలు లంచం తీసుకు వచ్చారు. అ డబ్బును అరవింద్ కుమార్‌కు ఇచ్చా. నాకూ కొన్ని ప్లాట్లు బహుమతిగా అందాయి సాయి సందీప్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ , ప్రైమ్ ల్యాండ్ ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్‌కు చెందిన కె.సందీప్‌రెడ్డి కంది మండలంలో, ఇతర ప్రాంతాల్లో చేసిన వెంచర్స్‌లో కొన్ని ప్లాట్లు నాకు బహుమతిగా ఇచ్చారు. నాకు గుర్తున్నంత వరకు నాకు గిఫ్ట్‌గా వచ్చి న ప్లాట్లను మా మేనల్లుడు భరణి పేరిట రిజిస్టర్ చేయించాను. నా పై అధికారి అరవింద్‌కుమార్ సైతం తన డ్రైవర్లు, గన్మెన్లు, ఇతరుల పేరుమీద ప్లాట్లు రిజిస్టర్ చేయించేవారు. ఆయన వాట్సాప్ ద్వారా నాకు వివరాలు పంపేవారు. ఎవరి పేరుమీద ప్లాట్లు రిజిస్టర్ చేయాలన్నది నాకు సూచించేవారు. ఈ వివరాలు నేను డెవలపర్లకు పంపేవాడిని, నాకు గుర్తు ఉన్నంత వరకు కంది మండలం, ఇతర ప్రాంతాల్లోని సాయి సందీప్ డెవలపర్స్, ఇన్ప్రా, ప్రైమ్‌ల్యాండ్ ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ వెంచర్స్‌లో ప్లాట్లను 2022 ఆగస్టు, డిసెంబర్లో రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ ఫీజు సైతం ఆ కంపెనీలే చెల్లించేవి. వెర్టెక్స్ హోం కంపెనీ రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని మంఖాల్ గ్రామంలో చేసిన వెంచర్‌కు గాను అరవింద్‌కుమార్.. 550 చదరపు గజాల ఓపెన్ ప్లాట్‌ను ఎలాంటి క్రయ విక్రయాలు లేకుండా గిఫ్ట్‌గా పొందారు. అరవింద్ కుమార్ విచారణకు ఏసీబీ సమాయత్తం? శివ బాలకృష్ణ ఇచ్చి న వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుత ప్రకృతి విపత్తుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను ప్రశ్నించడానికి ఏసీబీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అఖిల భారత సర్వీసు అధికారి కావడం వల్ల ఈ విషయమై డీవోపీటికి కూడా సమాచారం అందించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
TS: ఫార్ములా ఈ రేస్.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: ప్రతీ పైసాను రాష్ట్ర ప్రజల అవసరాల కోసమే ఖర్చు చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని విమర్శించారు ‘ఫార్ములా ఈ-రేస్‌పై మాజీ మంత్రులు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. రేసుపై మా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదంటున్నారు. ఫార్ములా ఈ-రేస్ వెనక్కి వెళ్లడంతో నష్టం జరిగిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఫార్ములా ఈ-రేస్‌పై ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. ఫార్ములా ఈ-రేస్ టికెట్లు అమ్ముకుని ఓ కంపెనీ లబ్ధిపొందింది. ఫార్ములా ఈ-రేస్‌లో ముగ్గురు వాటాదారులున్నారు’ అని భట్టి వెల్లడించారు. కాగా, అవసరమైన అనుమతులు తీసుకోకుండా గత ప్రభుత్వంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ ఫార్ములా ఈ రేసు ఒప్పందం చేసుకున్నారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అరవింద్‌కుమార్‌కు మంగళవారం ప్రభుత్వం మెమో జారీ చేసింది. అరవింద్‌కుమార్ ప్రస్తుతం విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌గా ఉన్నారు. ఇదీచదవండి.. ఫార్ములా ఈ రేస్.. ఐఏఎస్ అరవింద్‌కుమార్‌కు మెమో -
అరవింద్ కుమార్‌కు ‘విపత్తు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ను ప్రభుత్వం రెవెన్యూ శాఖ పరిధిలోని విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దాన కిశోర్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా స్థానచలనం కల్పించింది. కీలకమైన హెచ్ఎండీఏ కమిషనర్, పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ పదవుల అదనపు బాధ్యతల నుంచి సైతం అరవింద్‌కుమార్‌ను తప్పించింది. ఆ రెండు పోస్టుల అదనపు బాధ్యతలనూ దానకిశోర్కే అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో లీజుపై అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అప్పగింతపై నిర్వహించిన టెండర్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని అప్పట్లో రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై హెచ్ఎండీఏ కమిషనర్‌గా అరవింద్ కుమార్ స్పందిస్తూ రేవంత్‌రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో అరవింద్‌కుమార్‌ను అప్రధానమైన విపత్తుల నిర్వహణ విభాగానికి బదిలీ చేయడం గమనార్హం. గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా వ్యవహరించిన రాహుల్ బొజ్జాను సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అదనపు బాధ్యతల్లో ఆయన్ను కొనసాగించింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను తప్పించి ఆమెను స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు బదిలీ చేసింది. ఆమె స్థానంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంను విద్యాశాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ క్రిస్ట్రీనా జెడ్.చొంగ్తును కీలకమైన వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించడం విశేషం. -
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పేస్కేలు
సాక్షి, హైదరాబాద్: పట్టణ/గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా/సెర్ప్)ల ఉద్యోగులకు శుభవార్త. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన మెప్మాలో పనిచేస్తున్న 378 మంది ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పేస్కేలు వర్తింపజేస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సెర్ప్‌లోని 3,974 మంది ఉద్యోగులకు సైతం పేస్కేలు వర్తింపజేస్తూ గత మార్చి 18న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేయగా, తాజాగా ఈ రెండు జీవోలు బయటకు వచ్చాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి పేస్కేలు వర్తింపు.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మెప్మా, సెర్ప్ ఉద్యోగులకు 2023 ఏప్రిల్ 1 నుంచి పేస్కేల్ వర్తించనుంది. ప్రస్తుత కనీస వేతనానికి సమీపంలో ఉన్న పేస్కేళ్లను వర్తింపజేయనున్నారు. మెప్మా ఉద్యోగులకు ప్రస్తుత కనీస వేతనానికి రక్షణ కల్పిస్తారు. సెర్ప్ ఉద్యోగుల ప్రస్తుత స్థూల వేతనం, ఇతర అలవెన్సులకు రక్షణ లభించనుంది. పేస్కేలు వర్తింపజేసినా సెర్ప్, మెప్మా ఉద్యోగులు ఇప్పటి తరహాలోనే రిజిస్టర్డ్ సొసైటీ ఉద్యోగులుగా కొనసాగుతారని, ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించినట్టు లేదా ప్రభుత్వంలో విలీనం చేసుకున్నట్టు పరిగణించడానికి వీలు లేదు. కాగా, వీరికి ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఇదిలా ఉండగా ఇకపై ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాతే మెప్మాలో రెగ్యులర్/కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ పోస్టులను సృష్టించాలని ఆ ఉత్తర్వులు స్పష్టం చేశాయి. మెప్మా కొత్త పేస్కేళ్లు ఇలా: మెప్మా ఉద్యోగులకు వారి హోదాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల కేటగిరీ పేస్కేళ్లను వర్తింపజేయనున్నారు. స్టేట్ మిషన్ డైరెక్టర్లకు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–2, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్లకు సూపరింటెండెంట్, ఎంఐఎస్ మేనేజర్లకు సీనియర్ అసిస్టెంట్, టౌన్ మిషన్ కోఆర్డినేటర్లకు సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్లకు కామన్ అసిస్టెంట్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు/జూనియర్ అసిస్టెంట్లు/డేటా ఎంట్రీ ఆపరేట ర్లకు జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్లకు డ్రైవర్, ఆఫీస్ సబా ర్డినేట్లకు ఆఫీస్ సబార్డినేట్ పే–స్కేళ్లు వర్తింపజేస్తారు. సెర్ప్‌లో పేస్కేళ్లు .. సెర్ప్‌లోని మండల సమాఖ్య కమ్యూనిటీ కోఆర్డినేటర్లు/ఆఫీస్ సబార్డినేట్లకు ఆఫీస్ సబార్డినేట్, మండల్ బుక్ కీపర్లకు రికార్డు అసిస్టెంట్, కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లకు సీనియర్ అసిస్టెంట్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్లకు సూపరింటెండెంట్, ప్రాజెక్టు మేనేజర్లకు ఎంపీడీఓ, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్/ప్రాజెక్టు సెక్రటరీలకు జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్లకు డ్రైవర్ల హోదాలో ప్రభుత్వ ఉద్యోగుల పేస్కేలు వర్తింపజేస్తారు. మెప్మాలో అడ్డదారిలో నియామకాలు? మెప్మా ఉద్యోగులకు పేస్కేలు వర్తింపజేస్తామని దాదాపు ఏడాది కిందటే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆ తర్వాత మెప్మాలో కొంత మంది అధికారులు తమ పిల్లలను, బంధువులను దొడ్డిదారిలో నియమించుకున్నారని ఆరోపణలు న్నాయి. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన జీవోతో వారికి సైతం ప్రయోజనం కలగనుందని విమర్శలు వస్తున్నాయి. -
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. న్యూస్ చానెల్ అధికారి అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ తాజాగా మరొకరిని అరెస్ట్ చేసింది. ‘ఇండియా ఏహెడ్’ న్యూస్ చానెల్ కమర్షియల్ హెడ్, ప్రొడక్షన్ కంట్రోలర్ అర్వింద్ కుమార్ జోషిని అదుపులోకి తీసుకుంది. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ ప్రచార బాధ్యతలను చేపట్టిన చారియెట్ మీడియా సంస్థకు ఈయన హవాలా మార్గంలో రూ.17 కోట్లను బదిలీ చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. వాట్సాప్ చాటింగ్, హవాలా ఆపరేటర్ల రికార్డులు పరిశీలించిన తర్వాత జోషిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. చారియెట్ మీడియా యజమాని రాజేశ్ జోషిని ఫిబ్రవరిలోనే ఈడీ అదుపులోకి తీసుకుంది. అయితే, సరైన ఆధారాలను సమర్పించలేదంటూ మే 6న ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిలిచ్చింది. -
ఓఆర్ఆర్ లీజులో భారీ కుంభకోణం ఆరోపణలు.. పూర్తి వివరాలు ఇవిగో!
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు లీజు అంతా పారదర్శకమని, కేంద్రం ఆమోదంతో జాతీయ రహదారుల సంస్థ గుర్తించిన టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (టీఓటీ) విధానాన్ని పాటించినట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. 30 ఏళ్ల లీజుపై తాము నిర్ణయించిన బేస్‌ప్రైస్ కంటే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ రూ.7380 కోట్లతో ఎక్కువ మొత్తంలో బిడ్ చేసినట్లు వెల్లడించారు. పోటీలో ఉన్న నాలుగు సంస్థల్లో ఇదే ఎక్కువ మొత్తమని చెప్పారు. బేస్‌ప్రైస్ విషయంలో సాంకేతికంగానే గోప్యత పాటించినట్లు పేర్కొన్నారు. ఔటర్ లీజులో భారీ కుంభకోణం జరిగినట్లు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో టెండర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే.. బిడ్డింగ్‌లో లోపాల్లేవ్.. . ♦ జాతీయ రహదారుల సంస్థ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6 బండిల్స్‌లో సుమారు 1600 కిలోమీటర్లను టీఓటీ ప్రాతిపదికన 15 నుంచి 30 ఏళ్ల కాలపరిమితికి లీజుకు ఇచ్చిన పద్ధతినే ఔటర్ విషయంలో అనుసరించాం. రెవెన్యూ మ ల్టిఫుల్ పరంగా దేశంలోని రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ప్రాజెక్టుల కోసం ఖరారు చేసిన వాటిలో ఔటర్ లీజు అత్యుత్తమ బిడ్. ♦ హైదరాబాద్ మహానగరం చుట్టూ 8 లేన్లతో చేపట్టిన ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం 2006లో ప్రారంభమైంది. 2012 నాటికి 79.45 కిలోమీటర్లు, 2018 నాటికి 158 కి.మీ పూర్తి చేశారు. 2012 నుంచే ఔటర్‌పై టోల్ వసూలు మొదలైంది. ఆ ఏడాది రూ.11.11 కోట్లు ఆదాయం లభించగా 2018 నాటికి రూ.340 కోట్లు, 2022 నాటికి రూ.542 కోట్ల చొప్పున ఆదాయం లభించింది. జాతీయ రహదారుల సంస్థ 2008లో విధించిన నిబంధనల మేరకు టోల్ రుసుము నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టోల్ రుసుముపై అదే విధానాన్ని అనుసరిస్తున్నాం. ♦ కేంద్ర క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదించిన టీఓటీ ప్రకారం ఔటర్ రింగ్‌రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు గతేడాది ఆగస్టు 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతేడాది నవంబర్ 9న అంతర్జాతీయ సంస్థల నుంచి హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 11 బిడ్డర్లు ఆసక్తి ప్రదర్శించారు. బిడ్డింగ్‌లో ఎలాంటి లోపాలకు తావులేకుండా పారదర్శకతను పాటించేందుకు 142 రోజుల వ్యవధి ఇచ్చాం. పదేళ్లకోసారి సమీక్ష... ♦ ఐఆర్బీకి 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చినప్పటికీ ప్రతి పదేళ్లకు ఒకసారి లీజును సమీక్షిస్తారు. రోడ్డు మరమ్మతులు, నిర్వహణ, టోల్ రుసుము, సిబ్బంది జీతభత్యాలు, ఆదాయ,వ్యయాలు, తదితర అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఈ సమీక్షను నిర్వహిస్తారు. ♦ టోల్ పెంపు పైన ఐఆర్బీ చేసే ప్రతిపాదనలు జాతీయ రహదారుల సంస్థ నిబంధనలకు లోబడి ఉంటాయి. హెచ్ఎండీఏ ఆమోదంతోనే అవి అమలవుతాయి. ఔటర్‌పైన పచ్చదనం నిర్వహణ పూర్తిగా హెచ్ఎండీఏ పర్యవేక్షిస్తుంది. ఇందుకయ్యే ఖర్చును ఐఆర్బీ చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతం ఔటర్‌పైన ఇంటర్‌చేంజ్‌ల వద్ద ఉన్న ట్రామాకేర్ సెంటర్లను ఐఆర్బీ నిర్వహించనుంది. ఐఆర్బీ సంస్థకు లీజు ఆమోదపత్రం అందజేశాం. 120 రోజుల్లోపు ఐఆర్బీ బిడ్డింగ్ మొత్తాన్ని (రూ.7380కోట్లు) ఏకమొత్తంలో చెల్లించిన అనంతరమే ఔటర్‌ను అప్పగిస్తాం. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న ఈగిల్ ఇన్ఫ్రా సంస్థే టోల్ వసూలు చేస్తుంది. ఎవరెంత బిడ్ వేశారంటే.. ♦ మొత్తం ఈ బిడ్డింగ్ ప్రక్రియలో 11 సంస్థల్లో చివరకు నాలుగు మాత్రమే అర్హత సాధించాయి. ‘ప్రస్తుతం టోల్ వసూలు చేస్తున్న ఈగల్ ఇన్ఫ్రా సంస్థ 30 ఏళ్ల ఔటర్ లీజుపై రూ.5634 కోట్లు, గవార్ కన్స్ట్రక్షన్స్ రూ.6767 కోట్లు, దినేష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.7007 కోట్లు చొప్పున బిడ్ వేశాయి. ఐఆర్బీ అత్యధికంగా రూ. 7380 కోట్లతో ముందుకు వచ్చింది. తాము నిర్ణయించిన బేస్ ప్రైస్ కంటే ఇది ఎక్కువగా ఉండడంతో ఐఆర్బీ హెచ్–1 కింద లీజు పొందింది. ♦ బేస్ ప్రైస్ ముందే నిర్ణయించినప్పటికీ ఎన్హెచ్ఏఐ నిబంధనలతో పాటు ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని పొందే లక్ష్యంతో బేస్ ప్రైస్‌ను గోప్యంగా ఉంచాం. ఓఆర్ఆర్పై వస్తున్న సుమారు రూ.541 కోట్ల ఆదాయాన్ని రెవెన్యూ మ ల్టిపుల్ ఫార్ములా (ఆర్‌ఎంఎఫ్) ప్రకారం లీజు మొత్తంతో హెచ్చించగా 30 ఏళ్లలో అది రూ.1.30 లక్షల కోట్లకు సమానమవుతుందన్నారు. ఔటర్ బిడ్డింగ్‌లో ఆర్‌ఎంఎఫ్ 13.64 వరకు వచ్చింది. టీఓటీ విధానంలో ఇది ఉత్తమ ఆర్‌ఎంఎఫ్. ప్రస్తుతం ఔటర్‌పై ప్రతి రోజు సగటున 1.6 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, రూ.1.48 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. -
స్టార్టప్‌లపై అవగాహన పెరగాలి
పనాజీ: దేశీయంగా అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి మరింత అవగాహన పెరగాల్సి ఉందని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో స్టార్టప్‌ల వైఫల్య రేటు క్రమంగా తగ్గుతోందని ఆయన చెప్పారు. ‘నేను అనేక ఇంజినీరింగ్ కాలేజీలను సందర్శిస్తుంటాను. వారికి స్టార్టప్‌లు, ఎస్టీపీఐ గురించి .. అంకుర సంస్థల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోంది అన్న విషయాలేవీ తెలియవు‘ అని అరవింద్ కుమార్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఎస్టీపీఐ డైరెక్టర్లు వివిధ కాలేజీలను సందర్శిస్తూ అంకుర సంస్థలు, వాటికి నిధుల సమీకరణ తదితర అంశాల గురించి యువతకు వివరిస్తున్నారని తెలిపారు. దీంతో నెమ్మదిగా అవగాహన పెరుగుతోందని, అయితే దీన్ని మరింత వేగవంతం చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఉత్పాదనలకు సంబంధించిన వివిధ దశల గురించి విద్యార్థులు నేర్చుకునేందుకు 12వ తరగతిలోనే ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ఒక పాఠ్యాంశంగా చేర్చాలని, వారు ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలు కల్పించే వారిగా ఎదిగేలా తోడ్పాటు అందించాలని అరవింద్ కుమార్ అభిప్రాయపడ్డారు. వైఫల్యమనేది అంతర్జాతీయంగా కూడా స్టార్టప్ వ్యవస్థలో అంతర్గత భాగమేనని, మనం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాం కాబట్టి మిగతా దేశాలతో పోలిస్తే వైఫల్యాలు కాస్త ఎక్కువ స్థాయిలోనే అనిపించవచ్చని ఆయన చెప్పారు. కానీ, భారత్‌లో విఫలమవుతున్న అంకుర సంస్థల సంఖ్య తగ్గుతోందని, పదింటిలో ఒకటిగా ఉంటున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయని ఆయన వివరించారు. -
‘రెరా’ చైర్‌పర్సన్‌గా సీఎస్ శాంతికుమారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేశ్‌కుమార్ కూడా రెరా చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఆయన్ను జనవరి 12న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయింపు సబబేనని, అక్కడకు వెళ్లిపోవాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. రెరా చైర్మన్ పదవి ఖాళీ అయింది. రెరా చైర్మన్‌తోపాటు సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీచేసింది. చైర్మన్, సభ్యుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 3 (శుక్రవారం)తో గడువు ముగిసింది. ఇప్పటికే పలువురు మాజీ సీఎస్‌లు, రిటైర్డ్ ఐఏఎస్‌లు, టౌన్‌ప్లానింగ్‌లో విశేష అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి రావడానికి కనీసం నెలరోజులు పడుతుందని భావిస్తున్నారు. కొత్త వారిని నియమించే ప్రక్రియ పూర్తయ్యే వరకు రెరా చైర్‌పర్సన్‌గా సీఎస్ శాంతికుమారిని నియమిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. -
టీఎస్ బీపాస్ ద్వారా ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్
సాక్షి, హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో భూములను కొనుగోలు చేసిన వారికి ఉపయో గపడేలా ల్యాండ్ యూజ్ స్టేటస్‌ను తెలుసుకునే విధానాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ అందుబాటు లోకి తెచ్చింది. భూ కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసిన భూమి మాస్టర్ ప్లాన్‌లోని ఏ కేటగిరీ పరిధిలో ఉందో టీఎస్–బీపాస్ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించింది. ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ (భూమి వినియోగ పత్రం)ను టీఎస్–బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసు కొని, నిర్ణీత ఫీజు చెల్లించి సర్టిఫికెట్ పొందే వీలును మున్సిపల్, పట్టణ పరిపాలన శాఖ కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ లాండ్ యూజ్ సర్టిఫి కెట్ పొందే తీరును ట్విట్టర్ వేదికగా తెలిపారు. తమకు అవస రమైన సేవలు కావాల్సిన వారు https://lui. tsbpass.telangana.gov.inతమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సర్వే నంబర్ నమోదు చేసి, తగిన రుసుము చెల్లిస్తే ఆ భూమికి సంబంధించిన ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ ఇస్తారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ఈ సర్టిఫికెట్ పొందే సేవలు అందుబాటులో ఉన్నాయి. -
టీఎస్ బీపాస్‌తో సత్ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణ అనుమతుల కోసం రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన టీఎస్ బీపాస్ ప్రజల మన్ననలు పొంది, మంచి ఫలితాలు సాధించిందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. టీఎస్ బీపాస్ అమల్లోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. పథకం ప్రవేశపెట్టిన తొలి సంవత్సరంలో నిర్మాణ దరఖాస్తులకు అనుమ తులు 22 శాతం పెరిగాయన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 43,709 దరఖాస్తులకు అనుమతులు లభించినట్లు తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తు దారులకు స్వయం మదింపు విధా నాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. 75 చ.గ. విస్తీర్ణంలో చేపట్టే గృహ నిర్మాణానికి అనుమ తులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అక్కర లేదని, రూపాయి రుసుముతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. 600చ.గ. సంబంధించి సింగిల్ విండో విధానంలో అనుమ తులు లభిస్తాయని వివరించారు. ఈ సందర్భంగా పలువురికి అవార్డులు అందజేశారు. -
ప్రణాళికాబద్ధంగా పచ్చదనం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రణాళికాబద్ధంగా పచ్చదనం పెంచుతున్నామని, భవన నిర్మాణాలకు అనుమతుల సమయంలోనే 25 శాతం గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ తెలిపారు. లేఅవుట్లకు అనుమతిచ్చిన తర్వాత నిర్ణీత స్థలంలో గ్రీన్‌జోన్‌ను అభివృద్ధి చేసిన తరువాతే తుది అనుమతులను ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చరల్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో గ్రీన్ సిటీపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏఐపీహెచ్ గ్రీన్ సిటీ కమిటీ ప్రతినిధి బిల్ హార్డీ అధ్యక్షతన ఆన్లైన్లో జరిగిన ఈ సమావేశంలో... హైదరాబాద్ నగరానికి ప్రతిష్టాత్మక గ్రీన్‌సిటీ అవార్డు లభించడం వెనుక ఉన్న కృషిని అరవింద్ వివరించారు. హైదరాబాద్ నగరంలో 150 చెరువులను సుందరీకరణ చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టూ 16 అటవీ ప్రాంతాల్లో అర్బన్ఫారెస్టు పార్కులు అభివృద్ధి చేసి పట్టణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. మహానగరం చుట్టూ 158 కి.మీ. మేర ఉన్న ఔటర్ రింగు రోడ్డులో పచ్చదనం పెంపొందించి గ్రీన్ జోన్‌గా మార్చామని తెలిపారు. ఫార్ములా ఈ ట్రాక్ నిర్మాణంలో కోల్పోతున్న చెట్లను పూర్తిగా మరో చోటుకు తరలించి ట్రాన్స్‌లొకేట్ చేస్తున్నట్లు అరవింద్‌కుమార్ వివరించారు. ప్రతియేటా ‘హరితహారం’ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోట్లాది మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తూ పచ్చదనాన్ని అభివృద్ధి చేసిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
సిటీలో ఇండియన్ ఫొటో ఫెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది అత్యుత్తమ ఫొటోగ్రాఫర్‌ను ఎంపిక చేయడానికి హైదరాబాద్ వేదిక కానుంది. ఇండియన్ ఫొటో ఫెస్టివల్, హెచ్ఎండీఏ, క్రెడాయ్ సంయుక్తంగా తొలిసారి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. దీనికోసం 85 దేశాల నుంచి ఫోటోగ్రాఫర్లు తమ అత్యుత్తమ ఫోటోలను ఎంట్రీలుగా పంపించారని ఇండియన్ ఫోటో ఫెస్టివల్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ అక్విన్ మాథ్యూస్ తెలిపారు. ఫొటో జర్నలిజం, డాక్యు మెంటరీ, ట్రావెల్ అండ్ నేచర్, వైల్డ్‌లైఫ్, స్ట్రీట్, పోట్రెయిట్, వెడ్డింగ్, మొబైల్స్... మొత్తం 8 కేటగి రీల్లో ఎంపికైన అత్యుత్తమ ఫోటోలకు మొత్తం రూ.25లక్షల పారితోషికాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఈ ఫొటో ఉత్సవానికి వచ్చిన ఎంట్రీల ను పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడు తూ.. వివిధ దేశాల నుంచి వచ్చిన అత్యుత్తమ ఫోటోలను ఈనెల 19 నుంచి వచ్చేనెల 19వరకు మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం రోజున ‘ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును బహూకరిస్తామన్నారు. ఈ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణారావు మాట్లాడారు. -
Hyderabad: భారీ వర్షాల ఎఫెక్ట్.. 34 ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 14 నుంచి 17 వరకు 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రధానంగా లింగంపల్లి–హైదరాబాద్, హైదరాబాద్– లింగంపల్లి, ఫలక్‌నుమా– లింగంపల్లి, లింగంపల్లి–ఫలక్‌నుమా, సికింద్రాబాద్– లింగంపల్లి, లింగంపల్లి– సికింద్రాబాద్ మార్గాల్లో రాకపోకలు సాగించే రైళ్లు రద్దు చేసిన జాబితాలో ఉన్నాయి. మరో మూడు రోజులు వర్షసూచన మరో మూడు రోజులపాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం ఉదయం, సాయంత్రం వేళల్లో కురిసిన వర్షంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. సాయంత్రం 6 గంటల వరకు అత్యధికంగా శేరిలింగంపల్లి, మాదాపూర్‌లలో ఒక సెంటీమీటరు మేర వర్షపాతం నమోదైంది. అభివృద్ధి పనులను పరిశీలించిన అర్వింద్‌కుమార్ గండిపేట్ వద్ద హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ఆంఫీ థియేటర్, రెస్టారెంట్, పలు అభివృద్ధి పనులను బుధవారం మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ పరిశీలించారు. పనులపై సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రకృతి రమణీయత అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో సిటీజన్లకు చక్కటి ఆహ్లాదాన్ని పంచేందుకు ఈ పనులు చేపట్టినట్లు ఆయన ట్వీట్ చేశారు. (క్లిక్: హైదరాబాద్‌లో ఒకేసారి 69 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ) -
చార్మినార్ వద్ద మల్టీలెవల్ కారు పార్కింగ్
సాక్షి, హైదరాబాద్: చార్మినార్ వద్ద త్వరలో మల్టీలెవల్ కారు పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ ట్విట్టర్లో తెలిపారు. ఈ ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఓ స్థలంలో ఘన వ్యర్థాలను పడవేస్తుండడంతో దుర్గంధం వ్యాపిస్తోందని పేర్కొంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయడంతో ఆయన ఈ జవాబిచ్చారు. ఈ పనులు చేపట్టేందుకు డిజైన్లు రూపొందించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని, త్వరలో టెండర్లు ఖరారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తమ ప్రతినిధుల బృందం ఇటీవల కోయంబత్తూర్ని సందర్శించి మల్టీ లెవల్ కారు పార్క్ విధానాన్ని అధ్యయనం చేసిందని వెల్లడించారు. (క్లిక్: బీజేపీ, టీఆర్ఎస్ ప్రచార పోరు.. బల్దియాకు 30 లక్షల రాబడి) -
ఉచిత తాగునీటి పథకానికి తాజా మార్గదర్శకాలివే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి సరఫరా పథకం అమలుపై మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ తాజాగా గురువారం మరిన్ని మార్గదర్శకాలు జారీచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మురికి వాడలు, అన్ని గృహవినియోగ నల్లాలకు డిసెంబరు 2020 నుంచి డిసెంబరు 2021 వరకు నీటిబిల్లులు మాఫీ చేయనున్నారు. ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పెండింగ్‌లో ఉన్న వినియోగదారులు, రెండో నల్లా కనెక్షన్ కలిగిన వినియోగదారులకు కూడా మాఫీ వర్తించనుంది. జనవరి 2022 నుంచి మురికి వాడలు మినహా ఇతర ప్రాంతాల వినియోగదారులకు నీటివినియోగం ఆధారంగా నీటిమీటరు రీడింగ్‌తో బిల్లులు జారీ చేయనున్నారు. ఇప్పటికే వాటర్సెస్ చెల్లించిన వినియోగదారులకు భవిష్యత్‌లో వారి కనెక్షన్‌కు జారీచేసే బిల్లులో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయనున్నారు. ఆధార్ అనుసంధానం చేసుకోని వినియోగదారులకు 13 నెలల నీటిబిల్లు జారీ చేయనున్నారు. దీనిపై ఎలాంటి వడ్డీ, అపరాధ రుసుం ఉండదు. (చదవండి: ప్లాట్.. పాస్‘బుక్కయ్యి’.. ధరణి రూటు మారుస్తున్న రియల్టర్లు) -
చార్మినార్ చెంతా ‘సండే– ఫన్డే’ సందడి
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి మణిహారంలా నిలిచిన చార్మినార్‌ను సిటిజన్లకు మరింత చేరువ చేసేందుకు మున్సిపల్ పరిపాలన శాఖ చర్యలు చేపట్టింది. ప్రతీ ఆదివారం ‘సండే– ఫన్డే’లో భాగంగా ట్యాంక్‌బండ్‌పై కుటుంబ సమేతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో విహారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన తరహాలోనే.. చార్మినార్ పరిసరాలు కూడా సిద్ధమవుతున్నాయి. వాహనాల రణగొణ ధ్వనులు లేని వాతావరణంలో పాదచారులు చార్మినార్ చుట్టూ తిరుగుతూ.. చారిత్రక నిర్మాణాన్ని అమూలాగ్రం పరిశీలించే ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, నగర కొత్వాల్ అంజనీకుమార్‌లతో కలిసి మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. చారిత్రక కట్టడాలపై భవిష్యత్ తరాలకు కళ్లకు కట్టినట్లు వివరించాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన తెలిపారు. ‘ఏక్ షామ్.. చార్మినార్‌కే నామ్’ పేరుతో ఈనెల 17న సాయంత్రం 5 గంటల నుంచి ‘సండే– ఫన్డే’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ట్విటర్ ద్వారా అర్వింద్‌కుమార్ వెల్లడించారు. సందర్శకుల కోసం లాడ్ బజార్ అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుందన్నారు. పోలీసు బ్యాండ్ మ్యూజిక్, ముషాయిరాలతో పాటు పిల్లల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మొక్కల ఉచిత పంపిణీ కూడా ఉంటుందని చెప్పారు. చదవండి: 18 నుంచి హైదరాబాద్ మెట్రో సువర్ణ ఆఫర్ -
సినిమా థియేటర్లలో ఇక పార్కింగ్ ఫీజు
సాక్షి, హైదరాబాద్: సినిమా థియేటర్లలో వాహనాల పార్కింగ్ ఫీజులను వసూలు చేసేందుకు అనుమతిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీప్లెక్స్‌లతోపాటు కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మాల్స్‌లలో ఎలాంటి పార్కింగ్ ఫీజులు వసూలు చేయరాదని గతంలో జారీ చేసిన ఉత్తర్వులు యథాతథంగా అమలవుతాయని స్పష్టం చేశారు. కేవలం సినిమా థియేటర్ మాత్రమే ఉంటే (స్టాండ్ ఎలోన్) పార్కింగ్ ఫీజులను వసూలు చేసుకోవచ్చని అన్నారు. సినిమా థియేటర్లలోని పార్కింగ్ ఏరియాల్లో ప్రేక్షకులు కాని వారు సైతం పెద్ద సంఖ్యలో వాహనాలు నిలుపుతుండటంతో నిర్వహణ కష్టంగా మారిందని థియేటర్ల యజమానుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని, ఈ నేపథ్యంలో ఫీజులు వసూలు చేసుకోవడానికి అను మతిచ్చినట్టు తెలిపారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్నారు. -
Hyderabad: ఆపదలో.. సంప్రదించండి
సాక్షి, హైదరాబాద్: విపత్కర పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ నిస్వార్థ సేవ చేయడంలో ఎన్జీవోలది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లోనూ మేమున్నామంటూ అనేక విధాలుగా ఆపన్న హస్తాన్ని అందిస్తున్నాయి. ఇందులో కొందరు సంస్థలుగా, ఇంకొందరు వ్యక్తిగతంగా, మరికొందరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆపదలో అండగా నిలుస్తున్నారు. ఇలా అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించే కొన్ని సంస్థల, వ్యక్తుల వివరాలను తెలంగాణ రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. 1. ఆక్సిజన్ సిలిండర్స్, అంబులెన్స్ సేవలు సకిన ఫౌండేషన్... 8008008012 ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్స్ అందిస్తున్నాయి సహారా అంబులెన్స్ సేవలు... 7569600800 కొన్ని ఎన్జీవోల కలయికతో అంబులెన్స్‌లను అందిస్తున్నాయి, రోగులను ఇతర ప్రాంతాలకు చేరవేయడానికి వాహనాలను కూడా సమకూర్చుతున్నాయి. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్.. 8790679505 ఆక్సిజన్ సిలిండర్స్, మరికొన్ని కోవిడ్ సేవలు సఫా బైతుల్ మాల్ అండ్ యాక్సెస్ ఫౌండేషన్... 7306600600 ూ మెడిసిన్స్, కోవిడ్ కిట్స్, ఆక్సిజన్. ఫీడ్ ది నీడి... 7995404040 అంత్యక్రియలు.. (ఉ.8 గం నుంచి సా.6 గం వరకు) జైన్ రిలీఫ్ ఫౌండేషన్... 9849159292 కోవిడ్ రోగులకోసం హోటల్స్‌లో ప్రత్యేకంగా ఆక్సిజన్, వెంటిలేటర్లు తదితర వైద్య సేవలతో ఐసోలేషన్ సెంటర్ల ఏర్పాటు. (ఒక రోజుకి కనీస చార్జీ రూ.3 వేల నుంచి) 2. ప్లాస్మా సేవలు https://donateplasma.scsc.in/ సైబరాబాద్ పోలీస్ శాఖ, ఎస్సీఎస్సీ సంయుక్తంగా స్వచ్ కర్మ ఫౌండేషన్.. 7407112233 కోవిడ్ యోధుల నుంచి ప్లాస్మా డొనేషన్ ఎన్టీఆర్ ఛారిటబుల్ సర్వీసెస్... 8555036885, 9000166005 ఉచిత ఆన్లైన్ కన్సల్టేషన్. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ గ్రూప్... bit.ly/covid-hyd ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్స్, ఫుడ్, ప్లాస్మా డోనర్స్ హైదరాబాద్ కోవిడ్ హెల్ప్... @hyderabadcovid కోవిడ్ సేవలు covidastra.com కోవిడ్ సేవల సమాచారం 3. ఫుడ్ డెలివరీ, ఇతర సేవలు... సేవ ఆహార్... 7799616163 లంచ్ (ఉ.7 గంటలలోపే ఆర్డర్ పెట్టాలి) తెలుగు ఇంటి భోజనం... 9100854558 కరోనా పేషెంట్‌కి ఫుడ్ డెలివరీ సేవలు (కేపీహెచ్‌బీ, మియాపూర్, చందానగర్, మదీనాగూడ, బాచుపల్లి, కొండాపూర్) నిహారికా రెడ్డి 9701821089 కోవిడ్ బాధితులకు ఆహార పంపిణీ సేవలు (యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్) 7 క్లౌడ్ కిచెన్..8978619766 కరోనా పేషెంట్‌కి ఫుడ్ డెలివరీ సేవలు జాహ్నవి ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్... 6300975328 కోవిడ్ బాధితులకు ఆహార సరఫరా సేవలు (బోయిన్పల్లి, మారేడ్‌పల్లి, బేగంపేట్, పంజాగుట్ట, సైనిక్‌పురి, తిరుమలగిరి) 4.పెంపుడు జంతువుల సంరక్షణ సేవలు పీపుల్ ఫర్ ఎనిమల్స్... 7337350643 బ్లూ క్రాస్ హైదరాబాద్... 040–23545523 5.తెలంగాణ కోవిడ్ కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్... 9490617440 చైల్డ్ కేర్... 080–45811215 ఫ్రీ కోవిడ్ టెలీ మెడిసిన్ 080–45811138 అత్యవసర వైద్య సేవలు 9490617431 ప్లాస్మా దాతలు, స్వీకరణ 9490617440 అంత్యక్రియల సేవలు... 7995404040 జీహెచ్ఎంసీ కోవిడ్ హెల్ప్‌లైన్.. 040–21111111 List of #NGOs & good samaritans & their are of work & contact # Slide 1 & 2 - dealing with Covid patients / home service Slide 3- supplying food at home etc Slide 4 - pet care & @GHMCOnline emergency contact # Will keep adding ..@KTRTRS pic.twitter.com/Ol7g5rm8HV — Arvind Kumar (@arvindkumar_ias) May 11, 2021 -
ఫేస్బుక్లో నకిలీ ఖాతా, గుడ్‌బై చెప్పిన ఐఏఎస్!
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం నకిలీ ఫేస్బుక్ ఖాతాను తెరిచారు. అంతేకాకుండా ఆయన అసలు ఫేస్బుక్ ఖాతాలోని చాలా మంది మిత్రులకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపారు. తన ఒరిజినల్ ఫేస్బుక్ ఖాతాలో వివిధ సందర్భాల్లో పోస్టు చేసిన వ్యక్తిగత ఫొటోలను నకిలీ ఖాతా తెరవడానికి ఆగంతకులు వాడుకున్నారు. ఇవి చూసిన ఆయన స్నేహితులు నిజంగానే అరవింద్‌కుమార్ రెండో ఖాతా తెరిచారని భావించి ఫ్రెండ్ రిక్వెస్టును యాక్సెప్టు చేశారు. ఇలా యాక్సెప్ట్ చేసిన కొందరితో ఆగంతకులు ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా అరవింద్‌కుమార్ పేరుతో సందేశాలు పంపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అరవింద్‌కుమార్ వెంటనే ఫేస్‌బుక్‌కు రిపోర్టు చేయడంతో పాటు తన మిత్రులను అప్రమత్తం చేస్తూ శుక్రవారం తన ఒరిజినల్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఫేస్బుక్ ఏ మాత్రం సురక్షితం కాదని, సరైన రీతిలో కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియ చేపట్టకుండానే ఎవరినైనా కొత్త ఖాతాలు తెరిచేందుకు ఫేస్బుక్ యంత్రాంగం అనుమతిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాను ఫేస్బుక్ నుంచి శాశ్వతంగా వైదొలగిపోవడమే అత్యుత్తమం అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఫేస్బుక్లో అరవింద్‌కుమార్ ఓ పోస్టు ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చూసిన ఆగంతకులు నకిలీ ఖాతాను డీయాక్టివేట్ చేశారు. (చదవండి: ఫేస్‘బుక్’ నకిలీ ఖాతాలతో జర జాగ్రత్త!) -
వాయిదాల్లో చెల్లించొచ్చు
సాక్షి, హైదరాబాద్ : భవన నిర్మాణ అనుమతుల ఫీజులు, చార్జీల చెల్లింపులో ప్రభుత్వం రాష్ట్రమంతటికీ వెసులుబాటు కల్పించింది. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఈ ఫీజులను 4 సమ వాయిదాల్లో (6 నెలలకు ఒకటి... మొత్తం రెండేళ్ల వ్యవధి ఇస్తారు) చెల్లించడానికి వీలు కల్పిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. స్థిరాస్తి రం గాన్ని ప్రోత్సహించడానికి బిల్డింగ్ పర్మిట్ ఫీజు, బెటర్మెంట్, డెవలప్మెంట్, క్యాపిటలైజేషన్ చార్జీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హెచ్ఎండీఏల పరిధిలో వాయిదాల్లో చెల్లించడానికి అనుమతిస్తూ ఈ ఏడాది జులై 8న రాష్ట్ర ప్రభుత్వం జీవో 108ను జారీచేసింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని పురపాలికలకు దీన్ని వర్తింపజేస్తూ అరవింద్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. ♦ అన్ని రకాల చార్జీలను నాలుగు సమ అర్ధ వార్షిక వాయిదాల్లో చెల్లించవచ్చు. ♦ ఫీజు ఇంటిమేషన్ లేఖ అందిన 30 రోజుల్లోగా తొలి వాయిదా చెల్లించాలి. ♦ ఎవరైనా బిల్డర్, డెవలపర్ బిల్డింగ్/ లే అవుట్ అనుమతుల సమయంలోనే మొత్తం ఫీజులు, చార్జీలు చెల్లించేందుకు ముందుకు వస్తే ఎర్లీబర్డ్ పథకం కింద మొత్తం ఫీజుల్లో 5 శాతం రాయితీ లభిస్తుంది. ♦ పోస్ట్‌డేటెడ్ చెక్కుల్లో పేర్కొన్న తేదీల్లోగా వాయిదాలను చెల్లించడంలో విఫలమైతే జాప్యం జరిగిన కాలానికి 12% వడ్డీతో కలిపి చెల్లించాలి. ♦ 2021 మార్చి 31 లోగా వచ్చే కొత్త దరఖాస్తులతో పాటు అన్ని పెండింగ్ దరఖాస్తులకు ఈ వెసులుబాటు వర్తించనుంది. -
వారసత్వ నిర్మాణాల పునరుద్ధరణకు చర్యలు
రాంగోపాల్‌పేట్: హైదరాబాద్‌లోని వారసత్వ నిర్మాణాల పునరుద్ధరణకు తగిన మాస్టర్ ప్లాన్ అవసరమని, దీనికి గానూ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ వెల్లడించారు. సోమవారం బేగంపేట్‌లోని మెట్రో భవన్లో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణను అర్థం చేసుకోవడం అనే అంశంపై మున్సిపల్ పరిపాలన శాఖ సహకారంతో యునెస్కో, ఆగా ఖాన్ ట్రస్టు ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఇది రెండు రోజులపాటు కొనసాగనుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన అర్వింద్ మాట్లాడుతూ.. వారసత్వ నిర్మాణాల పరిరక్షణ, పునరుద్ధరణకు ప్రణాళికాబద్ధమైన విధానం అవసరమన్నారు. హైదరాబాద్‌లో 26 హెరిటేజ్ నిర్మాణాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. చార్మినార్,లాడ్‌బజార్, మక్కా మసీద్, సర్దార్ మహల్, చౌమహుల్లా ప్యాలస్ తదితర ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక ‘టూరిస్ట్ వాక్ వే’ను రూపొందించే యోచన ఉందన్నారు. సృజనాత్మకత, పచ్చటి నగరాల నిర్మాణం తదితర అంశాలపై ఢిల్లీలోని యునెస్కోకు చెం దిన సాంస్కృతిక విభాగం ప్రతిని«ధి జునీహాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. ఈ కార్యక్రమంలో ఆగాఖాన్ ట్రస్టుకు చెందిన ప్రశాంత్ బెనర్జీ, పరిరక్షణ ఆర్కిటెక్ట్ పరోమిత దేసార్కర్ తదితరులు పాల్గొన్నారు. -
విజయ్ దేవరకొండకు మరో చాలెంజ్
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు విజయ్ దేవరకొండకు తెలంగాణ రాష్ట్ర పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ గ్రీన్ చాలెంజ్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించిన అరవింద్‌కుమార్ సోమవారం పీవీ ఘాట్ సమీపంలో మొక్కలు నాటారు. అనంతరం విజయ్ తోపాటు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కుడా ఉద్యోగులను ఆ చాలెంజ్‌కు నామినేట్ చేశారు. కాగా, గతంలోనూ తనను గ్రీన్ చాలెంజ్‌కు నామినేట్ చేయడంతో విజయ్ దేవరకొండ మొక్క నాటారు. హరితహారంలో భాగంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ నిరుడు విజయ్ను గ్రీన్ చాలెంజ్‌కు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. యురేనియం తవ్వకాల నుంచి నల్లమల అడవులను కాపాడాలంటూ ఇటీవల విజయ్ ట్విటర్ వేదికగా గళం విప్పారు. విజయ్ దేవరకొండ నిర్మించిన తొలి చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’ ఈ నెల 1న విడుదలైంది. ఆయన ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్, పూరి జగన్నాథ్ సినిమాల్లో నటిస్తున్నారు.