Realty Business
-
హౌసింగ్‌కు మళ్లీ డిమాండ్
న్యూఢిల్లీ: హౌసింగ్ మార్కెట్‌పట్ల ఇన్వెస్టర్లు తిరిగి ఆసక్తి చూపుతున్నట్లు ఫిక్కీ–అనరాక్ చేపట్టిన సర్వే తెలియజేసింది. సర్వేలో 36 శాతంమంది పెట్టుబడి ఆలోచనతోనే ఇళ్ల కొనుగోలు కోసం చూస్తున్నట్లు వెల్లడించారు. ‘ఫిక్కీ–అనరాక్ కన్జూమర్ సెంటిమెంట్ సర్వే 2023 ద్వితీయార్ధం’ పేరుతో నిర్వహించిన రియల్టీ సదస్సులో సర్వేను విడుదల చేశారు. సర్వే ప్రకారం కొనుగోలుదారులు భారీ గృహాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా కొత్తగా ప్రవేశపెడుతున్న ప్రాజెక్టులలో ఫ్లాట్ల కొనుగోలుకీ ఆసక్తి చూపుతున్నారు. కోవిడ్–19 సవాళ్లు, వినిమయ ఆదాయం పుంజుకోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ సంప్రదాయానికి తెరలేవడం వంటి అంశాలు విశాలమైన గృహాలకు డిమాండ్‌ను పెంచుతున్నట్లు ఫిక్కీ రియల్టీ కమిటీ చైర్మన్ రాజ్ మెండా పేర్కొన్నారు. వెరసి భారీ ఇళ్లు, విలాసవంత గృహాలకు దేశవ్యాప్తంగా గిరాకీ కనిపిస్తున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా అద్దె ఇళ్లకు బదులుగా సొంత గృహాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. ధరలు పెరిగినా.. ఇటీవల ధరలు పెరిగినప్పటికీ సర్వేలో పాల్గోన్న 50 శాతంమంది మూడు పడకగదుల(3బీహెచ్‌కే) గృహాలకు, 38 శాతంమంది 2బీహెచ్‌కే ఇళ్లకు ఆసక్తి ప్రదర్శించినట్లు అనరాక్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు. 2020 ద్వితీయార్ధంతో పోలిస్తే 2023 ద్వితీయార్ధంలో పెట్టుబడి యోచనతో ఇళ్ల కొనుగోలుకి ఆసక్తి చూపినవారు 26 శాతం నుంచి 36 శాతానికి పెరిగినట్లు వెల్లడించారు. వెరసి రియల్ ఎస్టేట్ లాభదాయక పెట్టుబడి అవకాశంగా భావిస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రాపర్టీ మార్కెట్ భారీ లాభాలకు అవకాశాలు కలి్పంచనున్నట్లు అత్యధిక శాతంమంది వ్యక్తిగత ఇన్వెస్టర్లు విశ్వసిస్తున్నట్లు వివరించింది. దీనికితోడు భారీ సంస్థలు, లిస్టెడ్ కంపెనీల నుంచి కొత్త ప్రాజెక్టులు పెరగడంకూడా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేసింది. ఫలితంగా గృహ కొనుగోలుదారులకు విశ్వాసం పెరుగుతున్నదని, ఇది హౌసింగ్ మార్కెట్ బలపడేందుకు దోహదం చేస్తున్నదని అభిప్రాయపడింది. -
కోట్ల రూపాయలు కావాలా..? స్థలం ఎక్కడ కొనాలంటే..
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిన వారు మంచి రాబడులు అందుకుంటున్నారు. దశాబ్దకాలంలో సగటున ఏటా 10 శాతం చొప్పున ఇంటి విలువలు పెరిగాయి. 2013లో రూ.50 లక్షలు విలువ చేసే ఇల్లు కొంటే దాని ధర ఇప్పుడు రూ.కోటిపైనే పలుకుతోంది. బాగా వృద్ధి ఉన్న ప్రాంతాల్లో ఇంతకు రెండుమూడు రెట్లు పెరిగిన సందర్భాలున్నాయి. వచ్చే దశాబ్దంలోనూ రియల్ ఎస్టేట్‌లో వృద్ధి కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్కెట్ కొన్నాళ్ల పాటు స్తబ్ధుగా ఉండటం, ఆ తర్వాత ఒక్కసారిగా పెరగడం హైదరాబాద్‌లో పలుమార్లు జరిగింది. పెద్ద నోట్ల రద్దు, కొవిడ్ అనంతరం ఎక్కువ మంది ఇలాంటి పరిస్థితిని గమనించే ఉంటారు. దీర్ఘకాలానికి పెట్టుబడి పెట్టిన వారు లాభపడ్డారు. మంచి రాబడులు అందుకున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ముగిసి, లోక్‌సభ ఎన్నికలు రాబోతుండడంతో మార్కెట్లో కొంత స్తబ్ధత కన్పిస్తోంది. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రానున్న రోజుల్లో మార్కెట్ మళ్లీ పెరగడం ఖాయమని నిర్మాణదారులు అంటున్నారు. కాబట్టి ఇంటి కల నెరవేర్చుకునేవారు, పెట్టుబడి కోణంలో రెండో ఇల్లు కొనేవారికి ఇప్పుడు అనుకూల సమయం అంటున్నారు. అయితే ఎలాంటి ప్రదేశంలో ఇల్లు, స్థలం కొనాలో నిపుణులు కొన్ని అంశాలను సూచిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి సంస్థలు పెద్ద ఎత్తున వస్తున్న ప్రాంతాలకు చేరువగా ఉన్న ప్రాంతాలను పరిశీలించవచ్చు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. వంద అడుగుల రహదారులను చేపట్టగానే ఆ ప్రాంతంలో స్థిరాస్తుల ధరలు ఒక్కసారిగా పెరగడం గమనించే ఉంటారు. మూసీపై వంతెనలతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయిన ఉదాహరణలు కళ్లముందే ఉన్నాయి. కొత్తగా కొన్నిచోట్ల ప్రభుత్వం మూసీపై వంతెనలను కట్టబోతుంది. వీటిలో ఇప్పటివరకు లేని చోట ఎక్కడ కడుతున్నారో దృష్టి పెట్టాలి. మెట్రోరైలును సిటీలో పలు ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. ఎక్కడ తొలుత విస్తరిస్తున్నారో గమనించాలి. ఇలాంటి చోట్ల తక్కువ సమయంలో ఎక్కువ పెరుగుదల ఉంటుంది. ఇదీ చదవండి: భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ.. ఇవేవి లేకున్నా కూడా సహజంగా వృద్ధి చెందే ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడ నిలకడగా ధరల వృద్ధి, అభివృద్ధి ఉంటుంది. మీరు శివార్లలో ఉంటున్నట్లయితే అక్కడి నుంచి పది కి.మీ. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై ఒక నజర్ వేయండి. స్థిరాస్తి సంస్థల ప్రకటనలు గమనించండి.. స్థలాలు, ఫ్లాట్లు, విల్లాల ప్రాజెక్టులు ఎటువైపు వస్తున్నాయో అవగాహన పెంచుకోండి. ప్రత్యక్షంగా చూసిన తర్వాత నిర్ణయానికి రండి. -
రూ.10 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాల వృద్ధి.. ఎక్కడంటే..
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో దక్షిణాసియాలో అతిపెద్ద నిర్మాణ పరికరాల ప్రదర్శన ‘ఎక్స్‌కాన్-2023’ను బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో డిసెంబర్ 12 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. నైపుణ్యాభివృద్ధికి పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక వృద్ధిని సాధించాలని మంత్రి అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా వాహనాల నుంచి వచ్చే కార్బన్‌ను తగ్గించి కార్బన్ న్యూట్రల్ దేశం కోసం కృషిచేయాలని కోరారు. దాంతోపాటు ఉద్యోగాల కల్పన జరుగుతోందని చెప్పారు. ‘బిల్డింగ్ ఇండియా టుమారో’ పేరిట అయిదు రోజులపాటు జరగనున్న ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన 1200 మంది ప్రదర్శనకారులు హాజరయ్యారు. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతీయ నిర్మాణ సామగ్రి తయారీదారుల సంఘం ఈ ఈవెంట్లో భాగస్వాములుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లతో దేశంలో నిర్మాణ రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనుంది. దాదాపు రూ.10 వేల కోట్లను విశాఖకు కేటాయించనుంది. మౌలిక సదుపాయాలు, ఆర్థిక పురోగతి, పోటీతత్వానికి అనుకూలమైన వాతావరణాన్ని ఈ పెట్టుబడులు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన వినూత్న పరికరాలకు ఈ ప్రదర్శన వేదికగా నిలుస్తుంది. నిర్మాణ సామగ్రి పరిశ్రమ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 26% వృద్ధి సాధించింది. ఎక్స్‌కాన్ 2023లో భాగంగా హైడ్రోజన్, డీజిల్ ఇంజిన్లను సైతం ప్రదర్శించారు. ఇదీ చదవండి: ఐదు రోజుల్లో రూ.20 వేలకోట్ల సంపాదన..! -
మహిళల ఓటు రియల్ ఎస్టేట్‌కే
న్యూఢిల్లీ: దేశంలో మెజారిటీ మహిళలు సొంతింటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. తాము రియల్టీలో పెట్టుబడులు పెడతామని 65 శాతం మంది మహిళలు ఓ సర్వేలో భాగంగా చెప్పారు. 20 శాతం మంది తాము స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించగా, 8 శాతం మంది బంగారానికి ఓటు చేశారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘అనరాక్’ ఈ సర్వేని నిర్వహించింది. 5,500 మంది వినియోగదారుల అభిప్రాయాలను అనరాక్ సర్వే తెలుసుకుంది. ఇందులో సగం మంది మహిళలు పాల్గొన్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తామని 7 శాతం మంది చెప్పారు. రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పిన వారిలో 83 శాతం మంది రూ.45 లక్షలకు పైన ధర కలిగిన వాటిని తీసుకుంటామని తెలిపారు. ‘‘ఇంటిని కొనుగోలు చేయాలనుకునే మహిళల్లో 33 శాతం మంది రూ.45–90 లక్షల శ్రేణిలో ఉన్న వాటికి అనుకూలంగా ఉన్నారు. 27 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య బడ్జెట్లో చూస్తున్నారు. ఇక 20 శాతం మంది రూ.1.5 కోట్లకుపైన ఉన్న విలాసవంతమైన ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రూ.45 లక్షల్లోపు ధరలోని అందుబాటు ధరల ఇళ్లు చాలా తక్కువ మంది ఎంపికగా ఉన్నాయి’’అని అనరాక్ వెల్లడించింది. గతంలో మహిళలు ఇళ్లను 77 శాతం మేర నివాసం కోసమే తీసుకోగా, తాజాగా అది 82 శాతానికి చేరింది. మిగిలిన వారు పెట్టుబడుల కోణంలో తీసుకుంటున్నారు. పలు ప్రయోజనాలు.. మహిళలు తమ పేరిట ఇళ్లను కొనుగోలు చేయడం వల్ల పలు ప్రయోజనాలు పొందొచ్చని అనరాక్ సూచించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పేరిట యాజమాన్య హక్కులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపింది. 2015లో తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ప్రయోజనాలు పొందాలంటే ప్రాపర్టీ మహిళల పేరిట నమోదు చేయడం లేదంటే సహ యజమానిగా ఉండాలన్న విషయాన్ని ప్రస్తావించింది. మహిళలకు స్టాంప్ డ్యూటీ చార్జీలు తక్కువగా ఉండడాన్ని కూడా పేర్కొంది. బ్యాంకులు మహిళలకు తక్కువ రేట్లపై గృహ రుణాలను ఇస్తున్నట్టు తెలిపింది. -
చైనా సర్కార్‌కు సవాల్ విసురుతున్న దెయ్యాల నగరాలు
ఒక్క రియల్ ఎస్టేట్ రంగం నష్టాల్లో కూరుకుపోతే దేశ ఆర్ధిక వ్యవస్థే తల్లకిందులైపోతుందా ఏంటి? అని చాలా మంది బుగ్గలు నొక్కుకోవచ్చుకానీ.. చైనా విషయంలో మాత్రం అది నూటికి నూరు పాళ్లూ నిజమే అంటున్నారు ఆర్ధిక వేత్తలు. ఎందుకంటే చైనా స్థూల జాతీయోత్పత్తిలో రియల్ ఎస్టేట్ రంగం వాటా 29 శాతం. దీనికి కారణాలు లేకపోలేదు. చైనాలో కోటికి పైగా జనాభా ఉండే నగరాలు పదికి పైనే ఉన్నాయి. 1970ల తర్వాత చైనాలో పట్టణీకరణ వేగం అందుకుంది. మామూలు వేగం కాదు. రాకెట్ వేగంతో పట్టణాలు,నగరాలు విస్తరించారు. పెద్ద మొత్తంలో గ్రామీణ ప్రజలు ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకుంటూ నగరాలకు వలసలు రావడం మొదలు పెట్టింది అప్పుడే. ఇదీ చదవండి: China: రియల్ ఎస్టేట్ కంపెనీల దివాలా, కంటిమీద కునుకు లేని చైనా) 50ఏళ్ల వ్యవధిలో ఈ వలసలు ఎంత వేగంగా పెరిగాయంటే ప్రస్తుతం చైనాలో పట్టణ జనాభా 64 శాతం మేరకు పెరిగిపోయింది. అంటే గ్రామీణ చైనాలో కేవలం 36 శాతం మంది ప్రజలు మాత్రమే జీవిస్తున్నారు. అందరూ పట్టణాలవైపు మొగ్గు చూపడంతో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. భూముల క్రయ విక్రయాలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారపు జోరు కారణంగా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చి చేరుతోంది. ఆదాయంలో సింహభాగం రియల్ ఎస్టేట్ పైనే ఆధార పడుతోంది చైనా. రియల్ బూమ్ యాభై ఏళ్లల్లో ఏటేటా పెరిగిపోతూ చైనా ఆర్ధిక వ్యవస్థను ఓ పెద్ద బుడగలా పెంచేసింది. ఇపుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్క సారిగా కుదుపునకు లోను కావడంతో చైనా భవిష్యత్ ఏంటా అని ఆర్ధిక రంగ నిపుణులు సైతం కంగారు పడుతున్నారు. నిజానికి ఇటువంటి సంక్షోభం ఏ ఇతర దేశంలో చోటు చేసుకున్నా అది ఆ దేశాలను కోలుకోలేని విధంగా దెబ్బతీయడం ఖాయం. (చైనా డొల్లతనం..దాచేస్తే దాచని సత్యం!) ఇదీ చదవండి: చైనాలో ఇంత దారుణంగా ఉందా? అసలు ఏం జరుగుతోంది? పైకి అంతెత్తున కనిపిస్తున్న చైనాలో పరిస్థితి తలకిందులయ్యేలా ఉందని చాలా మందే హెచ్చరిస్తున్నారు. గంభీరంగా కనిపించే డ్రాగన్ పాలకులు లోలోన తీవ్ర కలవరానికి గురవుతున్నారని చెబుతున్నారు. అయితే పాలకులు ఈ సంక్షోభాన్ని కూడా అధిగమించగల సత్తా ఉన్నారని ఆ దేశ ఆర్ధిక వేత్తలు బీరాలు పలుకుతున్నారు. ఎవర్ గ్రాండే, ఫాంటాసియాలు చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఎవర్ గ్రాండే ఆస్తులపై ప్రభుత్వం ఓ కన్నేసింది. దెయ్యాల నగరాలు.. ఔను చైనాలో ఇప్పుడు ఎక్కడ చూసినా దెయ్యాల నగరాలే. అంటే నిజంగా దయ్యాలు ఉంటాయని కాదు కానీ.. ఆ నగరాల్లో ఎవరూ ఉండరని అర్థం. చైనాలోని ఈ దెయ్యాల నగరాలే ఇపుడు ప్రభుత్వానికి పెద్ద సవాల్. చైనాలో చాలా నగరాల్లో లక్షలాది సంఖ్యలో ఇళ్లు నిర్మించి ఉన్నాయి. చిత్రం ఏంటంటే చాలా నగరాల్లో నిర్మించిన ఇళ్లు ఖాళీగానే ఉన్నాయి. అంటే ఈ నగరాల్లో ఇళ్లను కొనుగోలు చేసే వారు కేవలం పెట్టుబడుల కోసమే వాటిని కొంటున్నారు. అంతే కానీ ఇల్లు కొని గృహప్రవేశాలు చేసి అందులో కాపురం ఉండడానికి ఎంత మాత్రం కాదు. ఇలా అందరూ పెట్టుబడులకోసం కొని పెట్టుకున్న ఇళ్లతో నగరాలు వెల వెల బోతూ కనిపిస్తాయి చైనాలో. ఇలాంటి నగరాలనే ఘోస్ట్ సిటీస్ అంటారు. అవే దెయ్యాల నగరాలన్నమాట. చైనాలోని దెయ్యాల నగరాల్లో నిర్మించిన ఆకాశహర్మ్యాల్లో కనీసం 20 శాతం ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఇళ్లను పంచిపెడితే 9 కోట్ల మందికి ఇళ్లు అందించవచ్చన్నమాట.జర్మనీ, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాల్లోని మొత్తం జనాభాకు సరిపడ ఇళ్లు చైనాలో ఖాళీగా అఘోరిస్తున్నాయి. 2021 లో చైనాలో ఇళ్ల నిర్మాణాల్లో 14 శాతం తగ్గుదలనమోదయ్యింది. లక్షలాది చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. వరుస సంక్షోభాల కారణంగానే ఎవ్వరి దగ్గరా డబ్బులు లేవు. అందుకే కోట్లాది ఇళ్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. వేలాది బిలియన్ల డాలర్లమేరకు పెట్టుబడి పెట్టిన వెంచర్లు మధ్యలోనే ఆగిపోవడం..రియల్ వ్యాపారులనే కాదు చైనా ప్రభుత్వాన్నీ కంగారు పెడుతోంది. యావత్ ప్రపంచాన్ని శాసించేయాలని సామ్రాజ్య వాద విస్తరణ కాంక్షతో రగిలిపోతోన్న చైనాలో అసలు పరిస్థితి చాలా భయంకరంగా ఉందని ఆర్ధిక రంగ నిపుణులు అంటున్నారు. -
బ్లాక్‌మనీ తగ్గింది
75–80 శాతం తగ్గిన నల్లధనం లావాదేవీలు ∙తుది వినియోగదారులతో గృహాలకు డిమాండ్: అనరాక్ కన్సల్టెన్సీ పెద్ద నోట్ల రద్దు అనే చెట్టు ఫలాలు చేతికొస్తున్నాయి. డీమానిటైజేషన్ తర్వాత దేశీయ గృహ విభాగం గతుకుల రోడ్ల మీద ప్రయాణంలా మొదలై.. నేడు హైవే మీద దూసుకెళుతోంది. ఊహాజనిత కొనుగోళ్లు, విక్రయాలు పూర్తిగా తొలగిపోయాయి. దేశీయ గృహ విభాగంలో నల్లధనం లేదా నగదు లావాదేవీలు 75–80 శాతం మేర క్షీణించాయి. తుది వినియోగదారులతో గృహ విభాగంలో అసలు డిమాండ్ ఏర్పడింది. ఇంటిని ఎందుకు కొంటున్నాం.. ఎందుకు విక్రయిస్తున్నామనే ప్రాథమిక అంశాలను నిర్ధారించుకున్నాకే నిర్ణయం తీసుకునేలా నోట్ల రద్దు మార్చేసింది. సాక్షి, హైదరాబాద్: దేశంలో 2016 నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) అమల్లోకి వచ్చింది. రియల్టీ రంగాన్ని డీమానిటైజేషన్‌కు ముందు, తర్వాత అని విభజించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నోట్ల రద్దు తర్వాత కొత్త గృహాల ప్రారంభాలు క్షీణించగా.. విక్రయాలు పెరిగాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నివేదిక తెలిపింది. తొలి ఏడాది కాలం పాటు గందరగోళం, అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన నగరాల్లోని రియల్టీ మార్కెట్ ప్రతికూలంలోకి వెళ్లిపోయింది. దీంతో గృహాల ప్రారంభాలు గణనీయంగా తగ్గిపోయాయి. డీమానిటైజేషన్‌కు ముందు ((2013 నుంచి 2016 మూడో త్రైమాసికం– క్యూ3) దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 16.15 లక్షల యూనిట్లు లాంచింగ్ కాగా.. డీమో తర్వాత (2016 క్యూ4 నుంచి 2021 క్యూ3) 9.04 లక్షల యూనిట్లకు తగ్గాయి. సుమారు 44 శాతం లాంచింగ్‌లు క్షీణించాయి. విక్రయాలలో వృద్ధి.. పెద్ద నోట్ల రద్దుకు ముందు 11.78 లక్షల గృహాలు అమ్ముడుపోగా.. నోట్ల రద్దు తర్వాత 10.37 లక్షల గృహాలు సేలయ్యాయి. తుది వినియోగదారుల కొనుగోళ్లతో ప్రధాన నగరాల్లో రియల్టీ మార్కెట్ బలపడింది. డీమానిటైజేషన్ తర్వాత లగ్జరీ మార్కెట్ కూడా కాసింత ప్రభావానికి లోనైనప్పటికీ.. కరోనా మహమ్మారితో సానుకూల డిమాండ్‌ను కొనసాగిస్తుంది. డెవలపర్లు సప్లయి, డిమాండ్లను నిశితంగా పరిశీలిస్తున్నారని.. విక్రయాలను బట్టి కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తున్నారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. సరఫరా కంటే విక్రయాలకు డిమాండ్ ట్రెండ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. రీసేల్‌పై ఎక్కువ ప్రభావం.. ప్రాథమిక మార్కెట్ కంటే సెకండరీ, రీసేల్ ప్రాపర్టీలపై డీమానిటైజేషన్ ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. ఈ విభాగంలోని లగ్జరీ ప్రాపర్టీలు కూడా నగదు లావాదేవీలను ఎక్కువగా కలిగి ఉండటమే ఇందుకు కారణం. డెవలపర్లు విక్రయించే అఫర్డబుల్, మధ్యస్థాయి గృహాలకు (ప్రాథమిక ప్రాపర్టీలు) డిమాండ్ పెరిగింది. అయితే దేశీయ రియల్టీ మార్కెట్లో నల్లధన లావాదేవీలు పూర్తి స్థాయిలో తగ్గిపోలేదు. కాకపోతే గతంలో మాదిరిగా కాకుండా చాలా మంది తుది వినియోగదారులు ఆస్తి లావాదేవీలను పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నారు. చిన్న పట్టణాలు, పెరీ అర్బన్ ఏరియాలలో నేటికీ నల్లధన లావాదేవీలు జరుగుతున్నాయి. బ్రాండెడ్ గృహాలకు డిమాండ్.. పెద్ద నోట్ల తర్వాత బ్రాండెడ్, లిస్టెడ్ రియల్టీ కంపెనీలు గృహ విక్రయాలపై మెజారీటీ వాటాను కైవసం చేసుకున్నాయి. దీంతో ప్రధాన నగరాల్లో నల్లధన లావాదేవీలు క్షీణించాయి. మరోవైపు డీమానిటైజేషన్, రెరా, జీఎస్టీ తర్వాత గృహ కొనుగోలుదారులు బ్రాండెడ్ డెవలపర్ల ప్రాపర్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో లగ్జరీ ప్రాపర్టీలపై దృష్టి పెట్టిన డెవలపర్లు.. ప్రస్తుతం అఫర్డబుల్, మధ్యస్థాయి గృహాల వైపు దృష్టిని మళ్లించారు. దీంతో ఈ తరహా గృహాల సప్లయి కంటే డిమాండ్ పెరిగింది. దేశంలోని 8 ప్రధాన మార్కెట్లలో 2017 ఆర్థిక సంవత్సరంలోని ప్రాపర్టీ విక్రయాలలో లిస్టెడ్ డెవలపర్ల విక్రయాల వాటా 6 శాతంగా ఉండగా.. గతేడాది ఏప్రిల్–డిసెంబర్ నాటికి 22 శాతానికి పెరిగింది. అలాగే ప్రముఖ నాన్ లిస్టెడ్ డెవలపర్ల వాటా 11 శాతం నుంచి 18 శాతానికి వృద్ధి చెందింది. -
అవగాహన లేకుండా పెట్టుబడులొద్దు
హోల్‌సేల్, రిటైల్ వ్యాపార విధానాలు ఎలా ఉంటాయో.. సేమ్ అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) ప్రాజెక్ట్‌లుంటాయి. హోల్‌సేల్‌లో పెద్ద మొత్తంలో మాత్రమే విక్రయిస్తే.. కొనుగోలుదారులకు ఎంత కావాలంటే ఆ స్థాయిలో చిన్న మొత్తంలో విక్రయించడం రిటైల్ వ్యాపార విధానం. ఇదే తరహాలో యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో విక్రయాలు చేస్తుంటారు డెవలపర్లు. ఎప్పుడైతే ఎకరాల నుంచి గజాల చొప్పున కొనుగోళ్లు మొదలయ్యాయో.. అప్పటినుంచి యూడీఎస్ ప్రాజెక్ట్‌లకు ఆకాశమే హద్దుగా మారింది. పెట్టుబడుల మొత్తాన్ని బట్టి స్థలాన్ని విక్రయిస్తుండటం, సామాన్య, మధ్యతరగతి వర్గాలూ యూడీఎస్ ప్రాజెక్ట్‌లపై ఆసక్తి చూపిస్తుండటం దీనికి ప్రధాన కారణం. సాక్షి, హైదరాబాద్: యూడీఎస్ ప్రాజెక్ట్‌లనేవి అనాదిగా ఉన్నవే కానీ, పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) తర్వాత నగదు కొరత కారణంగా చిన్న మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడం మొదలైంది. కోట్ల నుంచి లక్షలకు, ఎకరాల నుంచి గజాల్లోకి ఎప్పుడైతే పెట్టుబడులు రూపాంతరం చెందాయో అప్పటి నుంచి యూడీఎస్ ప్రాజెక్ట్‌లు కోకొల్లలయ్యాయి. గతంలో ఎకరాల చొప్పున చేసే యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు ఎందుకంటే పెట్టుబడులూ పెద్దగానే ఉంటాయి కాబట్టి. దీంతో డెవలపర్లూ ఆ తరహా ప్రాజెక్ట్‌లూ పెద్దగా చేసేవారు కాదు. కానీ, ఎప్పుడైతే ఎకరాలకు బదులుగా గజాల్లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారో అప్పటి నుంచే బిల్డర్లకు కూడా యూడీఎస్ ప్రాజెక్ట్‌లపై మోజు పెరిగింది. అవగాహన లేకపోతే.. సామాన్యులు, మధ్యతరహా వర్గాలు కూడా యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎంత ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తే అంత త్వరగా డెవలపర్లకు చేతిలో నగదు చేరుతుంది. ఇచ్చిన హామీ ప్రకారం బిల్డర్ యూడీఎస్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవు. కానీ, నిర్మాణ అనుమతుల్లోనో లేక లే–అవుట్ ప్లాన్, డిజైన్స్లోనో లేక ఇతరత్రా ఇబ్బందులు తలెత్తితే మాత్రం బిల్డర్‌తో పాటూ ఆ ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టిన వారంతా చిక్కుల్లో పడిపోతారు. సాధారణంగా కోట్లలో పెట్టుబడులు పెట్టేవారికి యూడీఎస్ ప్రాజెక్ట్‌ల విధానాలపై అనుభవం ఉంటుంది. లేకపోతే ప్రొఫెషనల్స్, నిపుణుల సలహా తీసుకోనైనా పెట్టుబడి నిర్ణయం తీసుకుంటుంటారు. అదే సామాన్య, మధ్య తరగతి వారికి ఈ తరహా ప్రాజెక్ట్‌లపై అవగాహన ఉండదు. తక్కువ ధరకు వస్తుందనేదొక్కటే ఆలోచిస్తారు. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏ మాత్రం చిన్న సమస్య తలెత్తినా నెత్తినోరు బాదుకున్నా ప్రయోజనం ఉండదు. యూడీఎస్ ప్రాజెక్ట్‌లు ఎలా ఉంటాయంటే.. స్థలం కొనుగోలు, ప్లాన్స్, డిజైన్స్, అనుమతులు, నిర్మాణ సామగ్రి సమీకరణ.. ఇలా ఏ అంశంలోనూ డెవలపర్ జేబు నుంచి డబ్బులు పెట్టడు. జస్ట్, స్థల యజమానితో ఒప్పందం చేసుకొని ప్రాజెక్ట్‌ను మార్కెట్లో పెట్టేస్తాడు. ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని అందమైన బ్రోచర్లు ముద్రించి కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. వాటిలో కొంత మొత్తాన్ని స్థల యజమానికి ఇస్తూ కాలం గడుపుతుంటాడు. యజమానికి మొత్తం డబ్బు చేరితే తప్ప రిజిస్ట్రేషన్లు జరగవు. ఆ తర్వాతే నిర్మాణ అనుమతులు, నిర్మాణ పనులు మొదలవుతాయి. నిర్మాణ అనుమతుల్లో ఏమైనా న్యాయపరమైన సమస్యలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా సదరు బిల్డర్ ఆ ప్రాజెక్ట్‌ను ఎలా ముందుకు తీసుకెళతాడన్నదే లక్ష డాలర్ల ప్రశ్న. స్థల సమీకరణ ఒక్కటే సరిపోదు.. ప్రాజెక్ట్‌ను చేపట్టాలంటే స్థల సమీకరణ అనేది చాలా చిన్న పార్ట్. దాని కంటే కీలకమైనవి.. విధానం, డిజైన్స్, అనుమతులు, ఆర్థిక శక్తి, విస్తృతమైన మార్కెటింగ్ బృందం ఉండాలి. చాలా మంది కొనుగోలుదారులకు డెవలపర్ పేరు మీద స్థలం తాలూకు కాగితాలు ఉన్నాయో లేవో చూస్తారంతే, మిగిలిన విషయాలు పట్టించుకోరు. ఇదే యూడీఎస్ డెవలపర్లకు అవకాశంగా మారిపోతుంది. న్యాయపరమైన అవగాహన, మార్కెట్‌ను అధ్యయనం, మంచి కస్టమర్ బేస్.. ఇవేవీ లేకుండానే ‘ఎవడితో కత్తి.. ఎవడితో నెత్తి’అన్నట్లు ఏమాత్రం అనుభవం లేనివాళ్లు బిల్డర్లుగా మారి యూడీఎస్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. కనీసం ఇటుక కూడా పట్టుకోవడం రాని వాళ్లు కూడా రాత్రికి రాత్రే బిల్డర్లుగా అవతారం ఎత్తుతున్నారు. డెవలపర్ ట్రాక్ రికార్డ్‌ను పరిశీలించకుండానే ధర తక్కువ అనగానే సంతోషంతో గంతేసి పెట్టుబడులు పెడుతుంటారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో డెవలపర్ విఫలమై, నిర్మాణం ఆగిపోగానే ఇదేదో ప్రభుత్వ తప్పు అన్నట్లు గగ్గోలు పెడుతుంటారు. ఫలానా డెవలపర్ అన్యాయం చేశాడంటూ ప్రభుత్వాన్ని నిందిస్తుంటారు. పశ్చిమ హైదరాబాద్‌లో ఎక్కువగా.. గత మూడేళ్లుగా హైదరాబాద్‌లో యూడీఎస్ ప్రాజెక్ట్‌లు విపరీతమయ్యాయి. కోకాపేట, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్ వంటి స్థలాల ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో యూడీఎస్ ప్రాజెక్ట్‌లు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే ఆయా ప్రాంతాలలో ధర తక్కువ అనగానే కొనుగోలుదారులు కూడా సులువుగా బుట్టలో పడతారు. ఇలా చాలా మంది కస్టమర్లు అపార్ట్మెంట్లు కొనుగోలు చేశారు. ఆ ఇన్వెంటరీ అంతా ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంది. స్థల యజమానులు మార్కెట్‌ను అతిగా ఊహించుకొని డెవలపర్లను ఎక్కువ మార్జిన్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ స్థితిగతులను అర్థం చేసుకోవటం లేదు. దీంతో ప్రాజెక్ట్ నిష్పత్తి పెరుగుతుంది. ఈ 12 సూత్రాలు పాటిస్తే సొంతింటికి చేరినట్లే.. డెవలపర్ గత చరిత్ర, ప్రొఫైల్ చెక్ చేయాలి. గతంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లు తెలుసుకో వాలి. అందులోని కస్టమర్లతో మాట్లాడాలి. పాత ప్రాజెక్ట్‌లలో ధరల వృద్ధి ఎలా ఉందో తెలుసుకోవాలి. నిర్మాణం పూర్తయిన ప్రాజెక్ట్‌లలో న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యాయో కనుక్కోవాలి. ప్రాజెక్ట్ పూర్తయ్యాక కస్టమర్లతో బిల్డర్ వ్యవహారశైలి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. గడువులోగా నిర్మాణం పూర్తి చేస్తాడా? లేదా? తనిఖీ చేసుకోవాలి. బ్రోచర్లో ఇచ్చిన హామీలను తప్పకుండా పూర్తి చేస్తాడా లేదా తెలుసుకోవాలి. డెవలపర్ ఆర్థిక సామర్థ్యం కనుక్కోవాలి. బహుళ ప్రాజెక్ట్‌లను చేపట్టే బిల్డర్‌తో రిస్క్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏమైనా సమస్యలు తలెత్తినా వేరే ప్రాజెక్ట్‌లో అయినా సర్దుబాటు చేసే అవకాశం ఉంటుంది. నిర్మాణ అనుమతులు, రెరా నమోదు గురించి భౌతికంగా తనిఖీ చేయాలి. ప్రాజెక్ట్ రుణాలు, పాత లోన్ల రీపేమెంట్ గురించి ఆరా తీయాలి. డెవలపర్ లేదా కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత గురించి కూడా పరిశీలించాలి. -
రియల్టీకి యూడీఎస్ భూతం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) భూతం పట్టుకుంది. అవిభాజ్య స్థలం ధర తక్కువే ఉంటుంది కావచ్చు.. కానీ, స్థలానికి సంబంధించి ఏమైనా న్యాయపరమైన చిక్కులొచ్చినా, నిర్మాణ అనుమతులు రాకపోయినా నష్టపోయేది మాత్రం కొనుగోలుదారులే. యూడీఎస్లో కొనుగోలు చేస్తే కలిగే నష్టాలపై కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లు, రెరా అనుమతి పొందిన ఏజెంట్ల నుంచి మాత్రం కొనుగోళ్లు జరపాలని సూచిస్తుంది. 2017, జనవరి 1వ తేదీ తర్వాత 500 చ.మీ. లేదా 6 యూనిట్ల కంటే ఎక్కువ అపార్ట్మెంట్ల నిర్మాణానికి అనుమతి పొందిన ప్రతీ ప్రాజెక్ట్ తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్–రెరా) నిబంధనలను పాటించాల్సిందే. కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసే ప్రాపర్టీ టీఎస్–రెరాలో నమోదైందో లేదో నిర్ధారించుకున్నాకే నిర్ణయం తీసుకోవటం ఉత్తమమని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రామకృష్ణా రావు తెలిపారు. కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయికి తగ్గ విలువను, సామాన్యుల పెట్టుబడులకు భరోసాను కల్పించే రెరా ప్రాజెక్ట్‌లలోనే విక్రయాలు చేయాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రాపర్టీల ధరలు తక్కువగా ఉన్నాయని, దీంతో గృహ కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ప్రణాళికబద్ధమైన విస్తరణ, వ్యాపార పెట్టుబడులతో రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయని తెలిపారు. హైదరాబాద్‌లో అధిక శాతం కొనుగోలుదారులు తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు ఉంటారు. వీరికి నిర్ధిష్టమైన వనరులు, రియల్టీ లావాదేవీలపై అవగాహన కాసింత తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో కొనుగోలుదారులు బిల్డర్ల ప్రొఫైల్‌ను పరిశీలించకుండా తక్కువ ధర అనగానే తొందరపడి కొనుగోలు చేస్తుంటారని క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రెరా నమోదిత ప్రాజెక్ట్‌లలో కొంటేనే కస్టమర్ల కష్టార్జితానికి పూర్తి విలువ చేకూరుతుందని పేర్కొన్నారు. యూడీఎస్లో కొంటే కొనుగోలు లేదా సమీకరణ చేసిన స్థల విలువకు ప్రామాణికత ఉండదు జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏ/డీటీసీపీ అనుమతులు ఉండవు. రెరా అథారిటీ వద్ద నమోదు కాదు. స్థలం అమ్మకం అనధికారిక అగ్రిమెంట్ లేదా జీపీఏ ద్వారా చేస్తారు. రెరా లేదా ఇతర సంస్థల నుంచి కొనుగోలుదారులకు రక్షణ ఉండదు. భూ వివాదాలు తలెత్తితే స్థల యజమానిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేటు తక్కువే కానీ సురక్షితం ఏమాత్రం కాదు. రెరాలో కొంటే సేకరణ లేదా కొనుగోలులో స్థల విలువకు ప్రామాణికత ఉంటుంది. అన్ని రకాల ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు ఉంటాయి. రెరాలో నమోదు అవుతుంది, రెరా నంబర్ కూడా కేటాయిస్తారు. అమ్మకం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారమే ఉంటుంది. రెరా అథారిటీలోని పలు నిబంధనలు కస్టమర్లకు రక్షణ కల్పిస్తాయి. ఎలాంటి వివాదాలు తలెత్తినా రెరా అథారిటీ పరిష్కరిస్తుంది. ధర ఎక్కువైనా.. ప్రాపర్టీ మాత్రం సురక్షితం. -
రియల్టీకి జోష్ !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు జూలై–సెప్టెంబర్‌లో 32,358 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 14,415 యూనిట్లు మాత్రమే. ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా ప్రకారం.. హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో డిమాండ్ తిరిగి పుంజుకుంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అమ్ముడైన ఇళ్ల సంఖ్య 19,635 యూనిట్లు. హైదరాబాద్‌లో ఇలా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో విక్రయాలు 2,122 నుంచి 4,418 యూనిట్లకు ఎగబాకాయి. ఇక సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో ఏడు ప్రధాన నగరాల్లో 77,576 ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 52,619 యూనిట్లుగా ఉంది. క్యూ2తో పోలిస్తే క్యూ3లో అమ్మకం కాని ఇళ్లు స్థిరంగా 4.78 లక్షల యూనిట్ల స్థాయిలో ఉన్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకారం.. ఎనమిది ప్రధాన నగరాల్లో గత త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు కోవిడ్ ముందస్తు స్థాయికి చేరాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా చెబుతోంది. 64,010 యూనిట్లు విక్రయం అయ్యాయని వెల్లడించింది. ధరల్లో స్థిరత్వంతోపాటు వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం ఇందుకు కారణమని తెలిపింది. క్రితం ఏడాదితో పోలిస్తే 92% వృద్ధి నమోదైంది. ఏప్రిల్–జూన్‌లో 27,453 యూనిట్లు అమ్ముడయ్యాయని తెలిపింది. ఆఫీస్ స్పేస్ లీజింగ్.. దేశంలో ఎనమిది ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ జూలై–సెప్టెంబర్‌లో 1.25 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. గతేడాది ఇదే కాలంలో ఇది 47 లక్షల చదరపు అడుగులు ఉంది. ప్రధానంగా ఐటీ రంగం కారణంగా ఈ స్థాయి డిమాండ్ వచ్చిందని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. చదవండి :టాప్‌గేర్‌లో హైదరాబాద్ -
Credai: ప్రాపర్టీ షో.. అదిరింది...!
క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షో ముగిసింది. కోవిడ్ సంక్షోభం తర్వాత అతి పెద్ద ప్రాపర్టీ షోగా ఇది నిలిచింది. వందకు పైగా రియల్ ఎస్టేట్, డెవలపర్స్ ఈ షోలో పాల్గొన్నారు. మొదటి షో కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుదుపులకు లోనైంది. ముఖ్యంగా సెకండ్ వేవ్ తర్వాత ఎక్కడా ప్రాపర్టీ షోలు భారీ స్థాయిలో జరగలేదు. అనేక సవాళ్లను అధిగమిస్తూ ఆగస్టు 13,14,15 తేదీల్లో హైటెక్స్‌లో , క్రెడాయ్ హైదరాబాద్ యూనిట్ ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసింది. రియల్ పుంజుకుంటోంది క్రెడాయ్ ప్రాపర్టీ షోకు రెస్పాన్స్ బాగుందని క్రెడాయ్, హైదరాబాద్ యూనిట్ ట్రెజరర్ ఆదిత్య అన్నారు. కోవిడ్ మునుపటి స్థితికి రియల్ ఎస్టేట్ చేరుకుంటుందనే నమ్మకం కలిగిందన్నారు. కొత్తగా ఇళ్లలు కొనాలనుకునే వారి సంఖ్య పెరిగిందని తెలిపారు. మరోవైపు ఆఫీస్ స్పేస్‌లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇన్సెంటీవ్లు ఉండటంతో మార్కెట్ ఆశాజనకంగా ఉందన్నారు. రెస్పాన్స్ బాగుంది ప్రాపర్టీ షో ప్రారంభం కాకుముందు జనాల రెస్సాన్స్ ఎలా ఉంటుందో అనే అనుమానం ఉండేదని, కానీ ఈ షో ప్రారంభమైన తర్వాత అనుమానాలు అన్నీ పటాపంచలైపోయాంటూ తెలిపింది గౌరు డెవలపర్స్‌కి చెందిన కావ్య. కొత్త ఇళ్లులు, స్థలాలు కొనాలనుకునే వారి సంఖ్య పెరిగిందని, మూడు రోజులుగా వస్తున్న వారికి తమ ప్రాజెక్టుల గురించి వివరిస్తున్నామంది. మార్కెట్‌పై అవగాహన దాదాపు పద్దెనిమిది నెలలుగా ఎక్కువ మంది ఇళ్లకే పరిమితయ్యారు. అత్యవసర పనులకే బయటకు వస్తున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయనే దానిపై సరైన అవగాహన ఉండటం లేదు. అయితే క్రెడాయ్ భారీ ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడంతో మార్కెట్‌పై అవగాహన కోసం చాలా మంది వస్తున్నారు. ముఖ్యంగా గృహిణిలు కొత్త ఇళ్ల గురించి ఎక్కువగా వాకాబు చేస్తున్నారు. మొత్తంగా రియల్ ఎస్టేట్ రంగంపై ముసురుకున్న అనుమానాలను క్రెడాయ్ ప్రాపర్టీ షో పటాపంచలు చేసింది. -
రియల్టీలో పెట్టుబడుల సునామీ, రూ.36,500 కోట్లకు..
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత పెట్టుబడులు (ఇనిస్టిట్యూషనల్) ఈ ఏడాది 4 శాతం పెరిగి 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.36,500 కోట్లు)గా ఉండొచ్చని కన్సల్టెన్సీ సంస్థ కొల్లియర్స్ ఇండియా అంచనా వేసింది. 2020లో ఈ రంగంలో సంస్థాగత పెట్టుబడిదారులు 4.8 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ఇనిస్టిట్యూషన్స్ పెట్టుబడులు 2.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2020 మొదటి ఆరు నెలల్లో వచ్చిన గణాంకాలతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్టు కొల్లియర్స్ ఇండియా తెలిపింది. కార్యాలయ సముదాయాలపై ఇన్వెస్ట్ చేసేందుకు సంస్థాగత పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 35 శాతం పెట్టుబడులు కార్యాలయ వసతుల ప్రాజెక్టుల్లోకి వచ్చాయి. అలాగే, పారిశ్రామిక, గోదాముల విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు 775 మిలియన్ డాలర్లు (రూ.5,657 కోట్ల)గా ఉన్నాయి’’ అని కొల్లియర్స్ ఇండియా వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆకర్షణీయమైన విలువలకే ఆస్తులను సొంతం చేసుకునే ఆలోచనతో ఇన్వెస్టర్లు ఉన్నారని తెలిపింది. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య నివాస గృహ ప్రాజెక్టుల్లోకి వచ్చిన సంస్థాగత పెట్టుబడులు కేవలం 4 శాతంగానే ఉన్నాయని పేర్కొంది. లాజిస్టిక్స్, లైఫ్ సైన్సెస్ ల్యాబ్‌లు, డేటా కేంద్రాలకు సంబంధించి రానున్న రోజుల్లో పెట్టుబడులు ప్రోత్సాహకరంగా ఉండొచ్చని అంచనా వేసింది. చదవండి: మీ ఆధార్ బయోమెట్రిక్ సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి -
గృహ అమ్మకాలపై కరోనా దెబ్బ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావం దేశీయ నివాస విభాగం మీద గట్టిగానే పడింది. ఈ ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాలో గృహాల అమ్మకాలు, ప్రారంభాలు రెండింట్లోనూ క్షీణత నమోదైంది. ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు 47 శాతం క్షీణించి 1.38 లక్షలకు చేరాయి. అలాగే కొత్త గృహాల ప్రారంభాలు 46 శాతం క్షీణించి 1.28 లక్షలకు చేరాయి. 2019లో అమ్మకాలు 2.61 లక్షల యూనిట్లు కాగా.. ప్రారంభాలు 2.37 లక్షలుగా ఉన్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. 2019లో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) 6,48,400 కాగా.. 2020 నాటికి 2 శాతం తగ్గి 6,38,020 యూనిట్లకు చేరాయి. కోవిడ్–19 వైరస్ ఊహిం చని విపత్కర సంవత్సరంగా నిలిచిందని అనరాక్ చైర్మన్ అనూజ్ పురీ చెప్పారు. డిస్కౌంట్లు, ఆఫర్లు, గృహరుణ వడ్డీ రేట్ల తగ్గింపు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీ తగ్గింపు వంటివి గృహాల అమ్మకాల్లో కాసింత సానుకూలత నెలకొందని.. గత రెండు త్రైమాసికాల్లో పరిస్థితుల్లో కాసింత సానుకూల వాతావరణం కనిపిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో... హైదరాబాద్‌లో గతేడాది 16,590 గృహాలు అమ్ముడుపోగా.. ఈ ఏడాది 48 శాతం క్షీణించి 8,560 గృహాలకు పడిపోయాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలన్నీ కొత్త గృహాల ప్రారంభంలో క్షీణత నమోదైతే ఒక్క హైదరాబాద్‌లోనే వృద్ధి నమోదయింది. గతేడాది నగరంలో కొత్తగా 14,840 ఇళ్లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది 42 శాతం వృద్ధితో 21,110 యూనిట్లకు పెరిగాయి. నగరాల వారీగా అమ్మకాలు... ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో అత్యధిక అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది ఇక్కడ 44,320 గృహాలు విక్రయమయ్యాయి. గతేడాది ఎంఎంఆర్‌లో 80,870 యూనిట్లు (45 శాతం క్షీణత) అమ్ముడుపోయాయి. బెంగళూరులో గతేడాది 50,450 గృహాలు కాగా.. ఇప్పుడవి 51 శాతం తగ్గి 24,910 యూనిట్లకు చేరాయి. పుణేలో 40,790 నుంచి 23,460 (51 శాతం), ఢిల్లీ–ఎన్సీఆర్లో 46,920 నుంచి 23,210 (42 శాతం), చెన్నైలో 11,820 నుంచి 6,740 (43 శాతం), కోల్‌కతాలో 13,930 నుంచి 7,150 (49 శాతం) తగ్గాయి. ఇతర నగరాల్లో లాంచింగ్స్.. గతేడాది ఢిల్లీ–ఎన్సీఆర్లో కొత్తగా 35,280 గృహాలు ప్రారంభం కాగా.. 2020 నాటికి 47 శాతం క్షీణించి 18,530లకు చేరాయి. ఎంఎంఆర్‌లో 77,990ల నుంచి 30,290లకు (61 శాతం), బెంగళూరులో 39,930 నుంచి 21,420లకు (46 శాతం), పుణేలో 46,110 నుంచి 23,920లకు (48 శాతం), చెన్నైలో 13,000 నుంచి 9,170లకు (29 శాతం), కోల్‌కతాలో 9,420 నుంచి 63 శాతం తగ్గి 3,530లకు తగ్గాయి. స్టాంప్ డ్యూటీ తగ్గిస్తేనే... న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో తగ్గిన గృహాల అమ్మకాలు తిరిగి పుంజుకోవాలంటే స్టాంప్ డ్యూటీ తగ్గించడమే ప్రత్యామ్నాయమని నరెడ్కో ప్రెసిడెంట్ నిరంజన్ హిర్‌నందానీ సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని తగ్గించడంతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో కోవిడ్ సమయంలోనూ రికార్డ్ స్థాయిలో విక్రయాలు జరిగాయని ఉదహరించారు. ఇతర రాష్ట్రాలు కూడా స్టాంప్ డ్యూటీని తగ్గించాలని.. ఆయా రాష్ట్ర నరెడ్కో చాప్టర్లు ఈ అంశాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కేంద్రం అద్దె గృహాలను ప్రోత్సహించాలని, గృహ రుణ వడ్డీని తగ్గించడంతో పాటు ఇన్వెంటరీ గృహాల మీద పన్నును మినహాయించాలని కోరారు. అఫర్డబుల్ అండ్ మిడ్–సైజ్ హౌసింగ్ (ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్) కోసం ప్రత్యేకంగా రూ.25 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని పేర్కొ న్నారు. ఇలాంటి ఫండ్సే సుమారు నాలుగైదు కావాలని.. బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలతో కలిసి ప్రభుత్వం రూ.1,25,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. -
ఇమామీ దూకుడు- ప్రెస్టేజ్ హైజంప్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో అంచనాలకు అనుగుణమైన ఫలితాలు ప్రకటించడంతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ లిమిటెడ్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క రుణ భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా ఆస్తుల విక్రయ సన్నాహాల్లో ఉన్నట్లు వెలువడిన అంచనాలతో రియల్టీ కంపెనీ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఇమామీ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో ఇమామీ లిమిటెడ్ నికర లాభం స్వల్ప వృద్ధితో రూ. 40 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం 26 శాతం క్షీణించి రూ. 481 కోట్లను తాకింది. కోవిడ్ నేపథ్యంలోనూ ఇబిటా మార్జిన్లు 4.9 శాతం బలపడి 25.5 శాతానికి చేరాయి. ఈ కాలంలో 12 కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా రూ. 192 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను పూర్తిచేసినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఇమామీ లిమిటెడ్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 19 శాతం దూసుకెళ్లింది. రూ.306 వద్ద ట్రేడవుతోంది. ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్.. కంపెనీకి చెందిన లీజు ఆదాయ ఆస్తులను కొనుగోలు చేయనున్నట్లు వెలువడిన వార్తలు ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నాయి. దీంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ప్రెస్టేజ్ ఎస్టేట్స్ షేరు 5 శాతం( రూ. 10.5) ఎగసి రూ. 236 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 238ను అధిగమించింది. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్‌కు చెందిన అద్దె ఆదాయ ఆస్తులను 170 కోట్ల డాలర్లకు(రూ. 12,745 కోట్లు) బ్లాక్‌స్టోన్ గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. -
విజయాలు.. వివాదాలతో సహజీవనం!
‘కఠిన కాలాన్ని ఎదుర్కోవడం అద్భుతమైన అనుభవం. జీవితంలో ఒక్కసారైనా ఆ అనుభవం పొందాలి’– అమెరికా 45వ అధ్యక్షుడైన డొనాల్డ్ జాన్ ట్రంప్‌నకు ఇష్టమైన సొంత కొటేషన్ ఇది. ట్రంప్ జీవితాన్ని కొంతవరకు ఈ కొటేషన్ ప్రతిబింబిస్తుంది. ట్రంప్ జీవితంలో విజయాలు, వైఫల్యాలు, వివాదాలు.. ప్రశంసలు, విమర్శలు.. అవహేళనలు, ఆత్మీయతలు.. అన్నీ కనిపిస్తాయి. అదీ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అన్నింటినీ ఆయన ఒక్కలాగే తీసుకోవడం కూడా కనిపిస్తుంది. ‘డబ్బు కోసం నేను పనిచేయడం లేదు. నా దగ్గర కావల్సినంత డబ్బు ఉంది. అవసరమైన దానికన్నా ఎక్కువే ఉంది. పని చేయడం కోసమే పని చేస్తున్నాను. వ్యాపారం నా కళాత్మక విధానం’ అంటారు ట్రంప్. తండ్రి ఫేమస్ రియల్టర్ డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ఫ్రెడెరిక్ ట్రంప్, మేరీ మెక్లియడ్ దంపతులకు 1946 జూన్ 14 వ తేదీన జన్మించారు. ఫ్రెడెరిక్ ట్రంప్ క్వీన్స్‌లో పేరెన్నిక గన్న బిల్డర్, రియల్టర్. క్వీన్స్, స్టేటెన్ ఐలాండ్, బ్రూక్లిన్ల్లో మధ్యతరగతి వాసులకు చవకగా అపార్ట్మెంట్స్ నిర్మించి ఇచ్చేవాడు. మేరీ కుటుంబం స్కాట్లాండ్ నుంచి వలస వచ్చింది. ఫ్రెడ్, మేరీల వివాహం 1936లో జరిగింది. వారి ఐదుగురు పిల్లల్లో డొనాల్డ్ ట్రంప్ నాలుగవ వాడు. ఫోర్డమ్ యూనివర్సిటీ, వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్, న్యూయార్క్ మిలటరీ అకాడమీల్లో ట్రంప్ విద్యనభ్యసించారు. మిలటరీ అకాడెమీలో స్టార్ అథ్లెట్‌గా, విద్యార్థి నాయకుడిగా ట్రంప్ నిలిచారు. ఆ తరువాత తన తండ్రి వారసత్వంగా రియల్టీ బిజినెస్‌లోకి దిగారు. కొద్ది కాలంలోనే అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. మన్‌హటన్‌లో భారీ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేశారు. 1980లో న్యూయార్క్‌లో ప్రారంభించిన ‘గ్రాండ్ హయత్ న్యూయార్క్’ ప్రాజెక్టు ఆయనకు డెవలపర్‌గా గొప్ప పేరు తీసుకువచ్చింది. రియాలిటీ టీవీ స్టార్ గానూ ట్రంప్ ప్రఖ్యాతి గాంచారు. ‘ది అప్రెంటిస్’ పేరుతో ఆయన ప్రారంభించిన రియాలిటీ షో బాగా పాపులర్ అయింది. ఆ తరువాత రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ట్రంప్.. రిపబ్లికన్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. 2015లో మెజారిటీ ప్రైమరీల్లో, కాకస్‌ల్లో విజయం అనంతరం రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా 2016 ఎన్నికల బరిలో నిలిచి, గెలిచారు. సోదరుడి ప్రభావం మద్యం వ్యసనానికి లోనై చనిపోయిన తన సోదరుడు ఫ్రెడ్ ట్రంప్ జూనియర్ ప్రభావం డొనాల్డ్ ట్రంప్‌పై ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం ట్రంప్ పలు సందర్భాల్లో స్వయంగా చెప్పారు. సోదరుడి మరణం తరువాత తాను ఆల్కహాల్ ముట్టనని, డ్రగ్స్ తీసుకోనని ట్రం ప్ శపథం చేశారు. మతపరంగా, ట్రంప్‌ను ఆయన తల్లి ప్రెస్బిటేరియన్‌గా పెంచినప్పటికీ.. తనను తాను మెయిన్‌లైన్ ప్రొటెస్టెంట్నని ఆయన చెప్పుకుంటారు. ట్రంప్ వ్యాపారాల్లో ముఖ్యమైనవి ట్రంప్ ఆర్గనైజేషన్, అట్లాంటిక్‌లో కేసినోలు, టీవీ షోలు. ద ఆర్ట్ ఆఫ్ ద డీల్ 1987లో టోనీ ష్వాజ్తో కలిసి ట్రంప్ ‘ద ఆర్ట్ ఆఫ్ ద డీల్’ అనే పుస్తకం రాశారు. అందులో తన వ్యాపార విజయరహస్యాలను వివరించారు. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్‌లో ఆ పుస్తకం నిలిచింది. కానీ, ఎన్ని కాపీలు అమ్ముడయ్యాయనే విషయంలో కచ్చితమైన సమాచారం లేదు. ‘క్రిపుల్డ్ అమెరికా: హౌ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనే పుస్తకం కూడా ట్రంప్ రాశారు. 2005లో ఆయన ‘ట్రంప్ యూనివర్సిటీ’ని స్థాపించారు. అందులో రియల్ ఎస్టేట్ వ్యాపార మెళకువలను కోర్సులుగా నేర్పించేవారు. ఇవానా.. మేపుల్స్.. మెలానియా ట్రంప్ మొదట 1977లో ఇవానాను వివాహం చేసుకున్నారు. ఇవానా అప్పటికే ప్రముఖ ఫ్యాషన్ మోడల్. వారికి ముగ్గురు పిల్లలు. వారు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా, ఎరిక్. 1992లో ట్రంప్, ఇవానా విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత, 1993లో ట్రంప్ మార్లా మేపుల్స్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆమె నటి. వారికి టిఫానా అనే కూతురు ఉంది. 1999లో మేపుల్స్‌కు 20 లక్షల డాలర్ల పరిహారం చెల్లించి ట్రంప్ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత 2005లో మెలానియాను ట్రంప్ వివాహమాడారు. ఆమె స్లొవేనియాకు చెందిన మాజీ మోడల్. ట్రంప్ కన్నా వయసులో 23 ఏళ్లు చిన్న. ట్రంప్, మెలానియాల సంతానం బారన్ విలియమ్. డొనాల్డ్ ట్రంప్ పిల్లల్లో డొనాల్డ్ జూనియర్, ఎరిక్‌లు వారి కుటుంబ వ్యాపార సామ్రాజ్యం ‘ట్రంప్ ఆర్గనైజేషన్’లో వైస్ ప్రెసిడెంట్స్‌గా ఉన్నారు. -
రియల్టీ కుబేరులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో అత్యంత ధనికుడిగా మాక్రోటెక్ డెవలపర్స్ (గతంలో లోధా డెవలపర్స్) అధినేత మంగళ్ ప్రభాత్ లోధా నిలిచారు. ఈయన సంపద విలువ రూ.31,960 కోట్లు. దేశంలోని రియల్టీ కుబేరుల్లో లోధా వరుసగా రెండు సార్లు అగ్రస్థానంలో నిలిచినట్లు ‘హురున్– గ్రోహే’ సంస్థలు ఇండియాపై సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి. లోధా ప్రస్తుతం బీజేపీ ముంబై శాఖ అధ్యక్షుడు కూడా. గతేడాదితో పోలిస్తే లోధా కుటుంబ సంపద 18 శాతం వృద్ధి చెందింది. 100 మందితో కూడిన ఈ జాబితాలో మిగతా 99 మంది రియల్టీ టైకూన్స్ సంపదలో లోధా కుటుంబ సంపద వాటా 12 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలియజేసింది. 100 మంది సంపద 2,77,080 కోట్లు.. దేశంలో అగ్రస్థానంలో ఉన్న 100 మంది రియల్టీ టైకూన్స్ సంపద విలువ రూ.2,77,080 కోట్లుగా అంచనా. గతేడాదితో పోలిస్తే ఇది 17 శాతం వృద్ధి చెందినట్లు ‘హురున్– గ్రోహే ఇండియా ద రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్– 2019’ నివేదిక తెలియజేసింది. ఈ వంద మంది జాబితాలో 37 మంది ముంబైవాసులే. ఢిల్లీలో 19 మంది, బెంగళూరులో 19 మంది ఉన్నారు. ఈ పారిశ్రామికవేత్తల సగటు వయసు 59 ఏళ్లు. ఆరుగురు మాత్రం 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు. ముగ్గురు 80 ఏళ్లు పైబడిన వారు. 8 మంది మహిళలకు చోటు.. ఈ జాబితాలో తొలిసారి 8 మంది మహిళలకు స్థానం దక్కింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ స్మిత వీ స్రిశ్న మహిళల్లో టాప్‌లో ఉండగా.. మొత్తం జాబితాలో 14వ స్థానంలో నిలిచారు. ఈమె సంపద రూ.3,560 కోట్లు. తర్వాతి స్థానాల్లో డీఎల్ఎఫ్కు(కమర్షియల్) చెందిన రేణుక తల్వార్(సంపద రూ.2,590 కోట్లు) పాయ్ సింగ్ (రూ.2,370 కోట్లు), ఎమ్మార్ ఈజీఎఫ్ ల్యాండ్ శిల్పా గుప్తా (రూ.730 కోట్లు), సూపర్‌టెక్ సంగీత అరోరా (రూ.410 కోట్లు), గోపాలన్ ఎంటర్ప్రైజెస్ ఎం వసంత కుమారీ (రూ.310 కోట్లు), వాటికా కమర్షియల్ విభాగం కాంచన భల్లా (రూ.300 కోట్లు) నిలిచారు. మై హోమ్.. యంగ్ టైకూన్స్ దేశంలోనే యువ ధనిక రియల్టీ టైకూన్స్గా హైద రాబాద్లోని మై హోమ్ గ్రూప్‌నకు చెందిన జూపల్లి రామురావు, జూపల్లి శ్యామ్‌రావు చోటు దక్కించుకున్నారు. వీళ్ల వయ స్సు 33 ఏళ్లు. వీరి సంపద విలువ రూ.740 కోట్లు. ఈస్ట్ ఇండియా హోటల్స్‌కు చెందిన పృథ్వీరాజ్ సింగ్ ఒబెరాయ్... వృద్ధ రియల్టీ టైకూన్‌గా నిలిచారు. ఈయన వయస్సు 90 ఏళ్లు. ఈయన సంపద రూ.3,670 కోట్లు. రామురావు, శ్యామ్‌రావు -
స్థిరాస్తి కొంటున్నారా?
రూ. 50 లక్షలు దాటితే టీడీఎస్ తప్పనిసరి గడిచిన పదేళ్లుగా భారత్‌లో రియల్టీ వ్యాపారం ఊపందుకోవడంతో... భూముల ధరలూ భారీగా పెరిగాయి. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఈ దామాషా ప్రకారం భూముల విలువలు పెరగలేదు. ఇది రియల్టీలో నల్లధనం సమస్యను తీవ్రం చేసింది. ఇలాంటి పరిస్థితిని కొంతమేరకు నివారించడానికి కేంద్రం 1961 ఆదాయపు పన్ను (ఐటీ) చట్టంలో 194 ఐఏ సెక్షన్‌ను తీసుకొచ్చింది. ఇది 2013 జూన్ నుంచీ అమల్లోకి వచ్చింది. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి లావాదేవీ విలువ రూ.50 లక్షలు, ఆపై ఉంటే ఒకశాతం టీడీఎస్‌ను (మూలం వద్ద పన్ను మినహాయింపు) ఈ సెక్షన్ నిర్దేశిస్తోంది. తేలిగ్గా టీడీఎస్... ఈ సెక్షన్ ప్రకారం, రూ.50 లక్షలకు పైబడి స్థిరాస్తిని కొనుగోలు చేసేవారు ట్యాన్‌కు (ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నంబర్) దరఖాస్తు చేసి, రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఉన్న కొన్ని ఇబ్బందుల దృష్ట్యా పన్ను చెల్లింపుదార్లకు ఒక వెసులుబాటు ఇచ్చారు. దీని ప్రకారం పన్నును డిపాజిట్ చేసి, ‘పాన్’ ద్వారా రిటర్న్స్ దాఖలు చేసే సౌలభ్యాన్ని కల్పించారు. అమ్మకందారుకు పాన్ అవసరం.. ఇక్కడ టీడీఎస్ చెల్లింపులకు సంబంధించి బాధ్యత ఎవరిదన్న సందేహం తలెత్తవచ్చు. స్థిరాస్తి కొనుగోలు చేసిన వ్యక్తిదే ఈ బాధ్యత. లావాదేవీ విలువలో ఒక శాతం టీడీఎస్‌గా చెల్లించాల్సి ఉన్నప్పటికీ... అమ్మకందారుకు పాన్ లేకపోతే మాత్రం ‘డిడక్షన్ రేటు’ 20 శాతంగా ఉంటుంది. అమ్మకందారు-కొనుగోలు దారు పరస్పరం నిర్ణయించుకున్న, లేదా ప్రభుత్వం నిర్ణయించిన విలువను ‘లావాదేవీ విలువ’గా పరిగణిస్తారు. రుణం పొందిన లేదా లావాదేవీ సొమ్ము చెల్లించిన తేదీ (ఏది మంచిదైతే అది) నుంచీ టీడీఎస్ అమలవుతుంది. ఆలస్యం అయితే... నెలకు ఒకశాతం వడ్డీ పడుతుంది. అలాగే నెలకు ఒకశాతం లేట్ పేమెంట్ పన్ను భారమూ పడుతుంది. చెల్లింపులు ఇలా... టీడీఎస్ జరిగిన 7 రోజుల నుంచి నెలరోజుల లోపు ప్రభుత్వానికి దీన్ని జమ చేయాల్సి ఉంటుంది. 26 క్యూబీ ఫారమ్ (రిటర్న్కమ్ చలాన్) ద్వారా ఆన్లైన్ ట్యాక్స్ పేమెంట్ జరపవచ్చు. ఠీఠీఠీ.్టజీటఛీ.ఛిౌఝ వెబ్సైట్లో (టీడీఎస్ ఆన్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ) ఈ ఫామ్ దొరుకుతుంది. పన్ను చెల్లింపులకు అలాగే ట్యాక్స్ డిడక్ట్, చెల్లింపులకు సంబంధించి రిటర్న్ ఫైలింగ్‌కు... రెండు విధాలా ఈ ఫామ్ ఉపయోగపడుతుంది. డిడక్టయిన పన్ను డిపాజిట్, 26క్యూబీ ద్వారా రిటర్న్ ఫైలింగ్ పూర్తయిన తరువాత 15 రోజులలోపు ఆస్తి కొనుగోలుదారు ఫారమ్ 16బీలో టీడీఎస్ సర్టిఫికెట్‌ను జారీచేయాలి. 16బీ ఫామ్ ఠీఠీఠీ.్టఛీటఛిఞఛి.జౌఠి.జీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 26క్యూబీ అకనాలెడ్జ్మెంట్ ఫామ్‌ను ఆస్తి రిజిస్ట్రేషన్, బదిలీ సమయంలో సమర్పించాలి. ఈ ఆన్లైన్ ప్రక్రియను సొం తంగా చేసుకోలేకపోతే, వృత్తి నిపుణుల సహాయాన్ని స్వీకరిస్తే బాగుంటుంది. 194 ఐఏ సెక్షన్‌పై ఇంకేమైనా సందేహాలు ఉంటే... మైఐటీరిటర్న్ మొబైల్ యాప్ ద్వారా ‘ఆస్క్ ఏ క్వశ్చన్’ సేవలను ఉచితంగా పొందవచ్చు. - అమూల్ మిశ్రా, మై ఐటీ రిటర్న్ డాట్‌కామ్ -
రియల్టీ బిజినెస్‌లో బ్లాక్‌మనీ అధికం
ప్రభుత్వానికి ఐసీఏఐ నివేదిక ముంబై: అత్యధిక శాతం నల్లధనం (బ్లాక్‌మనీ) రియల్టీ రంగంలోకి ప్రవహిస్తున్నదని దేశీ చార్టర్డ్ అకౌంటెంట్ల సంస్థ(ఐసీఏఐ) ప్రభుత్వానికి నివేదించింది. ఇలాంటి చట్టవిరుద్ధ నిధుల్లో అధిక భాగం రియల్టీ బిజినెస్‌లోకి మళ్లుతున్నాయని అభిప్రాయపడింది. వెరసి వీటికి అడ్డుకట్ట వేసే బాటలో వెంటనే తగు చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఈ విషయాలను ఐసీఏఐ నివేదించింది. దేశీ రియల్టీ రంగ కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు వీలుగా వెంటనే తగిన చర్యలను చేపట్టమంటూ సిఫారసు చేసింది. తద్వారా నల్లధన ప్రవాహానికి చెక్ పెట్టవచ్చునని పేర్కొంది. ఇప్పటికే రియల్టీ రంగంలో భారీ స్థాయిలో నల్లధనం పేరుకుపోయిందని ఐసీఏఐ కేంద్ర కమిటీ సభ్యులు తరుణ్ ఝియా వ్యాఖ్యానించారు. ఈ రంగాన్ని కేవలం నియమాలు, నిబంధనలతోనే నియంత్రించలేమని, డిమాండ్ సరఫరాల మధ్య అంతరాలపై సైతం దృష్టిపెట్టాల్సి ఉన్నదని సూచించారు. -
ఎల్ అండ్ టీ లాభాలకు డిజిన్వెస్ట్‌మెంట్ జోష్
ముంబై: ఇంజనీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్అండ్ టీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2013-14, క్యూ1)లో రెట్టింపునకుపైగా నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.967 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.459 కోట్లు మాత్రమే. అయితే, క్యూ1లో డిజిన్వెస్ట్‌మెంట్ రూపంలో రూ.1,392 కోట్ల రాబడులు రావడంతో లాభాలు ఈ స్థాయిలో పెరిగేందుకు దోహదం చేసిందని కంపెనీ పేర్కొంది. గ్రూప్ రియల్టీ వ్యాపార అనుబంధ కంపెనీలు(సబ్సిడరీలు), జాయింట్ వెంచర్ కింద ఉన్న అభివృద్ధి ప్రాజెక్టుల్లో వాటాలను ఏప్రిల్-జూన్ వ్యవధిలో విక్రయించడం ద్వారా రూ.1,382 కోట్ల అదనపు నిర్వహణ ఆదాయం సమకూరినట్లు తెలిపింది. కాగా, క్యూ1లో కంపెనీ నికర ఆదాయం రూ.18,975 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.17,241 కోట్లుగా ఉంది. 10 శాతం వృద్ధి నమోదైంది. ఆర్డర్ల జోరు... తొలి త్రైమాసికంలో కంపెనీ రూ.33,408 కోట్ల విలువైన ఆర్డర్లను చేజిక్కించుకుంది. ఇందులో విదేశీ ఆర్డర్ల విలువ రూ.14,574 కోట్లు కావడం గమనార్హం. ప్రధానంగా మౌలిక సదుపాయాలు, హైడ్రోకార్బన్, హెవీ ఇంజనీరింగ్ విభాగాల్లో ఆర్డర్లను దక్కించుకున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఈ ఏడాది జూన్ 30 నాటికి గ్రూప్ ఆర్డర్ బుక్ విలువ రూ.1,95,392 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. గతేడాది ఇదేకాలంతో పోలిస్తే 13 శాతం పెరిగింది. ఇందులో విదేశీ కాంట్రాక్టుల వాటా 26 శాతంగా ఉంది. క్యూ1లో దేశీయంగా సెంటిమెంట్ కొంత మెరుగైనప్పటికీ.. వ్యాపార పరిస్థితులు, పెట్టుబడులు ఇంకా మందకొడిగానే కొనసాగాయని ఎల్అండ్టీ అభిప్రాయపడింది. అధిక వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణం వంటివి ప్రతికూలాంశాలుగా నిలిచాయని పేర్కొంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం పెట్టుబడుల పెంపునకు, అదేవిధంగా విధానపరంగా చేపడుతున్న చర్యల ప్రభావం రానున్నరోజుల్లో ప్రతి ఫలించే అవకాశం ఉందని పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో సోమవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ధర 0.7 శాతం క్షీణించి రూ.1,645 వద్ద స్థిరపడింది.