Blackstone Group
-
బ్లాక్‌స్టోన్ చేతికి కేర్ హాస్పిటల్స్ - వివరాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ తాజాగా హైదరాబాద్‌కు చెందిన కేర్ హాస్పిటల్స్‌లో మెజారిటీ వాటాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. టీపీజీ రైజ్ఫండ్స్లో భాగమైన ఎవర్‌కేర్ హెల్త్ ఫండ్ నుంచి 72.5 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు మొత్తం మీద 700 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 5,827 కోట్లు) వెచ్చిస్తున్నట్లు వివరించింది. ఈ లావాదేవీ కోసం కేర్ హాస్పిటల్స్ సంస్థ విలువను రూ. 6,600 కోట్లుగా లెక్కగట్టారు. మరోవైపు, కేరళకు చెందిన కిమ్స్‌హెల్త్ సంస్థలో కేర్ హాస్పిటల్స్, టీపీజీ 80 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ కింద బ్లాక్‌స్టోన్ 300 మిలియన్ డాలర్లు, టీపీజీ 100 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు వివరించాయి. దీంతో బ్లాక్‌స్టోన్ దేశీయంగా ఆరోగ్య సేవల విభాగంలోకి ప్రవేశించినట్లవుతుంది. ఈ రెండు డీల్స్ ద్వారా మొత్తం 1 బిలియన్ డాలర్ల పైచిలుకు ఇన్వెస్ట్ చేసినట్లవుతుంది. సంయుక్త నెట్‌వర్క్‌లో టీపీజీ చెప్పుకోతగ్గ స్థాయిలో వాటాలున్న మైనారిటీ షేర్‌హోల్డరుగా ఉంటుంది. భారత హెల్త్‌కేర్ సర్వీసుల రంగంలో తొలిసారిగా పెట్టుబడులు పెట్టడం, దేశీయంగా అతి పెద్ద హెల్త్‌కేర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు టీపీజీతో జట్టు కట్టడం తమకు సంతోషకరమైన అంశాలని బ్లాక్‌స్టోన్ ఎండీ గణేష్ మణి తెలిపారు. భారీ హాస్పిటల్స్ నెట్‌వర్క్‌లో ఒకటిగా.. కేర్ హాస్పిటల్స్‌కు హైదరాబాద్, వైజాగ్‌తో పాటు ఔరంగాబాద్, నాగ్‌పూర్ తదితర నగరాల్లో ఆస్పత్రులు ఉన్నాయి. కిమ్స్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ సంస్థ .. కేరళలోనే అతి పెద్ద ప్రైవేట్ హెల్త్‌కేర్ ప్రొవైడర్‌గా ఉంది. కిమ్స్‌హెల్త్ చేరికతో దేశీయంగా భారీ హాస్పిటల్స్ చెయిన్‌లో ఒకటిగా కేర్ హాస్పిటల్స్ నెట్వర్క్ ఆవిర్భవించనుంది. ఈ సంయుక్త నెట్‌వర్క్‌కు 11 నగరాల్లో 23 ఆస్పత్రులు, 4,000 పైచిలుకు పడకలు ఉంటాయి. ప్రస్తుతం కిమ్స్హెల్త్కు నేతృత్వం వహిస్తున్న ఎంఐ సహాదుల్లా ఇకపైనా దాని సారథ్య బాధ్యతల్లో కొనసాగుతారు. -
Disney: డిస్నీ కొనుగోలుకు బ్లాక్‌స్టోన్‌తో చర్చలు!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్.. భారతదేశంలోని వాల్ట్‌డిస్నీ స్ట్రీమింగ్, టెలివిజన్ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతుందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. వాల్ట్ డిస్నీ ఇండియాలోని తన కార్యకలాపాలను విక్రయించేందుకు గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్అంబానీతోపాటు ఇతర సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. అయితే భారత మార్కెట్‌పై ఆసక్తి ఉన్న బ్లాక్‌స్టోన్.. డిస్నీ కొనుగోలుకు సిద్ధం అవుతుదని నివేదిక తెలుపుతుంది. ఒకవేళ బ్లాక్‌స్టోన్‌తో ఈ ఒప్పందం కుదరకపోయినా డిస్నీ భారతదేశంలో తన డిజిటల్, టీవీ వ్యాపారాన్ని విక్రయించడానికి ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇంకా బ్లాక్‌స్టోన్, డిస్నీ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. డిస్నీ సబ్‌స్క్రైబర్ అట్రిషన్‌ను ప్రభావం చేసేలా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లో ఉచిత క్రికెట్ కంటెంట్‌ను అందించడంతో ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని యోచిస్తుంది. -
బ్లాక్‌స్టోన్ చేతికి సింప్లిలెర్న్
న్యూఢిల్లీ: ఆధునిక తరం డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసే సింప్లిలెర్న్ సొల్యూషన్స్‌లో పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ మెజారిటీ వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డీల్ విలువ 25 కోట్ల డాలర్లు(రూ. 1,860 కోట్లు)కాగా.. ఎడ్యుటెక్ కంపెనీ సింప్లిలెర్న్‌లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన కలారి క్యాపిటల్, హెలియన్ వెంచర్ పార్ట్నర్స్, మేఫీల్డ్ ఫండ్ ఉమ్మడిగా 60 శాతం వాటాను విక్రయించనున్నాయి. అంతేకాకుండా మరో 10 శాతం వాటాను ప్రమోటర్లు, ఇతర యాజమాన్య వ్యక్తులు విక్రయించనున్నారు. వెరసి కంపెనీ విలువను 40 కోట్ల డాలర్ల(రూ. 2,976 కోట్లు)కు చేరింది. పలు కంపెనీలలో దేశీయంగా బ్లాక్స్టోన్గ్రూప్ ఇప్పటికే బైజూస్, ఆకాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, అసెండ్ లెర్నింగ్, ఎల్యుషియన్ అండ్ ఆర్టిక్యులేట్లలో ఇన్వెస్ట్ చేసింది. అయితే తొలిసారి సింప్లిలెర్న్‌లో మెజారిటీ వాటా కొనుగోలు ద్వారా యాజమాన్య నియంత్రణను చేపడుతోంది. కాగా.. కంపెనీ నిర్వహణ బాధ్యతను కొనసాగించనున్నట్లు సింప్లిలెర్న్ సీఈ వో కృష్ణ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. లాభాలతో.. 2010లో ప్రారంభమైన సింప్లిలెర్న్ గత నాలుగేళ్లుగా లాభాలను ఆర్జిస్తోంది. తొలి దశ నుంచి మధ్యస్థాయి వృత్తి నిపుణుల వరకూ 100 రకాల ప్రోగ్రామ్స్‌ను కంపెనీ అందిస్తోంది. తద్వారా కొత్త తరం డిజిటల్ నైపుణ్యాల మెరుగులో సహకరిస్తోంది. దీనిలో భాగంగా క్లౌడ్, డెవాప్స్, డేటా సైన్స్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ తదితర శిక్షణను సమకూర్చుతోంది. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా వృత్తి నిపుణులు సింప్లిలెర్న్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకుంటున్నారు. పలు దేశ, విదేశీ యూనివర్శిటీలతో కంపెనీ సహకార ఒప్పందాలను కలిగి ఉంది. -
వినతీ కొత్త రికార్డ్- ఎస్సెల్ ప్రొ పతనం
హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఫార్మా రంగ కంపెనీ వినతీ ఆర్గానిక్స్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ కనిపిస్తోంది. అయితే మరోవైపు పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ వాటాను విక్రయించనున్నట్లు వెల్లడికావడంతో ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి వినతీ ఆర్గానిక్స్ షేరు భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. ఎస్సెల్ ప్రొప్యాక్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు ఇలా.. వినతీ ఆర్గానిక్స్ లాక్‌డవున్‌ల నేపథ్యంలోనూ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో జోరందుకున్న వినతీ ఆర్గానిక్స్ మరోసారి దూకుడు చూపుతోంది. ఎన్ఎస్ఈలో తొలుత వినతీ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 1355ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 1325 వద్ద ట్రేడవుతోంది. గత వారం రోజుల్లోనే వినతీ షేరు 36 శాతం దూసుకెళ్లడం విశేషం! ఈ ఏడాది క్యూ1లో నికర లాభం 12 శాతమే క్షీణించి రూ. 72 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా తగ్గి రూ. 232 కోట్లకు చేరింది. అయితే ఇబిటా మార్జిన్లు 0.7 శాతం బలపడి 42 శాతంగా నమోదయ్యాయి. క్యూ2 ఫలితాలపై ఆశావహ అంచనాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎస్సెల్ ప్రొప్యాక్ లామినేటెడ్ ట్యూబ్స్ ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్‌లో మెజారిటీ వాటా కలిగిన బ్లాక్‌స్టోన్ సంస్థ ఎప్సిలాన్ బిడ్కో 23 శాతం వాటాను విక్రయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సెల్ ప్రొప్యాక్‌లో ఎప్సిలాన్‌కు 75 శాతం వాటా ఉంది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. బ్లాక్‌డీల్స్ ద్వారా 7.25 కోట్ల షేర్లను బ్లాక్‌స్టోన్ సంస్థ విక్రయించనున్నట్లు వివరించాయి. తద్వారా బ్లాక్‌స్టోన్ రూ. 1850 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఎస్సెల్ ప్రొప్యాక్ షేరు 6.25 శాతం పతనమై రూ. 256 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 252 దిగువకూ చేరింది. కాగా.. నేటి ట్రేడింగ్‌లో తొలి గంటన్నరలోనే బీఎస్ఈలో 7.68 కోట్లకుపైగా షేర్లు చేతులు మారినట్లు నిపుణులు పేర్కొన్నారు. గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 22,400 షేర్లు మాత్రమేకావడం గమనార్హం. తద్వారా బ్లాక్‌స్టోన్ గ్రూప్ 23 శాతం వాటాను విక్రయించినట్లు చెబుతున్నారు. -
బ్లాక్‌స్టోన్‌తో ‘ప్రెస్టీజ్’ మెగా డీల్!
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం ప్రెస్టీజ్ గ్రూప్ తాజాగా రుణ భారం తగ్గించుకునేందుకు, భవిష్యత్ వృద్ధి ప్రణాళికల్లో భాగంగా వివిధ వాణిజ్య అసెట్స్‌ను విక్రయించే ప్రయత్నాల్లో ఉంది. ఇందుకోసం అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్‌తో చర్చలు జరుపుతోంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 12,000 కోట్ల నుంచి రూ.13,500 కోట్ల దాకా ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ భారీ ఒప్పందం ప్రస్తుత త్రైమాసికంలోనే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రెస్టీజ్ ఎస్టేట్ సుమారు 8 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న ఆఫీస్ పార్క్‌లు (నిర్మాణం పూర్తయినవి), దాదాపు 4 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న తొమ్మిది మాల్స్ (ఇప్పటికే కార్యకలాపాలు జరుగుతున్నవి) విక్రయించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక నిర్మాణంలో ఉన్న మరో 3–4 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న ఆఫీస్ ప్రాజెక్టుల్లో 50 శాతం దాకా వాటాలను కూడా విక్రయించవచ్చని వివరించాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఈ అసెట్స్ ఉన్నాయి. మొత్తం 16 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న ఆఫీస్ పార్కులు, తొమ్మిది మాల్స్, రెండు హోటళ్లతో కలిపి ఉన్న పోర్ట్‌ఫోలియో విలువ దాదాపు 1.6–1.8 బిలియన్ డాలర్ల మేర ఉండవచ్చని పేర్కొన్నాయి. భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి.. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రుణభారం ప్రస్తుతం రూ. 8,000 కోట్ల స్థాయిలో ఉంది. ప్రతిపాదిత లావాదేవీ ద్వారా వచ్చే నిధుల్లో కొంత భాగాన్ని రుణాలను తీర్చివేసేందుకు కంపెనీ ఉపయోగించనుంది. అలాగే, భవిష్యత్ వృద్ధి అవకాశాల కోసం మిగతా నిధులను వినియోగించనుంది. భారీ విలువ డీల్..: ఒకవేళ ప్రెస్టీజ్ గ్రూప్, బ్లాక్‌స్టోన్ మధ్య డీల్ కుదిరితే రియల్టీలో వేల్యుయేషన్‌పరంగా అత్యంత భారీ ఒప్పందంగా నిలవనుంది. కొన్నాళ్ల క్రితం డీఎల్ఎఫ్ తమ కమర్షియల్ పోర్ట్‌ఫోలియోలో 33% వాటాను సింగపూర్ సార్వభౌమ ఫండ్ జీఐసీకి రూ. 9,000 కోట్లకు విక్రయించింది. అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్ ఇప్పటిదాకా భారత రియల్ ఎస్టేట్ రంగంలో 8 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసింది. -
ఇమామీ దూకుడు- ప్రెస్టేజ్ హైజంప్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో అంచనాలకు అనుగుణమైన ఫలితాలు ప్రకటించడంతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ లిమిటెడ్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క రుణ భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా ఆస్తుల విక్రయ సన్నాహాల్లో ఉన్నట్లు వెలువడిన అంచనాలతో రియల్టీ కంపెనీ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఇమామీ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో ఇమామీ లిమిటెడ్ నికర లాభం స్వల్ప వృద్ధితో రూ. 40 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం 26 శాతం క్షీణించి రూ. 481 కోట్లను తాకింది. కోవిడ్ నేపథ్యంలోనూ ఇబిటా మార్జిన్లు 4.9 శాతం బలపడి 25.5 శాతానికి చేరాయి. ఈ కాలంలో 12 కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా రూ. 192 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను పూర్తిచేసినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఇమామీ లిమిటెడ్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 19 శాతం దూసుకెళ్లింది. రూ.306 వద్ద ట్రేడవుతోంది. ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్.. కంపెనీకి చెందిన లీజు ఆదాయ ఆస్తులను కొనుగోలు చేయనున్నట్లు వెలువడిన వార్తలు ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నాయి. దీంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ప్రెస్టేజ్ ఎస్టేట్స్ షేరు 5 శాతం( రూ. 10.5) ఎగసి రూ. 236 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 238ను అధిగమించింది. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్‌కు చెందిన అద్దె ఆదాయ ఆస్తులను 170 కోట్ల డాలర్లకు(రూ. 12,745 కోట్లు) బ్లాక్‌స్టోన్ గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. -
బ్లాక్ స్టోన్ చేతికి కాఫీ డే గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్
న్యూఢిల్లీ: కాఫీ డే ఎంటర్ప్రైజెస్ కంపెనీ బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను రూ.2,700 కోట్లకు విక్రయించింది. ఈ ప్రొపర్టీని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్, రియల్టీ సంస్థ సలర్పూరియా సత్వలకు విక్రయించామని కాఫీ డే ఎంటర్ప్రైజెస్ తెలిపింది. ఈ మేరకు సదరు సంస్థలతో నిశ్చయాత్మక ఒప్పందాలు కుదుర్చుకున్నామని పేర్కొంది. తమ ప్రధాన వ్యాపారంపై దృష్టి కేంద్రీకరించడానికి, రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ ప్రాపర్టీని విక్రయించామని వివరించింది. ఈ డీల్ వచ్చే నెల 31లోపు పూర్తవ్వగలదని అంచనా. ప్రమోటర్ సిద్దార్థ ఆత్మహత్య తర్వాత రుణ భారం తగ్గించుకునే చర్యల్లో భాగంగా కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఆస్తులను విక్రయిస్తోంది. పోర్ట్ టర్మినల్స్, కంటైనర్ ప్రైయిట్ స్టేషన్స్ నిర్వహించే తన అనుబంధ సంస్థ, సికాల్ లాజిస్టిక్స్ రుణ భారం తగ్గించుకోవడంపై కూడా కాఫీ డే ఎంటర్ప్రైజెస్ దృష్టి పెట్టింది. సికాల్ లాజిస్టిక్స్ బహిర్గత రుణాలు రూ.1,488 కోట్ల మేర ఉంటాయని గత వారమే ఈ కంపెనీ ప్రకటించింది. ►గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ విక్రయ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ షేర్ 2 శాతం నష్టంతో రూ.72.75 వద్ద ముగిసింది. -
మిగిలిన వాటానూ కొంటున్న బ్లాక్‌స్టోన్!
ముంబై: ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ కమర్షియల్ ప్రొపరీ్టస్లో మిగిలిన 50 శాతం వాటాను బ్లాక్‌స్టోన్ గ్రూప్ కొనుగోలు చేయనున్నదని సమాచారం. ఈ మేరకు బ్లాక్‌స్టోన్‌తో ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డీల్ విలువ రూ.4,420 కోట్లు ఉండొచ్చని అంచనా. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి బ్లాక్‌స్టోన్ కంపెనీ నిరాకరించింది. గత ఏడాది మార్చిలో ఇండియాబుల్స్ కమర్షియల్ ప్రొపరీ్టస్లో 50 శాతం వాటాను బ్లాక్‌స్టోన్ కంపెనీ రూ.4,750 కోట్లకు కొనుగోలు చేసింది. -
బ్లాక్‌స్టోన్ చేతికి వన్ బీకేసీ బిల్డింగ్
ముంబై: అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, బ్లాక్‌స్టోన్... ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లో ఉన్న ఎనిమిది అంతస్తుల వన్ బీకేసీ బిల్డింగ్‌లో దాదాపు సగం ఆఫీస్ స్పేస్‌ను కొనుగోలు చేసింది. రేడియస్ డెవలపర్ నుంచి వన్ బీకేసీలో 0.7 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్‌ను బ్లాక్‌స్టోన్ సంస్థ రూ.2,500 కోట్లకు కొనుగోలు చేసింది. దేశీయ ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్లో ఇదే అతి పెద్ద డీల్. రెండున్నర ఎకరాల్లో విస్తరించిన వన్ బీకేసీ బిల్డింగ్‌లో అమెజాన్, ఫేస్బుక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హిటాచి, తదితర దిగ్గజ కంపెనీల కార్యాలయాలున్నాయి. వన్ బీకేసీ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి రేడియస్ సంస్థ రూ.1,600 కోట్ల రుణం తీసుకుంది. తాజా డీల్‌తో వచ్చిన నిధులను ఈ రుణాన్ని తీర్చడానికి ఉపయోగించాలని రేడియస్ భావిస్తోంది. 1.040 కోట్ల డాలర్ల పెట్టుబడులు..: బ్లాక్‌స్టోన్ సంస్థ, భారత్‌లో 2005 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ 1,040 కోట్ల డాలర్లు భారత్‌లో పెట్టుబడులు పెట్టింది. దేశీయ రియల్టీ రంగంలో అతి పెద్ద అంతర్జాతీయ ఇన్వెస్టర్ ఈ సంస్థే. మన రియల్టీ రంగంలో ఈ కంపెనీ ఇప్పటివరకూ 540 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్లాక్‌స్టోన్ కంపెనీ ప్యాకేజింగ్ కంపెనీ ఎస్సెల్ ప్రో ప్యాక్‌లో మెజారిటీ వాటాను రూ.3,211 కోట్లకు కొనుగోలు చేసింది. ఇటీవలనే ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్‌లో 97.7 శాతం వాటాను రూ.3,000కోట్లకు చేజిక్కించుకుంది.ఎంబసీ సంస్థ భాగస్వామ్యంలో దేశంలోనే తొలి రీట్‌ను ఎంబీస్ ఆఫీస్ పార్క్స్ రీట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎంబసీ గ్రూప్‌తో పాటు ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, పంచశీల్ రియల్టీ, కె.రహేజా కార్పొ, తదితర డెవలపర్లతో కూడా భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. -
దేశీ రిటైల్‌లోకి ‘బ్లాక్ స్టోన్’!
• నెక్సస్ మాల్స్ పేరిట ఇప్పటికే సొంత సబ్సిడరీ • నష్టాల్లో ఉన్న మాల్స్‌ను చేజిక్కించుకునే వ్యూహం • అహ్మదాబాద్, అమృత్‌సర్‌లో భారీ మాల్స్ కొనుగోలు • ఏడాది చివరికల్లా మరిన్ని కొనుగోళ్లు; త్వరలో ప్రకటన? ముంబై: ప్రపంచంలో అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ(పీఈ) దిగ్గజం బ్లాక్‌స్టోన్ గ్రూప్ భారత రిటైల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. భారీ వృద్ధి అవకాశాలున్న దేశీ రిటైల్ మార్కెట్లో అదృష్టాన్ని పరీక్షించుకోవటం కోసం సొంతంగా నెక్సస్ మాల్స్ పేరిట అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. కష్టాల్లో ఉన్న షాపింగ్ మాల్స్‌ను చేజిక్కించుకుని, మళ్లీ వాటిని లాభాలబాట (టర్న్‌ఎరౌండ్) పట్టించడంపై దృష్టిసారిస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్, అమృత్‌సర్‌లో ‘ఆల్ఫా వన్’ మాల్స్‌ను కొనుగోలు చేసింది. దాదాపు 1.3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంగల రిటైలింగ్ స్పేస్ ఈ మాల్స్‌కు ఉంది. ఈ ఏడాది చివరికల్లా మరికొన్ని షాపింగ్ సెంటర్లను దక్కించుకోవడం ద్వారా దీన్ని 2.4 మిలియన్ చదరపుటడుగులకు చేర్చాలని బ్లాక్‌స్టోన్ లక్ష్యిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ప్రపంచవ్యాప్తంగా 1000 మాల్స్... పీఈ ఇన్వెస్ట్మెంట్లలో పేరొందిన బ్లాక్‌స్టోన్ అంతర్జాతీయంగా ఇప్పటికే రిటైల్ బిజినెస్‌లో భారీ పెట్టుబడులు పెట్టింది. అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్ దేశాల్లో ఈ సంస్థకు 1,000కి పైగానే షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అమెరికాలో తన అనుబంధ సంస్థ ‘బ్రిక్స్మార్’ సంస్థ ద్వారా రిటైల్ మాల్స్‌ను నడుపుతోంది. ఇక 14 యూరోపియన్ దేశాల్లో ‘మల్టీ’ అనే కంపెనీ ద్వారా వీటిని నిర్వహిస్తోంది. కాగా, భారత్‌లోకి ఎంట్రీని అధికారికంగా త్వరలో బ్లాక్‌స్టోన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో ఆఫీస్ స్పేస్‌కు సంబంధించి ఈ సంస్థ దిగ్గజ స్థానంలో ఉంది. ‘బ్లాక్‌స్టోన్ వంటి ఇన్వెస్టర్ రిటైల్ రంగంలోకి రావడం వల్ల ప్రస్తుతం ఉన్న మాల్స్ డెవలపర్లకు తాజా నిధులు అందుబాటులోకి వస్తాయి. దీంతో కొత్త వాణిజ్య సముదాయాలను నిర్మించేందుకు పెట్టుబడులు లభిస్తాయి. అంతేకాదు!! ఇలాంటి పెద్ద సంస్థల రాకతో మాల్ మేనేజ్మెంట్లో నైపుణ్యాలు పెరుగుతాయి’’ అని రియల్టీ పరిశోధన సంస్థ సీబీ రిచర్డ్స్ అండ్ ఎల్లీస్ ఇండియా రిటైల్ సర్వీసెస్ హెడ్ వివేక్ కౌల్ చెప్పారు. ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే... భారత్‌లో జాతీయ స్థాయిలో గొలుసు కట్టు షాపింగ్ మాల్స్ ఉన్న సంస్థలు తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు. భారీగానే డిమాండ్... భారత సంస్థాగత రిటైల్ రంగంలో డిమాండ్ జోరుగానే కొనసాగుతోందని... ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థలైన మాసిమి డుటి, లాంగ్చాంప్, కోల్ హన్, హంకెమాలర్ వంటి రిటైల్ సంస్థలు ఇక్కడ అవుట్లెట్లను ఏర్పాటు చేస్తుండటమే దీనికి నిదర్శనమని సీబీఆర్ఈ తాజా నివేదిక తెలిపింది. మరోపక్క, జారా, హెచ్ అండ్ ఎం, గ్యాప్, మార్క్స్ అండ్ స్పెన్సర్ వంటి దిగ్గజ బ్రాండెడ్ రిటైల్ సంస్థలు కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. అయితే, గ్లోబల్ రిస్క్ ఇన్వెస్టర్లు ఇక్కడి రిటైల్ అసెట్స్‌లో పెట్టుబడులకు కాస్త వెనుకంజ వేస్తున్నారని సంస్థ తెలియజేసింది. ‘‘భారత్‌లో షాపింగ్ మాల్ కార్యకలాపాల్లో కొత్త ఒరవడిని తీసుకురావడం, వినియోగదారుల వ్యవహారశైలిలో మార్పు తేవటం అనేది నెక్సస్ మాల్స్‌కు కీలకంగా నిలుస్తుంది. ఎందుకంటే వినియోగ వృద్ధి అవకాశాలు భారీగానే ఉన్నప్పటికీ.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో మాల్స్ నిలదొక్కుకోవడం కష్టతరంగానే ఉంది’’ అని రిటైల్ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.