
సాక్షి, హైదరాబాద్: లే అవుట్ రెగ్యులేషన్ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) కింద వచ్చిన దరఖాస్తులన్నింటినీ వచ్చే నెల 28వ తేదీలోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు గడువు విధించింది. ఆ తర్వాత మళ్లీ గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్త ర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చేయాలని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, కుడా, డీటీసీపీతోపాటు రాష్ట్రం లోని అన్ని పురపాలక సంస్థల కమిషనర్లను ఆదేశించారు.
దరఖాస్తుల పరిశీలనలో జరుగుతున్న జాప్యం కారణంగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అపరిష్కృతంగా ఉండటంపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. దరఖాస్తుల పరిశీలన, తనిఖీలకు అధికారులు చాలా సమయాన్ని తీసుకుంటుండడం, అసంపూర్తి దరఖాస్తుల పరిష్కారానికి కావాల్సిన సమాచారాన్ని ఒకేసారి కోరకపోవడం, భూ యాజమాన్య హక్కుల నిర్ధారణ కోసం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు నిర్దేశిత గడువును పాటించకపోవడంతో జాప్యం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ ఆదేశాలను అమలు చేయాలని కోరింది.
♦ పెండింగ్ దరఖాస్తుల పరిశీలన, తనిఖీలను వచ్చే 15 రోజుల్లో పూర్తి చేయాలి.
♦ హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ ల్యాండ్ విభాగం అధికారులు తమ వద్దకు దర ఖాస్తులు వచ్చిన 10 రోజుల్లో భూ యాజమాన్య హక్కుల నిర్ధారణ ప్రక్రియ పూర్తి చేయాలి. దరఖాస్తుదారుల నుంచి అదనపు సమాచారం అవసరమైతే ఈ గడువులోపే తెప్పించుకుని పరిష్కరించాలి.
♦అనర్హులైన దరఖాస్తుదారులకు తిరస్కృతి లేఖలు, ఫీజులను తెలిపే లేఖలను ఫిబ్రవరి 2లోగా జారీ చేయాలి. దరఖాస్తుదారులు మిగులు ఫీజుల చెల్లింపు, లేదా అదనపు సమాచారం అందించేందుకు 15 రోజుల సమయం కేటాయించాలి.
♦బ్యాలెన్స్ ఫీజులు/ డాక్యుమెంట్లను అందించిన వారి దరఖాస్తులను ఫిబ్రవరి 28 లోగా ఆమోదించాలి. 15 రోజుల్లో బ్యాలెన్స్ ఫీజు/డాక్యుమెంట్లు అందించ ని వారి దరఖాస్తులను తిరస్కరించాలి.