ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో అంచనాలకు అనుగుణమైన ఫలితాలు ప్రకటించడంతో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఇమామీ లిమిటెడ్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క రుణ భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా ఆస్తుల విక్రయ సన్నాహాల్లో ఉన్నట్లు వెలువడిన అంచనాలతో రియల్టీ కంపెనీ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
ఇమామీ లిమిటెడ్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో ఇమామీ లిమిటెడ్ నికర లాభం స్వల్ప వృద్ధితో రూ. 40 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం 26 శాతం క్షీణించి రూ. 481 కోట్లను తాకింది. కోవిడ్ నేపథ్యంలోనూ ఇబిటా మార్జిన్లు 4.9 శాతం బలపడి 25.5 శాతానికి చేరాయి. ఈ కాలంలో 12 కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా రూ. 192 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను పూర్తిచేసినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఇమామీ లిమిటెడ్ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 19 శాతం దూసుకెళ్లింది. రూ.306 వద్ద ట్రేడవుతోంది.
ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్
పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్.. కంపెనీకి చెందిన లీజు ఆదాయ ఆస్తులను కొనుగోలు చేయనున్నట్లు వెలువడిన వార్తలు ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ప్రెస్టేజ్ ఎస్టేట్స్ షేరు 5 శాతం( రూ. 10.5) ఎగసి రూ. 236 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 238ను అధిగమించింది. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్‌కు చెందిన అద్దె ఆదాయ ఆస్తులను 170 కోట్ల డాలర్లకు(రూ. 12,745 కోట్లు) బ్లాక్‌స్టోన్ గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment