దేశంలో రియల్‌ఎస్టేట్ రంగానికి వైభవం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది.
మధ్యతరగతి గృహ కొనుగోలుదారులకు స్థోమతను పెంచేలా రూ. 12 లక్షలు.. స్టాండర్డ్ డిడక్షన్‌లతో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుందని, హౌసింగ్ డిమాండ్, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను పెంచుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు.
"కొత్త పన్ను నిర్మాణం మధ్యతరగతి పన్నులను గణనీయంగా తగ్గిస్తుంది. వారి చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండేలా చేస్తుంది. గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడిని పెంచుతుంది" అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రియల్ ఎస్టేట్‌కు తాజా బడ్జెట్‌లో ఎలాంటి నిర్ణయాలు ప్రకటించారో ఇప్పుడు చూద్దాం..
నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో లక్ష ఇళ్లను పూర్తి చేసేందుకు స్వామి (SWAMIH ) ఫండ్-2ను ప్రభుత్వం ప్రకటించింది. 2025 బడ్జెట్‌లో అదనంగా లక్ష ఇళ్ల నిర్మాణం కోసం కొత్త స్వామి ఫండ్ 2కి రూ.15,000 కోట్ల కేటాయింపును ప్రకటిచింది. దీంతో చాలా కాలంగా ఆలస్యమవుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో ఇళ్లు కొనుగోలుచేసిన వేలాది మందికి ఉపశమనం కలగనుంది.
స్వామి స్కీమ్ కింద ప్రస్తుతం ఉన్న 50,000 నివాస యూనిట్లు పూర్తికావడం, మరో 40,000 పైప్‌లైన్‌లో ఉండటం సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వ గట్టి ప్రయత్నాన్ని తెలియజేస్తోందని నిపుణులు చెబుతున్నారు.
అద్దె ఆదాయంపై వార్షిక టీడీఎస్ పరిమితిని ప్రస్తుత రూ. 2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అద్దెపై వార్షిక టీడీఎస్ పరిమితిని రూ.2.40 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచడం వలన చిన్న పన్ను చెల్లింపుదారులు, భూస్వాములు కూడా గణనీయంగా ప్రయోజనం పొందుతారని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు.
ఇన్వెస్టర్లు ఇప్పుడు కేవలం ఒకటి కాకుండా రెండు స్వీయ-ఆక్రమిత ఆస్తులకు నిల్ వాల్యుయేషన్‌ను క్లెయిమ్ చేయవచ్చు. ఇది రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడికి అనుకూలమైన చర్య.
పట్టణ మౌలిక సదుపాయాలను పెంచేందుకు ప్రభుత్వం రూ.1 లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుంది. అర్బన్ డెవలప్‌మెంట్ ఫండ్ ఏర్పాటు వల్ల మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, రియల్ ఎస్టేట్ సామర్థ్యం పుంజుకుంటుందని, నగరాలు ప్రధాన వృద్ధి కేంద్రాలుగా మారుతాయని నిపుణులు తెలిపారు.
ప్రపంచ వ్యాపార కేంద్రంగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేస్తూ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCC)ను ఆకర్షించడానికి, ప్రోత్సహించడానికి రాష్ట్రాలకు సహాయపడే జాతీయ మార్గదర్శక ఫ్రేమ్‌వర్క్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. పెరుగుతున్న దేశ ఆర్థిక ప్రభావం దృష్ట్యా ఈ చర్య బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పూణె, చెన్నై వంటి ప్రధాన మెట్రోలతో పాటు టైర్-II, టైర్-III నగరాల్లో ఆఫీస్ స్పేస్ డిమాండ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025-26 ముఖ్యాంశాలు
Comments
Please login to add a commentAdd a comment