ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పేస్కేలు | Pay scale at par with government employees | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పేస్కేలు

Published Fri, Aug 18 2023 1:15 AM | Last Updated on Fri, Aug 18 2023 8:59 AM

Pay scale at par with government employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పట్టణ/గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా/సెర్ప్‌)ల ఉద్యోగులకు శుభవార్త. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన మెప్మాలో పనిచేస్తున్న 378 మంది ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పేస్కేలు వర్తింపజేస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌ ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే సెర్ప్‌లోని 3,974 మంది ఉద్యోగులకు సైతం పేస్కేలు వర్తింపజేస్తూ గత మార్చి 18న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేయగా, తాజాగా ఈ రెండు జీవోలు బయటకు వచ్చాయి.

2023 ఏప్రిల్‌ 1 నుంచి పేస్కేలు వర్తింపు..
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మెప్మా, సెర్ప్‌ ఉద్యోగులకు 2023 ఏప్రిల్‌ 1 నుంచి పేస్కేల్‌ వర్తించనుంది. ప్రస్తుత కనీస వేతనానికి సమీపంలో ఉన్న పేస్కేళ్లను వర్తింపజేయనున్నారు. మెప్మా ఉద్యోగులకు ప్రస్తుత కనీస వేతనానికి రక్షణ కల్పిస్తారు. సెర్ప్‌ ఉద్యోగుల ప్రస్తుత స్థూల వేతనం, ఇతర అలవెన్సులకు రక్షణ లభించనుంది. పేస్కేలు వర్తింపజేసినా సెర్ప్, మెప్మా ఉద్యోగులు ఇప్పటి తరహాలోనే రిజిస్టర్డ్‌ సొసైటీ ఉద్యోగులుగా కొనసాగుతారని,

ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించినట్టు లేదా ప్రభుత్వంలో విలీనం చేసుకున్నట్టు పరిగణించడానికి వీలు లేదు. కాగా, వీరికి ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సదుపాయాలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఇదిలా ఉండగా ఇకపై ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాతే మెప్మాలో రెగ్యులర్‌/కాంట్రాక్టు/ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులను సృష్టించాలని ఆ ఉత్తర్వులు స్పష్టం చేశాయి. 

మెప్మా కొత్త పేస్కేళ్లు ఇలా: మెప్మా ఉద్యోగులకు వారి హోదాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల కేటగిరీ పేస్కేళ్లను వర్తింపజేయనున్నారు. స్టేట్‌ మిషన్‌ డైరెక్టర్లకు మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–2, డిస్ట్రిక్ట్‌ మిషన్‌ కోఆర్డినేటర్లకు సూపరింటెండెంట్, ఎంఐఎస్‌ మేనేజర్లకు సీనియర్‌ అసిస్టెంట్, టౌన్‌ మిషన్‌ కోఆర్డినేటర్లకు సీనియర్‌ అసిస్టెంట్, అసిస్టెంట్‌ డిస్ట్రిక్ట్‌ మిషన్‌ కోఆర్డినేటర్లకు కామన్‌ అసిస్టెంట్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు/జూనియర్‌ అసిస్టెంట్లు/డేటా ఎంట్రీ ఆపరేట ర్లకు జూనియర్‌ అసిస్టెంట్, డ్రైవర్లకు డ్రైవర్, ఆఫీస్‌ సబా ర్డినేట్లకు ఆఫీస్‌ సబార్డినేట్‌ పే–స్కేళ్లు వర్తింపజేస్తారు. 

సెర్ప్‌లో పేస్కేళ్లు ..
సెర్ప్‌లోని మండల సమాఖ్య కమ్యూనిటీ కోఆర్డినేటర్లు/ఆఫీస్‌ సబార్డినేట్లకు ఆఫీస్‌ సబార్డినేట్, మండల్‌ బుక్‌ కీపర్లకు రికార్డు అసిస్టెంట్, కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు జూనియర్‌ అసిస్టెంట్, అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్లకు సీనియర్‌ అసిస్టెంట్, డిస్ట్రిక్ట్‌ ప్రాజెక్టు మేనేజర్లకు సూపరింటెండెంట్, ప్రాజెక్టు మేనేజర్లకు ఎంపీడీఓ, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌/ప్రాజెక్టు సెక్రటరీలకు జూనియర్‌ అసిస్టెంట్, డ్రైవర్లకు డ్రైవర్ల హోదాలో ప్రభుత్వ ఉద్యోగుల పేస్కేలు వర్తింపజేస్తారు. 

మెప్మాలో అడ్డదారిలో నియామకాలు?
మెప్మా ఉద్యోగులకు పేస్కేలు వర్తింపజేస్తామని దాదాపు ఏడాది కిందటే సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆ తర్వాత మెప్మాలో కొంత మంది అధికారులు తమ పిల్లలను, బంధువులను దొడ్డిదారిలో నియమించుకున్నారని ఆరోపణలు న్నాయి. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన జీవోతో వారికి సైతం ప్రయోజనం కలగనుందని విమర్శలు వస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement