సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు లీజు అంతా పారదర్శకమని, కేంద్రం ఆమోదంతో జాతీయ రహదారుల సంస్థ గుర్తించిన టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (టీఓటీ) విధానాన్ని పాటించినట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. 30 ఏళ్ల లీజుపై తాము నిర్ణయించిన బేస్‌ప్రైస్ కంటే ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ రూ.7380 కోట్లతో ఎక్కువ మొత్తంలో బిడ్ చేసినట్లు వెల్లడించారు.
పోటీలో ఉన్న నాలుగు సంస్థల్లో ఇదే ఎక్కువ మొత్తమని చెప్పారు. బేస్‌ప్రైస్ విషయంలో సాంకేతికంగానే గోప్యత పాటించినట్లు పేర్కొన్నారు. ఔటర్ లీజులో భారీ కుంభకోణం జరిగినట్లు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో టెండర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే..
బిడ్డింగ్‌లో లోపాల్లేవ్.. .
♦ జాతీయ రహదారుల సంస్థ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6 బండిల్స్‌లో సుమారు 1600 కిలోమీటర్లను టీఓటీ ప్రాతిపదికన 15 నుంచి 30 ఏళ్ల కాలపరిమితికి లీజుకు ఇచ్చిన పద్ధతినే ఔటర్ విషయంలో అనుసరించాం. రెవెన్యూ మ ల్టిఫుల్ పరంగా దేశంలోని రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ప్రాజెక్టుల కోసం ఖరారు చేసిన వాటిలో ఔటర్ లీజు అత్యుత్తమ బిడ్.
♦ హైదరాబాద్ మహానగరం చుట్టూ 8 లేన్లతో చేపట్టిన ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం 2006లో ప్రారంభమైంది. 2012 నాటికి 79.45 కిలోమీటర్లు, 2018 నాటికి 158 కి.మీ పూర్తి చేశారు. 2012 నుంచే ఔటర్‌పై టోల్ వసూలు మొదలైంది. ఆ ఏడాది రూ.11.11 కోట్లు ఆదాయం లభించగా 2018 నాటికి రూ.340 కోట్లు, 2022 నాటికి రూ.542 కోట్ల చొప్పున ఆదాయం లభించింది. జాతీయ రహదారుల సంస్థ 2008లో విధించిన నిబంధనల మేరకు టోల్ రుసుము నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టోల్ రుసుముపై అదే విధానాన్ని అనుసరిస్తున్నాం.
♦ కేంద్ర క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదించిన టీఓటీ ప్రకారం ఔటర్ రింగ్‌రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు గతేడాది ఆగస్టు 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతేడాది నవంబర్ 9న అంతర్జాతీయ సంస్థల నుంచి హెచ్‌ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 11 బిడ్డర్లు ఆసక్తి ప్రదర్శించారు. బిడ్డింగ్‌లో ఎలాంటి లోపాలకు తావులేకుండా పారదర్శకతను పాటించేందుకు 142 రోజుల వ్యవధి ఇచ్చాం.
పదేళ్లకోసారి సమీక్ష...
♦ ఐఆర్‌బీకి 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చినప్పటికీ ప్రతి పదేళ్లకు ఒకసారి లీజును సమీక్షిస్తారు. రోడ్డు మరమ్మతులు, నిర్వహణ, టోల్ రుసుము, సిబ్బంది జీతభత్యాలు, ఆదాయ,వ్యయాలు, తదితర అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఈ సమీక్షను నిర్వహిస్తారు.
♦ టోల్ పెంపు పైన ఐఆర్‌బీ చేసే ప్రతిపాదనలు జాతీయ రహదారుల సంస్థ నిబంధనలకు లోబడి ఉంటాయి. హెచ్‌ఎండీఏ ఆమోదంతోనే అవి అమలవుతాయి. ఔటర్‌పైన పచ్చదనం నిర్వహణ పూర్తిగా హెచ్‌ఎండీఏ పర్యవేక్షిస్తుంది. ఇందుకయ్యే ఖర్చును ఐఆర్‌బీ చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతం ఔటర్‌పైన ఇంటర్‌చేంజ్‌ల వద్ద ఉన్న ట్రామాకేర్ సెంటర్‌లను ఐఆర్‌బీ నిర్వహించనుంది.
ఐఆర్‌బీ సంస్థకు లీజు ఆమోదపత్రం అందజేశాం. 120 రోజుల్లోపు ఐఆర్‌బీ బిడ్డింగ్ మొత్తాన్ని (రూ.7380కోట్లు) ఏకమొత్తంలో చెల్లించిన అనంతరమే ఔటర్‌ను అప్పగిస్తాం. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న ఈగిల్ ఇన్‌ఫ్రా సంస్థే టోల్ వసూలు చేస్తుంది.
ఎవరెంత బిడ్ వేశారంటే..
♦ మొత్తం ఈ బిడ్డింగ్ ప్రక్రియలో 11 సంస్థల్లో చివరకు నాలుగు మాత్రమే అర్హత సాధించాయి. ‘ప్రస్తుతం టోల్ వసూలు చేస్తున్న ఈగల్ ఇన్‌ఫ్రా సంస్థ 30 ఏళ్ల ఔటర్ లీజుపై రూ.5634 కోట్లు, గవార్ కన్‌స్ట్రక్షన్స్ రూ.6767 కోట్లు, దినేష్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ రూ.7007 కోట్లు చొప్పున బిడ్ వేశాయి. ఐఆర్‌బీ అత్యధికంగా రూ. 7380 కోట్లతో ముందుకు వచ్చింది. తాము నిర్ణయించిన బేస్ ప్రైస్ కంటే ఇది ఎక్కువగా ఉండడంతో ఐఆర్‌బీ హెచ్–1 కింద లీజు పొందింది.
♦ బేస్ ప్రైస్ ముందే నిర్ణయించినప్పటికీ ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనలతో పాటు ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని పొందే లక్ష్యంతో బేస్ ప్రైస్‌ను గోప్యంగా ఉంచాం. ఓఆర్‌ఆర్‌పై వస్తున్న సుమారు రూ.541 కోట్ల ఆదాయాన్ని రెవెన్యూ మ ల్టిపుల్ ఫార్ములా (ఆర్‌ఎంఎఫ్) ప్రకారం లీజు మొత్తంతో హెచ్చించగా 30 ఏళ్లలో అది రూ.1.30 లక్షల కోట్లకు సమానమవుతుందన్నారు. ఔటర్ బిడ్డింగ్‌లో ఆర్‌ఎంఎఫ్ 13.64 వరకు వచ్చింది. టీఓటీ విధానంలో ఇది ఉత్తమ ఆర్‌ఎంఎఫ్. ప్రస్తుతం ఔటర్‌పై ప్రతి రోజు సగటున 1.6 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, రూ.1.48 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment