న్యూఢిల్లీ: హౌసింగ్ మార్కెట్‌పట్ల ఇన్వెస్టర్లు తిరిగి ఆసక్తి చూపుతున్నట్లు ఫిక్కీ–అనరాక్ చేపట్టిన సర్వే తెలియజేసింది. సర్వేలో 36 శాతంమంది పెట్టుబడి ఆలోచనతోనే ఇళ్ల కొనుగోలు కోసం చూస్తున్నట్లు వెల్లడించారు. ‘ఫిక్కీ–అనరాక్ కన్జూమర్ సెంటిమెంట్ సర్వే 2023 ద్వితీయార్ధం’ పేరుతో నిర్వహించిన రియల్టీ సదస్సులో సర్వేను విడుదల చేశారు. సర్వే ప్రకారం కొనుగోలుదారులు భారీ గృహాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.
అంతేకాకుండా కొత్తగా ప్రవేశపెడుతున్న ప్రాజెక్టులలో ఫ్లాట్ల కొనుగోలుకీ ఆసక్తి చూపుతున్నారు. కోవిడ్–19 సవాళ్లు, వినిమయ ఆదాయం పుంజుకోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ సంప్రదాయానికి తెరలేవడం వంటి అంశాలు విశాలమైన గృహాలకు డిమాండ్‌ను పెంచుతున్నట్లు ఫిక్కీ రియల్టీ కమిటీ చైర్మన్ రాజ్ మెండా పేర్కొన్నారు. వెరసి భారీ ఇళ్లు, విలాసవంత గృహాలకు దేశవ్యాప్తంగా గిరాకీ కనిపిస్తున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా అద్దె ఇళ్లకు బదులుగా సొంత గృహాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు.
ధరలు పెరిగినా..
ఇటీవల ధరలు పెరిగినప్పటికీ సర్వేలో పాల్గోన్న 50 శాతంమంది మూడు పడకగదుల(3బీహెచ్‌కే) గృహాలకు, 38 శాతంమంది 2బీహెచ్‌కే ఇళ్లకు ఆసక్తి ప్రదర్శించినట్లు అనరాక్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు. 2020 ద్వితీయార్ధంతో పోలిస్తే 2023 ద్వితీయార్ధంలో పెట్టుబడి యోచనతో ఇళ్ల కొనుగోలుకి ఆసక్తి చూపినవారు 26 శాతం నుంచి 36 శాతానికి పెరిగినట్లు వెల్లడించారు.
వెరసి రియల్ ఎస్టేట్ లాభదాయక పెట్టుబడి అవకాశంగా భావిస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రాపర్టీ మార్కెట్ భారీ లాభాలకు అవకాశాలు కలి్పంచనున్నట్లు అత్యధిక శాతంమంది వ్యక్తిగత ఇన్వెస్టర్లు విశ్వసిస్తున్నట్లు వివరించింది. దీనికితోడు భారీ సంస్థలు, లిస్టెడ్ కంపెనీల నుంచి కొత్త ప్రాజెక్టులు పెరగడంకూడా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేసింది. ఫలితంగా గృహ కొనుగోలుదారులకు విశ్వాసం పెరుగుతున్నదని, ఇది హౌసింగ్ మార్కెట్ బలపడేందుకు దోహదం చేస్తున్నదని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment