సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను తెరిచారు. అంతేకాకుండా ఆయన అసలు ఫేస్‌బుక్ ఖాతాలోని చాలా మంది మిత్రులకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపారు. తన ఒరిజినల్ ఫేస్‌బుక్ ఖాతాలో వివిధ సందర్భాల్లో పోస్టు చేసిన వ్యక్తిగత ఫొటోలను నకిలీ ఖాతా తెరవడానికి ఆగంతకులు వాడుకున్నారు. ఇవి చూసిన ఆయన స్నేహితులు నిజంగానే అరవింద్‌కుమార్ రెండో ఖాతా తెరిచారని భావించి ఫ్రెండ్ రిక్వెస్టును యాక్సెప్టు చేశారు. ఇలా యాక్సెప్ట్ చేసిన కొందరితో ఆగంతకులు ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా అరవింద్‌కుమార్ పేరుతో సందేశాలు పంపారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న అరవింద్‌కుమార్ వెంటనే ఫేస్‌బుక్‌కు రిపోర్టు చేయడంతో పాటు తన మిత్రులను అప్రమత్తం చేస్తూ శుక్రవారం తన ఒరిజినల్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఫేస్‌బుక్ ఏ మాత్రం సురక్షితం కాదని, సరైన రీతిలో కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియ చేపట్టకుండానే ఎవరినైనా కొత్త ఖాతాలు తెరిచేందుకు ఫేస్‌బుక్ యంత్రాంగం అనుమతిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాను ఫేస్‌బుక్ నుంచి శాశ్వతంగా వైదొలగిపోవడమే అత్యుత్తమం అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఫేస్‌బుక్‌లో అరవింద్‌కుమార్ ఓ పోస్టు ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చూసిన ఆగంతకులు నకిలీ ఖాతాను డీయాక్టివేట్ చేశారు.
(చదవండి: ఫేస్‘బుక్’ నకిలీ ఖాతాలతో జర జాగ్రత్త!)
Comments
Please login to add a commentAdd a comment