
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రణాళికాబద్ధంగా పచ్చదనం పెంచుతున్నామని, భవన నిర్మాణాలకు అనుమతుల సమయంలోనే 25 శాతం గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ తెలిపారు. లేఅవుట్లకు అనుమతిచ్చిన తర్వాత నిర్ణీత స్థలంలో గ్రీన్‌జోన్‌ను అభివృద్ధి చేసిన తరువాతే తుది అనుమతులను ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చరల్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో గ్రీన్ సిటీపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఏఐపీహెచ్ గ్రీన్ సిటీ కమిటీ ప్రతినిధి బిల్ హార్డీ అధ్యక్షతన ఆన్‌లైన్‌లో జరిగిన ఈ సమావేశంలో... హైదరాబాద్ నగరానికి ప్రతిష్టాత్మక గ్రీన్‌సిటీ అవార్డు లభించడం వెనుక ఉన్న కృషిని అరవింద్ వివరించారు. హైదరాబాద్ నగరంలో 150 చెరువులను సుందరీకరణ చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టూ 16 అటవీ ప్రాంతాల్లో అర్బన్‌ఫారెస్టు పార్కులు అభివృద్ధి చేసి పట్టణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు.
మహానగరం చుట్టూ 158 కి.మీ. మేర ఉన్న ఔటర్ రింగు రోడ్డులో పచ్చదనం పెంపొందించి గ్రీన్ జోన్‌గా మార్చామని తెలిపారు. ఫార్ములా ఈ ట్రాక్ నిర్మాణంలో కోల్పోతున్న చెట్లను పూర్తిగా మరో చోటుకు తరలించి ట్రాన్స్‌లొకేట్ చేస్తున్నట్లు అరవింద్‌కుమార్ వివరించారు. ప్రతియేటా ‘హరితహారం’ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోట్లాది మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తూ పచ్చదనాన్ని అభివృద్ధి చేసిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment