కొత్త బిజినెస్‌లోకి అనన్య బిర్లా: ఇషా అంబానీకి పోటీ!? | Ananya Birla Ventures into Beauty and Personal Care Business | Sakshi
Sakshi News home page

కొత్త బిజినెస్‌లోకి అనన్య బిర్లా: ఇషా అంబానీకి పోటీ!?

Published Thu, Feb 6 2025 2:54 PM | Last Updated on Thu, Feb 6 2025 4:09 PM

Ananya Birla Ventures into Beauty and Personal Care Business

అందానికి ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో.. చాలామంది ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు భారతీయ ధనవంతులలో ఒకరు.. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ 'కుమార్ మంగళం బిర్లా' పెద్ద కుమార్తె 'అనన్య బిర్లా' (Ananya Birla) చేరనున్నారు. ఈమె బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు.

ఫిబ్రవరి 5న, అనన్య బిర్లా ఒక బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించాలనే తన ప్రణాళికలను వెల్లడించింది. ఇది టాటాస్, హిందుస్తాన్ యూనిలీవర్ (HUL), లోరియల్‌ (L'Oréal) వంటి వాటితో పాటు ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ 'తిరా'కు కూడా పోటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

భారతదేశంలో అందానికి సంబంధించిన ఉత్పత్తుల వినియోగం పెరుగుతోంది. కాబట్టి ఈ రంగం ఏటా 10-11 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ఇది 2028 నాటికి 34 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. దీనిని దృష్టిలో ఉంచుకుని మేకప్, సువాసనలతో సహా అన్ని విభాగాలలో వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని.. దశలవారీగా తమ వ్యాపారం ప్రారంభమవుతుందని అనన్య బిర్లా వెల్లడించారు.

అనన్య బిర్లా ప్రారంభించనున్న వెంచర్ పేరు, అది ఏ బ్రాండ్స్ అందిస్తుందనే విషయాలు అధికారికంగా వెల్లడికాలేదు.  ప్రపంచ స్థాయి ఉత్పత్తులను భారత మార్కెట్‌కు తీసుకురావడం లక్ష్యంగా ఈ వెంచర్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈమె ప్రారంభించనున్న వ్యాపారానికి బాలీవుడ్ నటి 'జాన్వీ కపూర్' బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం.

అనన్య బిర్లా
అనన్య బిర్లా.. ఆదిత్య బిర్లా గ్రూప్‌ అధినేత, దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన కుమార మంగళం బిర్లా కుమార్తె. సాంప్రదాయ వ్యాపారాలను విడిచిపెట్టి తనకంటూ సొంత మార్గాన్ని ఎంచుకుంది. ఒక్క బిజినెస్‌లోనే కాకుండా వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సింగర్, రైటర్ కూడా.

అనన్య బిర్లా ముంబైలోని అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది. ఆ తరువాత యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఉన్నత చదువులు చదివింది. చదువు పూర్తయిన తరువాత ప్రారంభించిన 'స్వతంత్ర మైక్రోఫైనాన్స్' సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అల్పాదాయ వర్గాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సేవలను అందిస్తోంది. ఈ సంస్థకు ఆమె సీఈవోగా కూడా ఉన్నారు. అలాగే క్యూరోకార్టే అనే లగ్జరీ ఈ-కామర్స్ సంస్థను కూడా ఆమె ప్రారంభించారు. హస్త కళాకృతులు, శిల్పకళా ఉత్పత్తులను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది.

ఇదీ చదవండి: రతన్ టాటా ఫ్రెండ్.. శంతనుకు టాటా మోటార్స్‌లో కీలక బాధ్యతలు

స్వతంత్ర మైక్రోఫిన్
అనన్య బిర్లా తన 17ఏళ్ల వయసులోనే.. మైక్రో లెండింగ్ కంపెనీ 'స్వతంత్ర మైక్రోఫిన్' ప్రారంభించింది. ఈ సంస్థ ఇప్పుడు దేశంలోని రెండో అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీ ఎంఎఫ్ఐగా రికార్డ్ సృష్టించింది. అంతే కాకుండా ఈమె ఏఐ ప్లాట్‌ఫామ్ బీటా వెర్షన్‌ను కూడా ప్రారంభించింది. ఇప్పుడు ముచ్చటగా మూడో వెంచర్ ప్రారభించడానికి సిద్ధమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement