
తెలంగాణ కొత్త సీఎస్ గా ఎస్పీ సింగ్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎస్పీ సింగ్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ చంద్ర పదవీకాలం శనివారంతో ముగిసింది. ఆయన పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. శనివారం రాత్రి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో ప్రదీప్ చంద్ర స్థానంలో ఎస్పీ సింగ్ ను ఎంపిక చేసింది. బిహార్ కు చెందిన ఎస్పీ సింగ్ పూర్తి పేరు శేఖర్ ప్రతాప్ సింగ్.
కాగా, అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ గా శనివారం పదవీ విరమణ చేసిన ఏకే ఖాన్ ను మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారుగా నియమించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా అరవింద్ కుమార్ ను ఎంపిక చేసింది.