సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి కథ రోజుకో మలుపు తిరుగుతోంది. మరికొన్ని కీలక పాత్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ‘అంతా ఆ అధికారి చెబితేనే చేశాను’అంటూ ఏసీబీ అధికారుల వద్ద శివబాలకృష్ణ చెప్పినట్టు సమాచారం. నాటి పురపాలక, పట్టణాభివృధ్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఈ మొత్తం అవినీతి వ్యవహారం వెనుక కీలక వ్యక్తి అని ఏసీబీకి ఇచ్చి న కన్‌ఫెషన్ రిపోర్ట్ (వాగ్మూలం)లో శివబాలకృష్ణ పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
‘నేను ఇంత పెద్ద మొత్తంలో అవినీతి సొమ్ము కూడ బెట్టడంలో పై అధికారి అరవింద్‌కుమార్ పూర్తి సహకారం ఉంది. నా నుంచి ఎన్నో పనులు చేయించుకుని ఆయన కూడా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించారు..’అంటూ ఆరోపణలు చేసినట్టు తెలిసింది. కోర్టుకు సమర్పించిన ఈ కన్‌ఫెషన్ రిపోర్టులో ఏసీబీ అధికారులు.. అరవింద్‌కుమార్ పాత్రకు సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావించినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు కన్‌ఫెషన్ రిపోర్టులోని ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
కోటి రూపాయలు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చా
ఉదయ ఎస్‌ఎస్‌వీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌ను నార్సింగిలోని 12 ఎకరాల స్థలంలో చేపట్టారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణంతో కూడిన ఈ ప్రాజెక్టు చాలా కాలంగా అనేక చట్టపరమైన సమస్యల కారణంగా పెండింగ్‌లో ఉంది. హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ 2023 నవంబర్, డిసెంబర్‌లలో హెచ్‌ఎండీఏ సెక్రటరీ చంద్రయ్యతో కలిసి సమస్యను పరిష్కరించారు. వివాదాన్ని క్లియర్ చేసి ప్రణాళికను విడుదల చేశారు. ఇందుకోసం అరవింద్ కుమార్ ఆ సంస్థ యాజమాన్యం నుంచి రూ.10 కోట్ల లంచం డిమాండ్ చేశారు. అందులో భాగంగా 2023 డిసెంబర్‌లో రూ.1 కోటి నగదు ఉదయ ఎస్‌ఎస్‌వీ ప్రాజెక్టు ప్రతినిధి షేక్ సైదా నాకు ఇచ్చారు. మరుసటి రోజు ఉదయం ఆ డబ్బును నేను జూబ్లీహిల్స్ అంబేడ్కర్ వర్సిటీ సమీపంలోని అరవింద్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయనకు అందజేశా.
భూమార్పిడి చేసినందుకు రూ.కోటి
ఆరు నుంచి ఏడు నెలల క్రితం క్యూ–మార్ట్ రాహుల్ అనే ఒక వ్యక్తి నాకు రెరా కార్యాలయంలో రూ.ఒక కోటి ఇచ్చారు. ఆ డబ్బును అదే రోజు నేను అరవింద్‌కుమార్ నివాసంలో అందజేశా. బాచుపల్లిలోని రెండు ఎకరాలలోపు భూమిని మార్పిడి చేసినందుకు అరవింద్‌కుమార్ రూ.కోటి లంచం డిమాండ్ చేసినట్టుగా ఆ వ్యక్తి నాతో చెప్పాడు. వివిధ పనుల గురించి అరవింద్‌కుమార్ తరఫున నా నుంచి కొందరు వ్యక్తులు డబ్బులు వసూలు చేసేవారు. మైహోం బూజాలో ఉండే రంగా భాయ్, మీనా జ్యూవెలర్స్ ఎండీ , కేశినేని ప్రాజెక్ట్స్ రవి రమేశ్, ఎల్బీనగర్‌లో ఉండే సుధాకర్ ఇతరులు వీరిలో ఉన్నారు.
ఈస్ట్ మారేడ్‌పల్లి, కోకాపేట్ ప్రాజెక్టుల్లో కూడా..
ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు విషయంలో జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతుల విషయంలో మీనాక్షి కంపెనీకి అరవింద్‌కుమార్ చేసిన సాయానికి బదులుగా ఆయన డిమాండ్ చేసిన మేరకు రూ.50 లక్షలు సదరు కంపెనీ లైజనింగ్ అధికారి నాగబాబు మా ఇంటికి వచ్చి ఇచ్చాడు. ఆ సొమ్మును అదే రోజు అరవింద్‌కుమార్ ఇంటికి వెళ్లి ఆయనకు ఇచ్చా. కోకాపేట్ హై రైజ్ బిల్డింగ్ ప్రాజెక్టులో ప్రెస్టీజ్ గ్రూప్‌కు అరవింద్ కుమార్ సహాయం చేశారు. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ జనరల్ మేనేజర్ సురేష్ 2022 చివరిలో అరవింద్ కుమార్ కోసం రూ.40 లక్షల లంచం నాకు ఇచ్చారు. అ డబ్బును కూడా నేను అరవింద్ కుమార్‌కు ఆయన నివాసంలోనే అందజేశా. ఇక కోకాపేట్ మల్టిస్టోర్డ్ హై రైజ్ బిల్డింగ్‌లోని సాలార్ పురియ సత్తవ ప్రాజెక్ట్‌కు సాయం చేసినందుకు అమిత్ సలార్ పురియా డిసెంబర్ 2022లో అరవింద్ కుమార్ కోసం రూ.35 లక్షలు లంచం తీసుకు వచ్చారు. అ డబ్బును అరవింద్ కుమార్‌కు ఇచ్చా.
నాకూ కొన్ని ప్లాట్లు బహుమతిగా అందాయి
సాయి సందీప్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ , ప్రైమ్ ల్యాండ్ ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్‌కు చెందిన కె.సందీప్‌రెడ్డి కంది మండలంలో, ఇతర ప్రాంతాల్లో చేసిన వెంచర్స్‌లో కొన్ని ప్లాట్లు నాకు బహుమతిగా ఇచ్చారు. నాకు గుర్తున్నంత వరకు నాకు గిఫ్ట్‌గా వచ్చి న ప్లాట్లను మా మేనల్లుడు భరణి పేరిట రిజిస్టర్ చేయించాను. నా పై అధికారి అరవింద్‌కుమార్ సైతం తన డ్రైవర్లు, గన్‌మెన్లు, ఇతరుల పేరుమీద ప్లాట్లు రిజిస్టర్ చేయించేవారు. ఆయన వాట్సాప్ ద్వారా నాకు వివరాలు పంపేవారు. ఎవరి పేరుమీద ప్లాట్లు రిజిస్టర్ చేయాలన్నది నాకు సూచించేవారు.
ఈ వివరాలు నేను డెవలపర్లకు పంపేవాడిని, నాకు గుర్తు ఉన్నంత వరకు కంది మండలం, ఇతర ప్రాంతాల్లోని సాయి సందీప్ డెవలపర్స్, ఇన్‌ప్రా, ప్రైమ్‌ల్యాండ్ ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ వెంచర్స్‌లో ప్లాట్లను 2022 ఆగస్టు, డిసెంబర్‌లో రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ ఫీజు సైతం ఆ కంపెనీలే చెల్లించేవి. వెర్టెక్స్ హోం కంపెనీ రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని మంఖాల్ గ్రామంలో చేసిన వెంచర్‌కు గాను అరవింద్‌కుమార్.. 550 చదరపు గజాల ఓపెన్ ప్లాట్‌ను ఎలాంటి క్రయ విక్రయాలు లేకుండా గిఫ్ట్‌గా పొందారు.
అరవింద్ కుమార్ విచారణకు ఏసీబీ సమాయత్తం?
శివ బాలకృష్ణ ఇచ్చి న వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుత ప్రకృతి విపత్తుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను ప్రశ్నించడానికి ఏసీబీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అఖిల భారత సర్వీసు అధికారి కావడం వల్ల ఈ విషయమై డీవోపీటికి కూడా సమాచారం అందించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment