అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్‌రెడ్డిలకు కూడా ఇచ్చే అవకాశం
ఫార్ములా–ఈ కార్ల రేసు కేసులో చర్యలకు సిద్ధం
బ్యాంకు అధికారుల నుంచి వివరాలు సేకరించనున్న ఈడీ
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’కార్ల రేసు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)’ను నమోదు చేసిన ఈడీ అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితులకు సమన్లు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఏ–2గా ఉన్న పురపాలకశాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఏ–3గా ఉన్న హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డికి ఈడీ సోమవారం సమన్లు జారీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఇప్పటికే ఏసీబీ నుంచి ఫార్ములా–ఈ కారు రేసు ఒప్పందాలకు సంబంధించి సేకరించిన పత్రాలు, ఎఫ్‌ఐఆర్‌తోపాటు బ్యాంకు లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించారు. హెచ్‌ఎండీఏ సాధారణ నిధుల నుంచి యూకేకు చెందిన ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈఓ)’కు రూ.45,71,60,625 సొమ్మును విదేశీ కరెన్సీలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బదిలీ చేశారు. దీంతో సదరు బ్యాంకు అధికారుల వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు.
ఇందుకు సంబంధించి బ్యాంకు అధికారులను సైతం ప్రశ్నించనున్నారు. ఓవైపు ఈ కేసులో ఈడీ అధికారులు వేగం పెంచగా మరోవైపు తెలంగాణ ఏసీబీ సైతం కీలకాంశాలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. కేటీఆర్‌ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయొద్దని.. కానీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు ఆదేశించడంతో ఆధారాల సేకరణపై ఏసీబీ దృష్టి పెట్టింది. తొలుత హెచ్‌ఎండీఏ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్ వాంగ్మూలం నమోదుతో దర్యాప్తు ప్రక్రియ ప్రారంభించనుంది.
ఈడీ, ఏసీబీ దర్యాప్తులో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఏసీబీ సేకరించే పత్రాలు ఈడీకి ఉపయోగపడినట్లే ఈడీ దర్యాప్తులో మనీలాండరింగ్ కోణంలో ఏవైనా ఆధారాలు లభిస్తే ఈ కేసు మరో మలుపు తిరుగుతుందన్న చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment