సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) భూతం పట్టుకుంది. అవిభాజ్య స్థలం ధర తక్కువే ఉంటుంది కావచ్చు.. కానీ, స్థలానికి సంబంధించి ఏమైనా న్యాయపరమైన చిక్కులొచ్చినా, నిర్మాణ అనుమతులు రాకపోయినా నష్టపోయేది మాత్రం కొనుగోలుదారులే. యూడీఎస్‌లో కొనుగోలు చేస్తే కలిగే నష్టాలపై కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లు, రెరా అనుమతి పొందిన ఏజెంట్ల నుంచి మాత్రం కొనుగోళ్లు జరపాలని సూచిస్తుంది. 2017, జనవరి 1వ తేదీ తర్వాత 500 చ.మీ. లేదా 6 యూనిట్ల కంటే ఎక్కువ అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనుమతి పొందిన ప్రతీ ప్రాజెక్ట్ తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్–రెరా) నిబంధనలను పాటించాల్సిందే. కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసే ప్రాపర్టీ టీఎస్–రెరాలో నమోదైందో లేదో నిర్ధారించుకున్నాకే నిర్ణయం తీసుకోవటం ఉత్తమమని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రామకృష్ణా రావు తెలిపారు. కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయికి తగ్గ విలువను, సామాన్యుల పెట్టుబడులకు భరోసాను కల్పించే రెరా ప్రాజెక్ట్‌లలోనే విక్రయాలు చేయాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రాపర్టీల ధరలు తక్కువగా ఉన్నాయని, దీంతో గృహ కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ప్రణాళికబద్ధమైన విస్తరణ, వ్యాపార పెట్టుబడులతో రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయని తెలిపారు. హైదరాబాద్‌లో అధిక శాతం కొనుగోలుదారులు తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు ఉంటారు. వీరికి నిర్ధిష్టమైన వనరులు, రియల్టీ లావాదేవీలపై అవగాహన కాసింత తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో కొనుగోలుదారులు బిల్డర్ల ప్రొఫైల్‌ను పరిశీలించకుండా తక్కువ ధర అనగానే తొందరపడి కొనుగోలు చేస్తుంటారని క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రెరా నమోదిత ప్రాజెక్ట్‌లలో కొంటేనే కస్టమర్ల కష్టార్జితానికి పూర్తి విలువ చేకూరుతుందని పేర్కొన్నారు.
యూడీఎస్‌లో కొంటే
కొనుగోలు లేదా సమీకరణ చేసిన స్థల విలువకు ప్రామాణికత ఉండదు
జీహెచ్‌ఎంసీ/హెచ్‌ఎండీఏ/డీటీసీపీ అనుమతులు ఉండవు.
రెరా అథారిటీ వద్ద నమోదు కాదు.
స్థలం అమ్మకం అనధికారిక అగ్రిమెంట్ లేదా జీపీఏ ద్వారా చేస్తారు.
రెరా లేదా ఇతర సంస్థల నుంచి కొనుగోలుదారులకు రక్షణ ఉండదు.
భూ వివాదాలు తలెత్తితే స్థల యజమానిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
రేటు తక్కువే కానీ సురక్షితం ఏమాత్రం కాదు.
రెరాలో కొంటే
సేకరణ లేదా కొనుగోలులో స్థల విలువకు ప్రామాణికత ఉంటుంది.
అన్ని రకాల ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు ఉంటాయి.
రెరాలో నమోదు అవుతుంది, రెరా నంబర్ కూడా కేటాయిస్తారు.
అమ్మకం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారమే ఉంటుంది.
రెరా అథారిటీలోని పలు నిబంధనలు కస్టమర్లకు రక్షణ కల్పిస్తాయి.
ఎలాంటి వివాదాలు తలెత్తినా రెరా అథారిటీ పరిష్కరిస్తుంది.
ధర ఎక్కువైనా.. ప్రాపర్టీ మాత్రం సురక్షితం.
Comments
Please login to add a commentAdd a comment