సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ను ప్రభుత్వం రెవెన్యూ శాఖ పరిధిలోని విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దాన కిశోర్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా స్థానచలనం కల్పించింది. కీలకమైన హెచ్‌ఎండీఏ కమిషనర్, పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ పదవుల అదనపు బాధ్యతల నుంచి సైతం అరవింద్‌కుమార్‌ను తప్పించింది.
ఆ రెండు పోస్టుల అదనపు బాధ్యతలనూ దానకిశోర్‌కే అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో లీజుపై అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) అప్పగింతపై నిర్వహించిన టెండర్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని అప్పట్లో రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
దీనిపై హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా అరవింద్ కుమార్ స్పందిస్తూ రేవంత్‌రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో అరవింద్‌కుమార్‌ను అప్రధానమైన విపత్తుల నిర్వహణ విభాగానికి బదిలీ చేయడం గమనార్హం. గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా వ్యవహరించిన రాహుల్ బొజ్జాను సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది.
ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అదనపు బాధ్యతల్లో ఆయన్ను కొనసాగించింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను తప్పించి ఆమెను స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు బదిలీ చేసింది. ఆమె స్థానంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంను విద్యాశాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ క్రిస్ట్రీనా జెడ్.చొంగ్తును కీలకమైన వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment