మాజీ సీఎండీలు ప్రభాకర్‌రావు, రఘుమారెడ్డి, వెంకటనారాయణ, గోపాల్‌రావులకు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు
ఇంధన శాఖ మాజీ కార్యదర్శి అరవింద్ కుమార్, విద్యుత్ సంస్థల ప్రస్తుత, మాజీ డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లకూ జారీ
ఛత్తీస్‌గఢ్ విద్యుత్, యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లపై న్యాయ విచారణ వేగిరం
ప్రజాప్రతినిధులకు సైతం పిలుపు ఉండే అవకాశం
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత, మాజీ అధికారులకు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఆయా అధికారులు, మాజీ అధికారులు పోషించిన పాత్ర ఏమిటనే వివరణ, అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. ఈ ప్లాంట్ల నిర్మాణం, విద్యుత్ కొనుగోలులో భాగస్వాములైన వ్యక్తులు, సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు సోమవారం బహిరంగ ప్రకటన కూడా జారీ చేయనుంది. సంబంధిత వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు రాతపూర్వకంగా అందించడానికి వీలు కల్పించనుంది. అవసరమైతే బహిరంగ విచారణకు రావాలని వారిని పిలిపించే అవకాశమూ ఉంది.
ప్రస్తుత, మాజీ అధికారులందరికీ..
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంతో సంబంధమున్న ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ట్రాన్స్‌కో, జెన్‌కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ జి.రఘుమారెడ్డి, టీఎస్‌ఎన్పీడీసీఎల్ మాజీ సీఎండీలు కె.వెంకటనారాయణ, ఎ.గోపాల్‌రావుతోపాటు ఆయా విద్యుత్ సంస్థల మాజీ, ప్రస్తుత డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారులకు కమిషన్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. వీరితోపాటు నామినేషన్లపై యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను దక్కించుకున్న బీహెచ్‌ఈఎల్ సంస్థ ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులు, ఛత్తీస్‌గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మాజీ, ప్రస్తుత ఉన్నతాధికారులకు సైతం నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి వీరికి నోటీసులు అందనున్నట్టు సమాచారం.
త్వరలో ప్రజాప్రతినిధులకు కూడా..
విద్యుత్ ప్లాంట్లు, కొనుగోళ్లపై న్యాయ విచారణలో భాగంగా తొలిదశలో ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసిన కమిషన్.. ఆ నిర్ణయాల్లో తమ పాత్రపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అవసరమైతే కమిషన్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరుకావాలని పిలిచే అవకాశం ఉందని విద్యుత్ వర్గాలు చెప్తున్నాయి. ఈ వివరణల్లో లభించే సమాచారం ఆధారంగా.. తర్వాతి దశలో పలువురు ప్రజాప్రతినిధులకు నేతలకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం గడువు విధించిన నేపథ్యంలో.. కమిషన్ న్యాయ విచారణ ప్రక్రియను వేగిరం చేయాలని నిర్ణయించింది.
ఈఆర్సీకి అరవింద్ కుమార్ లేఖనే కీలకం..
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని.. ఆ ఒప్పందాన్ని ఆమోదించవద్దని కోరుతూ నాటి రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ 2016 డిసెంబర్‌లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి లేఖ రాశారు. దీనిపై ఆగ్రహించిన అప్పటి సర్కారు.. ఆయనను మరుసటి రోజే ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా బదిలీ చేసింది. తాజాగా ఆయనకు కూడా విచారణ కమిషన్ నోటీసులు జారీ చేయడంతో.. నాటి లేఖ, ఆయన వివరణ కీలకంకానున్నాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment