
గతేడాది తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులపై 23 టోల్‌ప్లాజాలుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 27కు పెరిగింది.
సాక్షి, హైదరాబాద్: గతేడాది తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులపై 23 టోల్‌ప్లాజాలుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 27కు పెరిగింది. మరో నాలుగైదు రాబోతున్నాయి. గతంలో రాష్ట్ర రహదారులుగా ఉన్న రోడ్లను జాతీయ రహదారులుగా మారుస్తుండటంతో వాటిపై కొత్తగా టోల్‌గేట్లు ఏర్పాటవుతున్నాయి. కొత్తగా నగర శివారులోని ఔటర్ రింగు రోడ్డు నుంచి మెదక్ వరకు ఏర్పడ్డ జాతీయ రహదారిపై నర్సాపూర్ చేరువలోని గుమ్మడిదలలో టోల్‌గేట్ ఏర్పాటు చేశారు.
నగర శివారులోని అప్పా జంక్షన్ నుంచి కర్ణాటకలోని బీజాపూర్ వరకు కొత్తగా జాతీయ రహదారిని విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చిట్లంపల్లి వద్ద కొత్తగా టోల్‌ప్లాజా ఏర్పాటైంది. ఇక జడ్చర్ల–కల్వకుర్తి రోడ్డులో మున్ననూరు వద్ద, ములుగు–భూపాలపట్నం 163 జాతీయ రహదారిపై జవహర్‌నగర్ వద్ద మరో టోల్‌ప్లాజా ఏర్పాటైంది. ఈ నాలుగింటి వల్ల కూడా టోల్ వసూళ్లు కొంతమేర పెరిగాయి. ఇక గత ఏడాది కాలంలో వాహనాల సంఖ్య కూడా కొంత పెరగటంతో ఆ మేరకు వసూళ్లు పెరిగాయి.