
అరవింద్‌కు కన్నీటి వీడ్కోలు
- సాహెబ్‌నగర్ శ్మశానవాటికలో ముగిసిన అంత్యక్రియలు
- పాల్గొన్న పలువురు ప్రముఖులు
వనస్థలిపురం: హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి గోనూరు అరవింద్‌కుమార్ మృతదేహానికి బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య శుక్రవారం వనస్థలిపురం సాహెబ్‌నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అరవింద్‌కుమార్ బియాస్ నదిలో కొట్టుకుపోయి గల్లంతై గురువారం మృతదేహంగా లభ్యమైన సంగతి తెలిసిందే.
శుక్రవారం న్యూఢిల్లీ నుంచి అరవింద్‌కుమార్ మృతదేహాన్ని విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకువచ్చి అక్కడి నుంచి వనస్థలిపురంలోని నివాసానికి మధ్యాహ్నం 1.30 గంటలకు తీసుకువచ్చారు. అరవింద్‌కుమార్ మృతదేహం వస్తున్న విషయం తెలుసుకుని అప్పటికే బంధువులు, స్నేహితులు, స్థానికులు, నాయకులు వందలాదిగా అక్కడికి చేరుకున్నారు. మృతదేహం రావడంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
అరవింద్‌కుమార్ తల్లిదండ్రులు శశిలత, వినోద్‌కుమార్, తమ్ముళ్లు సంతోష్, అభిషేక్, తాత సంగప్ప, ఇతర కుటుంబసభ్యులు, తోటి స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం 2.30 గంటల సమయంలో అరవింద్‌కుమార్ మృతదేహాన్ని సాహెబ్‌నగర్ శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు.